- అధికారంలోకి రాగానే జీఓ 3 తిరిగి తెస్తాం
- చంద్రబాబు అంటే బ్రాండ్..జగన్ అంటే జైలు
- తల్లి, చెల్లి నమ్మరు.. నిన్ను జనమెందుకు నమ్మాలి
కురుపాం: ఇచ్చిన హామీలు ఆరు నెలల్లో నెరవేర్చుతానని ఎన్నికల ముందు చెప్పిన జగన్.. మళ్లీ ఎన్నికలు రెండు నెలల్లోకి వచ్చినా వాటిని అమలు చేయలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. చంద్రబాబు పేదలకోసం పని చేస్తే..జగన్ పెత్తందారుల కోసం పని చేస్తున్నాడని ధ్వజమెత్తారు. ఉమ్మడి విజయనగరం జిల్లా కురుపాంలో మంగళవారం జరిగిన శంఖారావం సభలో లోకేష్ మాట్లాడుతూ టీడీపీ హయాంలో అమలు చేసిన విదేశీవిద్య పథకాన్ని జగన్‌రెడ్డి రద్దు చేశాడన్నారు. జగన్ కూతుర్లు విదేశాల్లో చదవచ్చుకానీ, మన గిరిజన బిడ్డలు విదేశాల్లో చదవకూడదా అని ప్రశ్నించారు. గిరిజనుల గొంతును జగన్ కోసేశాడు. 16 సంక్షేమ పథకాలు గిరిజనులకు రాకుండా రద్దు చేశాడు.
టీడీపీ ` జనసేన అభ్యర్థిని గెలిపిచండి మళ్లీ 16 పథకాలు అమలు చేస్తాం. పోరాటాల గడ్డ ఉత్తరాంధ్ర..ఉద్యమాల గడ్డ ఈ ఉత్తరాంధ్ర. రాజులు ఏలిన గడ్డ ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా. శ్రీ పైడితల్లి అమ్మవారు వెలిసిన ప్రాంతం. మన్యం వీరుడు అల్లూరి నడిచిన పుణ్యభూమి ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా. మంచి మనసుతో ఏ పని ప్రారంభించినా విజయం సాధిస్తాం..అలాంటి మంచి మనసున్న వారు ఉన్న గొప్పనేల ఉమ్మడి ఉమ్మడి విజయనగరం జిల్లా. ఉమ్మడి విజయనగరం జిల్లా వాసులకు రాజకీయ చైతన్యం ఎక్కువ. ఇంత పవిత్రమైన భూమికి వచ్చి మీ ముందు మాట్లాడటం తన అదృష్టమని లోకేష్ అన్నారు.
జీవో నంబర్-3పై ఎందుకు నిలదీయలేదు
గిరిజన ప్రాంతాల్లో కేవలం గిరిజనులకు మాత్రమే ఉద్యోగ హక్కు కల్పించేలా నాడు చంద్రబాబు జీవో నంబర్-3ను తీసుకొచ్చారు. దాన్ని వైసీపీ ప్రభుత్వం వచ్చాక హైకోర్టు కొట్టేసింది. దానిపై జగన్ కనీసం సుప్రీంకోర్టుకు అప్పీల్ కు వెళ్లలేదు. డిప్యూటీ సీఎంగా పని చేసిన పుష్పశ్రీవాణి జీవో నంబర్-3పై ఎందుకు జగన్ ను నిలదీయలేదు. ఎస్టీ సోదరులకు హామీ ఇస్తున్నా. టీడీపీ ప్రభుత్వం వచ్చాక మళ్లీ జీవో నంబర్-3 ని అమలు చేస్తాం. ఈ మధ్య జగన్ మళ్లీ నేను మీ బిడ్డను అంటున్నాడు..మీరంతా చాలా జాగ్రత్తగా ఉండాలి. జగన్ మీ బిడ్డ అంటున్నాడని అతని వలలో పడొద్దు. మీ బిడ్డను కదా..మీ భూములు కూడా రాసివ్వండిని అడుగుతాడని లోకేష్ ఎద్దేవా చేశారు.
దేనికి సిద్ధం
రోజుకో నాటకం..రోజుకో డ్రామా చేసే వ్యక్తి ఈ జగన్. వెయ్యి కోట్ల ఖర్చుపెట్టి సిద్ధం అని ప్లెక్సీలు వేస్తున్నాడు. దేనికి సిద్ధం..ఇసుకను బంగారం చేయడానికి సిద్ధమా. ప్రజల్ని వేధించడానికి సిద్ధమా జగన్. బూమ్ బూమ్, ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్రాగోల్డ్ మద్యం ధరలు పెంచడానికి సిద్ధమా. చంద్రబాబులా ఇమేజ్ పెంచుకోవడానికి జగన్ తాపత్రయ పడుతున్నాడు..కానీ అది అసాధ్యం. చంద్రబాబు అంటే బ్రాండ్..జగన్ అంటే జైలు. జగన్ ను చూస్తే కోడికత్తి గుర్తొస్తుంది..కానీ చంద్రబాబును చూస్తే కియా కార్లు గుర్తొస్తాయి. ఎక్కడ చూసినా మా నమ్మకం నువ్వే జగన్ అని బోర్డులు పెడతున్నాడు. సొంత చెల్లి, తల్లి నిన్ను నమ్మడం లేదు..నిన్ను మేమెందుకు నమ్మాలని లోకేష్ ప్రశ్నించారు.
