- మాచర్లలో స్థలాన్ని ఆక్రమించి తప్పుడు పత్రాలు
- చంపుతామని బెదిరించి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు
- ప్రజావిజ్ఞప్తుల కార్యక్రమంలో నేతలకు బాధితుడి గోడు
మంగళగిరి(చైతన్యరథం): మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మరో భూ కబ్జా వెలుగులోకి వచ్చింది. తాటిపర్తి సాంబశివారెడ్డి, బండారు శ్రీనివాసరావు ఇద్దరూ కలిసి పల్నాడు జిల్లా మాచర్ల పట్టణంలోని రామాటాకీస్ లైన్‌లో 1,161.6 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకోగా ఆ స్థలాన్ని గత ప్రభుత్వ హయాంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని తమ్ముడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలు కబ్జా చేశారని బాధితులలో ఒకరైన తాటిపర్తి సాంబశివారెడ్డి సోమవారం మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ప్రజా విజ్ఞప్తుల దినంలో ఫిర్యాదు చేశారు. స్థలాన్ని కబ్జా చేసిందే కాక తనను బెదిరించి తప్పుడు కేసులు పెట్టి ఇబ్బంది పెట్టారని, దానికి తప్పుడు పత్రాలు సృష్టించారని వివ రించాడు. తనను కొట్టి బలవంతంగా రిజిస్ట్రర్ చేయించుకున్నారని, వారిపై కఠిన చర్యలు తీసుకుని బలవంతంగా చేయించకున్న రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయాలని విన్నవించారు. సోమవారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నేతలు జి.వి.రెడ్డి, వైకుంఠం ప్రభాకర్ చౌదరి, బుచ్చిరాంప్రసాద్‌లు అర్జీలు స్వీకరించారు. బాధితుడి సమస్య విన్న వారు వెంటనే రెవెన్యూ అధికారులకు ఫోన్ చేసి విచారించి న్యాయం చేయాలని ఆదేశించారు.
పొలాన్ని ఆక్రమించి వైసీపీ నేత దందా
తాము పొలం కొనుగోలు చేసి రూ.20 లక్షల వరకు భూమిని బాగు చేసుకునేందుకు ఖర్చు పెట్టి అరటి తోట వేసుకోగా రాజంపేట మండలం పోలి గ్రామానికి చెందిన వైసీపీ నేతలు మాలక్కాలయ మురళీమోహన్‌రెడ్డి, అతని అనుచరులు తోటలోకి వచ్చి పంటను, బోరు పైపులను ధ్వంసం చేసి నిప్పు పెట్టి బూడిద చేశారని అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన భోనం అనురాధ ఫిర్యాదు చేశారు. ఫెన్సింగ్ రాళ్లను ధ్వంసం చేసి తమ భూమిని కబ్జా చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. ఆన్‌లైన్‌లో పేర్లు మార్చారని.. ప్రశ్నిస్తే.. చంపు తామని బెదిరిస్తున్నారని వివరించింది. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని, వారిపై కఠిన చర్యలు తీసుకుని తన భూమి తనకు దక్కేలా చూడాలని విన్నవించుకుంది.
మాజీ ఎమ్మెల్యే, సోదరుడు భూమి కబ్జా చేశారు
తాను కొనుగోలు చేసిన భూమిని మాజీ ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి, అతని సోదరుడు చంద్రశేఖర్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు కబ్జా చేసి రాళ్లు పాతారని టీడీపీ స్టేట్ లీగల్ సెల్ సెక్రటరీ పి.లక్ష్మన్న ఫిర్యాదు చేశారు. తనను చంపేదుకు చూశారని.. వారి నుంచి తనను కాపాడి భూమిని కబ్జా నుంచి విడిపించాలని వేడుకున్నారు.
` తన పెద్ద కొడుకు మోహిత్ తేజ గత ఏడాది నవంబరు 1న మధ్యాహ్నం 1.15 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని.. పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని విజయవాడకు చెందిన మురళి ఫిర్యాదు చేశారు. ఎవరైనా కిడ్నాప్ చేశా రేమోనన్న అనుమానం ఉందని.. దయచేసి తన కొడుకు అదృశ్యంపై విచారించి నిజాలను నిగ్గు తేల్చాలని కన్నీరు మున్నీరయ్యాడు.
