పులివెందుల: వివేకా హత్యపై సీఎం జగన్ గురువారం పులివెందుల సభలో చేసిన వ్యాఖ్యలపై డాక్టర్ సునీతారెడ్డి స్పందించారు. హత్యకు గురయ్యేంత వరకు మీ కోసమే కృషి చేసిన వ్యక్తి గురించి మాట్లాడ్డానికి ఒక్క మంచి మాట కూడా గుర్తు రాలేదా మీకు అని జగన్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన పోయాక కూడా ఎందుకింత ద్వేషం? ఇవాళ మీ మాటల్లో ఆయనపై ద్వేషం కనిపిస్తోంది. వివేకా మీకు ఏం ద్రోహం చేశారు? మీ కోసం త్యాగం చేశాడు కాబట్టి అంత ద్వేషం పెంచుకున్నారా… ప్రజలకు దీనిపై మీరు సమాధానం ఇవ్వాలి. 2019లో వివేకా చనిపోయినప్పుడు సీబీఐ విచారణ కోరుతూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.. మళ్లీ మీరే ఆ కేసును వెనక్కి తీసుకున్నారు. ఇటీవలే మీ వాళ్లు కడప కోర్టులో గ్యాగ్ ఆర్డర్స్ కోరుతూ పిటిషన్ వేసి, కోరుకున్న విధంగానే కోర్టుతో ఆదేశాలు తెప్పించుకున్నారు.. మళ్లీ మీరే వివేకా అంశంపై మాట్లాడతారు. మీకు కోర్టులంటే, పోలీసులంటే, సీబీఐ అంటే గౌరవం లేదా? వివేకాను చంపింది వీళ్లు, చంపించింది వీళ్లు అని సీబీఐ వాళ్లు చెబుతున్నారు… కానీ మీరేమో సీబీఐపై నమ్మకం లేదన్నట్టుగా అవినాష్ రెడ్డి నిర్దోషి అని చెబుతారు.
ఇక ఏ వ్యవస్థపై నమ్మకం ఉంది మీకు అని జగన్‌ను సునీత సూటిగా ప్రశ్నించారు. ఒకవేళ వివేకాను చంపింది మీరు చెబుతున్నట్లుగానే నా భర్త రాజశేఖర్ రెడ్డి, లేక వాళ్ల అన్నయ్య శివప్రకాశ్ రెడ్డి అయితే ముఖ్యమంత్రిగా ఉన్న మీరు అరెస్ట్ చేయించొచ్చు కదా! ఈ దాగుడు మూతలు ఎందుకు? తప్పు చేసి ఉంటే ఎవరికైనా శిక్ష పడాల్సిందే. అవినాష్ రెడ్డి చిన్నపిల్లవాడు అంటారు. ఎంపీగా పోటీ చేస్తుండడం ఇది మూడోసారి. చిన్నపిల్లవాడైతే స్కూలుకు వెళ్లాలి కానీ ఎన్నికల్లో పోటీ చేయరు. నిందితులు అని సీబీఐ చెప్పినవాళ్లను మీరెందుకు వెనకేసుకొస్తున్నారు? పైగా, మేం విపక్షాలతో చేయి కలిపామంటున్నారు. మీ చిన్నాన్నను గొడ్డలితో అతి కిరాతకంగా నరికి చంపారు. ఐదేళ్లుగా మేం పోరాడుతుంటే ఇప్పుడు మీకు ఈ విషయంలో రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఈ ఎన్నికల సందర్భంగా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే… నిందితులు అని సీబీఐ పేర్కొన్న వాళ్లను ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వకండి… వారికి ఓట్లు వేయకండి. నేను ఈ ఎన్నికల్లో మద్దతు ఇచ్చేది ఒక్క షర్మిలకు మాత్రమే. ఈ ఎన్నికల్లో షర్మిల గెలిస్తే వివేకానందరెడ్డి కోరిక తీరుతుందని సునీతారెడ్డి స్పష్టం చేశారు.
నుదుటిపై బ్యాండేజి తీసేయండి
సీఎం జగన్ నుదిటిపై చిన్న గాయానికి బ్యాండేజ్ ఇంకా ఎన్ని రోజులు ఉంచుకుంటారని డాక్టర్ సునీత ఎద్దేవా చేశారు. ఆ బ్యాండేజ్ తీసేస్తే గాయానికి గాలి తగిలి ఎండిపోతుంది, త్వరగా మానిపోతుందని సలహా ఇచ్చారు. సీఎం జగన్‌పై ఏప్రిల్ 13న విజయవాడలో గుర్తు తెలియని వ్యక్తులు రాయి విసరగా నుదుటిపై గాయం కావడం తెలిసిందే. ఆయన ఇప్పటికీ నుదుటిపై బ్యాండేజితోనే దర్శనమిస్తున్నారు. దీనిపై ఇవాళ వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి స్పందించారు.