హామీలేమయ్యాయి..
విజయనగరం జిల్లాకు జగన్ 50 హామీలిచ్చాడు. భోగాపురం విమనాశ్రయం పూర్తి చేస్తానన్నాడు.. రామతీర్థం ప్రాజెక్టూ పూర్తి చేస్తాన్నాడు. జంరaావతి-చంపావతి నదులు అనుసంధానం చేస్తానని చెప్పాడు. రామభద్రాపురంగడ్డ పూర్తి చేస్తానన్నాడు చేశాడా? సాలూరు బైపాస్, పాలేరు నదిపై డ్యాం నిర్మిస్తానన న్నాడు… స్వర్ణముఖి, చింతగడ్డపై బ్రిడ్జి నిర్మిస్తాన న్నాడు… చేశాడా.. చేయలేదని లోకేష్ అన్నారు.
పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చాం
ఉమ్మడి విజయనగరం జిల్లాను అభివృద్ధి చేసింది టీడీపీనే. పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇచ్చాం. భోగాపురం ఎయిర్ పోర్టుకు భూ సేకరణ, రోడ్లు, టిడ్కో ఇళ్లు, కాల్వల ఆధునీకరణ చేశాం. కురుపాంలో టీడీపీ గెలవకపోయినా వందల కోట్లతో అభివృద్ధి చేశాం. తోటపల్లి ప్రాజెక్టుకు రూ.450 కోట్లు కేటయించి సాగు, తాగు నీరు అందించాం. 33 ఎస్టీ గ్రామాలకు నిధులు కేటాయించి బీటీ రోడ్లు వేశాం. సీసీ రోడ్లు, కమ్యూనిటీ భవనాలు నిర్మించామని లోకేష్ చెప్పారు.
కురుపాంను దోచుకుంటున్నారు
2019లో టిక్ టాక్ ఆంటీని మీరు గెలిపించారు. పుష్పశ్రీవాణిని మీరు గెలిపిస్తే ముగ్గురు ఎమ్మెల్యేలను ఆమె మీకు ఇచ్చింది. పుష్పశ్రీవాణి, తమ్ముడు, భర్త కలిసి కురుపాంను దోచుకుంటున్నారు. ఔట్ సోర్సింగ్ నుండి కాంట్రాక్ట్ పోస్టులు దాకా అన్నీ అమ్ముకుంటున్నారు. నాగావళి నది నుండి ఇసుక దోచుకుంటున్నారు. ఆర్ అండ్ బి, ఐటీడీఏ, ఉపాధి పనులు ఎమ్మెల్యే మరిది రమేష్ బాబు చూసుకుంటున్నాడు. పుష్పశ్రీవాణికి మీరు రెండు సార్లు అవకాశం ఇచ్చారు..మీ జీవితాల్లో మార్పులు వచ్చాయా. గ్రామాల్లో ఏమైనా మార్పు వచ్చిందా..మీకు ఆదాయం పెరిగిందా. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిని గెలిపించండి. పూర్ణపాటు` లావేసి బ్రిడ్జి పూర్తి చేస్తాం. ఏనుగుల వల్ల రైతులు నష్టపోతున్నారు..ఆ సమస్యను పరిష్కరిస్తాం. గుమ్మడి గడ్డ మినీరిజర్వాయర్ పూర్తి చేస్తాం. తోటపల్లి ప్రాజెక్టు అదనపు ఆయకట్టుకు నీరందిస్తాం. జంఘావతి-వట్టిగడ్డ ఆధునీకరణ పనులు పూర్తి చేస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
ఎల్లప్పుడూ అండగా ఉంటా
నాడు, నేడు ఎప్పుడూ మీకు అండగా ఉంటా. ఎంత ఆలస్యమైనా సాయంత్రం నా సెల్ ఒకసారి చూసుకుంటా. దొంగ కేసులు పెట్టి నా కార్యకర్తలను జగన్ అరెస్టు చేయించారేమో అని చూస్తాను. కార్యకర్తలపై అక్రమంగా కేసులు పెడుతున్నారు. కార్యర్తలకు బంపర్ ఆఫర్ ఇస్తున్నా…2014 నుండి 19 వరకకు ఎవరు ఎక్కువ కేసులు పెట్టించుకుంటారో వారికే నామినేటెడ్ పదవి ఇస్తానని లోకేష్ ప్రకటించారు.
ఇంటింటికీ తిరగాలి
క్లస్టర్, యూనిట్, బూత్, మండల అద్యక్షులకు పిలుపునిస్తున్నా…సూపర్ ` 6 పథకాలు ప్రతి ఇంటికి చేరాలి. 5 రోజుల్లో 250 గడపల్లో తిరిగి వివరించాలి. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో పవనన్న ఏపీకి రావడానికి విమానం బుక్ చేసుకుంటే రద్దు చేశారు. రోడ్డు మార్గాన వస్తుంటే రాకుండా అడ్డుకున్నారు. చంద్రబాబును జైల్లో కలిసిన మరుక్షణమే కలిసి పోటీ చేయాలని పవన్ నిర్ణయించారు. మన నినాదం ఒక్కటే హలో ఏపీ…బైబై వైసీపీ అని లోకేష్ పిలుపు ఇచ్చారు.