అమరావతి: ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా టీడీపీ సీనియర్ నేత, నర్సీపట్నవ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్పీకర్ పదవికి ఒకే నామినేషన్ రావడంతో అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. అసెంబ్లీ సమావేశాల రెండో రోజు శనివారం అయ్యన్నపాత్రుడు అసెంబ్లీ స్పీకర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. శుక్రవారం అయ్యన్నపాత్రుడి తరఫున కూటమి నేతలు పవన్ కల్యాణ్, నారా లోకేష్, అచ్చెన్నాయుడు, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్, ధూళిపాళ్ల నరేంద్ర నామినేషన్ పత్రాలను సమర్పించారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీలో కొనసాగుతున్న నేతల్లో అయ్యన్న ఒకరు. 1983లో మొదటిసారి నర్సీపట్నం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఏడు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, ఒకసారి ఎంపీగా విజయం సాధించారు. గతంలో మంత్రిగానూ వ్యవహరించారు.
శాసనసభ నేటికి వాయిదా
మరోవైపు శాసనసభ శనివారానికి వాయిదా పడిరది. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం సభను వాయిదా వేస్తున్నట్లు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రకటించారు. శుక్రవారం 172 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయించారు. అందుబాటులో లేకపోవడం, ఇతరత్రా కారణాలతో ముగ్గురు సభ్యులు ప్రమాణస్వీకారం చేయలేదు. వారిలో పితాని సత్యనారాయణ (ఆచంట), వనమాడి వెంకటేశ్వరరావు (కాకినాడ సిటీ), జీవీ ఆంజనేయులు (వినుకొండ)ఉన్నారు. ఆ ముగ్గురితో శనివారం ప్రమాణం చేయించనున్నారు. వారి ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక ఉంటుంది.