టీడీపీకి అనుకూలంగా ఉన్నామని అక్రమ కేసులు, రౌడీషీట్లు
తాము టీడీపీకి అనుకూలంగా ఉండటంతో తమ ఇళ్లపైకి వచ్చి వృద్ధులు, పిల్లలు అని కూడా చూడకుండా రాడ్లు, కర్రలతో కొట్టి అన్యాయంగా ఎస్సీ, ఎస్టీ అక్రమ కేసులు పెట్టారని సత్తెనపల్లి మండలం భట్లూరి గ్రామానికి చెందిన మల్లికార్జునరావు ఆవేదన వ్యక్తం చేశాడు. తమపై రౌడీ షీట్‌లు కూడా ఓపెన్ చేశారని.. పోలీసులు వైసీపీ నేతలకు తొత్తులుగా మారి అక్రమ కేసులు పెట్టారని, వాటిని ఎత్తివేయాలని కోరాడు.
` తమకు వారసత్వంగా వచ్చిన భూమిని చెన్నూరు నాగేంద్ర, చెన్నూరు శినయ్య, చెన్నూరు వెంకటరమణ, చెన్నూరు నరసింహులు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి అమ్మేశారని అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం యార్లగడ్డ గ్రామానికి చెందిన పోకూరి సుబ్బయ్య, వెంకటయ్య, నల్లగండ్ల సుబ్బయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అక్రమాలపై విచారణ చేయించి తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
` సత్యసాయి జిల్లా కుర్లి తలుపుల మండలం ఈరప్పగారిపల్లికి చెందిన బండారు శ్రీరాములు విజ్ఞప్తి చేస్తూ.. తన తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన భూమిని గొల్ల నారాయ ణ, ఈరగాని గంగన్న, ఈరగాని వెంకట రమణలు ఆక్రమించుకున్నారని తమ భూమిని తమకు ఇప్పించి ఆదుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.
హోంగార్డుల వినతిపత్రం
` ఏపీలో హోంగార్డులుగా పనిచేస్తున్న తమకు పోలీసు నియామకాల్లో అన్యాయం జరుగుతుందని పలువురు తమ సమస్యను చెప్పుకున్నారు. అర్హత ఉన్నా హోంగార్డులుగానే మిగిలిపోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హోంగార్డు నియామకాల్లో ఎత్తు 165 సెంటీమీటర్లు కొలుస్తుంటే పోలీసు నియామకాల్లో 167.6 సెంటీ మీటర్లు కావాలంటు న్నారని.. దాంతో 25 శాతం కానిస్టేబుల్ నియామకాల్లో తమకు ఉన్న ప్రత్యేక కోటాలో హైట్ కారణంగా పొందలేకపోతున్నామని వివరించారు. తమకు ఎత్తు పరిమితిని 165కు కుదించి న్యాయం చేయాలని వినతిపత్రం ఇచ్చారు.
`తమ పూర్వీకుల నుంచి సాగు చేసుకుంటున్న భూమిని తమకు తెలియకుండా గత ప్రభుత్వం రెండేళ్ల క్రితం ఇతరులకు కేటాయించిందని పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన కోటా హరిప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ భూమి నేటికీ తమ ఆధీనంలోనే ఉందని, పాస్ పుస్తకాలు కూడా ఉన్నాయని న్యాయం చేయాలని వేడుకున్నాడు.
12 నెలలుగా జీతాలు లేవు…
విజయనగరం జీజీహెచ్, జీఎంసీలలో 2023లో ఆప్కాస్ ద్వారా నియమితులైన ఉద్యోగులకు 12 నెలలు అయినా జీతాలు ఇవ్వలేదని పీహెచ్‌సీ, కేజీహెచ్‌లలో పనిచేస్తున్న సిబ్బంది సమస్యను వివరించారు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి జీతాలు వచ్చేలా చూడా లని వేడుకున్నారు. అలాగే నంద్యాల మెడికల్ కాలేజీలో అవుట్ సోర్సింగ్ ద్వారా నియమి తులై విధులు నిర్వహిస్తున్న తమకు 21 నెలల నుంచి జీతాలు అందడం లేదని, జీతాలు ఇచ్చి ఆర్థిక కష్టాల నుంచి బయట పడేయాలని వారు వేడుకున్నారు.
` తన అన్న కుమారుడు మానసిక దివ్యాంగుడు.. తల్లిదండ్రులు మరణించారు.. 2020 వరకు ఎన్టీఆర్ దివ్యాంగ భరోసా పింఛన్ వచ్చేది..గత ప్రభుత్వం వచ్చిన తరువాత తొలగించిందని బాపట్ల జిల్లా చీరాల మున్సిపాలిటీ పేరాలకు చెందిన కె.ఆనందబాబు విన్న వించాడు. తిరిగి తన అన్న కొడుక్కి దివ్యాంగ పింఛన్ మంజూరు చేయించాలని అభ్యర్థించాడు.
ఇంటిని ఖాళీ చేయకుండా బెదిరిస్తున్నారు
తాము ఇల్లు కొనుగోలు చేసి రిజస్టర్ చేసుకున్న ఇంటిని ఖాళీ చేయమంటే ఖాళీ చేయకుండా తమనే బెదిరిస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా విజయవాడ లబ్బీపేట పైడయ్య వీధికి చెందిన ఉయ్యూరు శ్రీవాని ఫిర్యాదు చేశారు. బిల్డింగు అప్పజెప్పకుండా కాలయాపన చేస్తూ దిక్కున్నచోట చెప్పుకోమంటూ ఇబ్బందిపెడుతున్నారని వివరించింది.
` తుళ్లూరు మండలంలో పనికి వెళ్లిన తనకు విద్యుత్ వైర్లు తగిలి రెండు చేతులు పోయాయని, కాళ్ల వేళ్లు తొలగించారని బాపట్ల జిల్లా మార్టూరు మండలం తాటివారి పాలెంకు చెందిన నాగరాజు వివరించాడు. గత ప్రభుత్వంలో న్యాయం కోసం అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదని పింఛన్ ఇచ్చి ఆదుకోవాలని వేడుకున్నాడు.
దేవాలయ భూమిని కబ్జా చేసిన వైసీపీ నేతలు
కర్నూలు జిల్లా ఆలూరు మండలం ఆనేకుర్తి గ్రామానికి చెందిన సర్పంచ్, గ్రామ ప్రజలు సమస్యను వివరిస్తూ వైసీసీ నేత భీరప్ప, దేవాలయానికి సంబంధించిన అర్చకుడు నకిలీ పాస్‌బుక్‌లు సృష్టించి దేవాలయ భూమి 9.66 సెంట్లను విక్రయించారని ఫిర్యాదు చేశారు. దీనిపై మండల అధికారులకు కూడా ఫిర్యాదు చేశామని, ఆ విక్రయాదులను రద్దు చేసి భూమిని ఎండోమెంట్ వారు స్వాధీనం చేసుకోవాలని వినతిపత్రం ఇచ్చారు.
` ఏపీ రిటైర్డ్ వీఏవో ఫెడరేషన్‌లో సుమారు 5 వేల మంది సభ్యులు ఉన్నాం. ప్రస్తుతం పొందుతున్న పింఛన్ రూ.4000. దానిని రూ.10 వేలకు పెంచుతామని గతంలో టీడీపీ ప్రభుత్వం మాట ఇచ్చింది. రూ.10 వేలకు పెంచి తమకు న్యాయం చేయాలని ఆ సంఘ సభ్యులు వినతిపత్రం అందజేశారు.
ఇళ్ల స్థలాలు కేటాయించి ఆదుకోవాలి
ఉమ్మడి విశాఖ జిల్లా అరకు గిరిజన తెగకు చెందిన 10 కుటుంబాలు జీవనోపాధి నిమిత్తం విశాఖకు 25 ఏళ్ల క్రితం రాగా టీడీపీ ప్రభుత్వం హయాంలో 8వ వార్డులో కార్పొ రేటర్ మద్దాల వెంకటరత్నరెడ్డి ఒక్కో కుటుంబానికి 60 గజాల చొప్పున స్థలం కేటాయిం చడం జరిగిందని తెగకు చెందిన వారు వివరించారు. అయితే ఆ స్థలాన్ని గత వైసీపీ ప్రభుత్వంలో నేతలు ఆక్రమించుకోవాలని చూశారని, ఇళ్ల కోసం శాశ్వత స్థలం కేటాయించి ఆదుకోవాలని వేడుకున్నారు.
` గత ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాల వల్ల తీవ్రంగా నష్టపోయానని అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రం మండలం నీలంపల్లి గ్రామానికి చెందిన నారిసిన్ని సాంబశి వారెడ్డి ఆవేదన వ్యక్తం చేశాడు. హెచ్‌ఎల్‌సీ కాలువకు నీరు వదలపోవడంతో తాను లీజుకు తీసుకున్న జిల్లాలోని రెడ్డిపల్లి ఓపెన్ ఎయిర్ జైలు భూమిలో రూ.24 లక్షలు పెట్టుబడి పెట్టగా బోర్లకు నీరు రాలేదని వివరించాడు. ఒక్క రూపాయి చేతికి రాకపోగా మరో రూ. 29 లక్షల వరకు కౌలు చెల్లించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశాడు. రెండేళ్లు కౌలు సక్రమంగానే చెల్లించానని, దయచేసి కౌలు రద్దు చేసి సాయం చేయాలని కోరాడు.
రజకులకు అన్యాయం జరిగింది..ఆదుకోవాలి
గత ప్రభుత్వంలో రజకులకు తీవ్ర అన్యాయం జరిగిందని కడప జిల్లా రజక సంఘ సంభ్యులు వేడుకున్నారు. పేరుకు కార్పొరేషన్ పెట్టి రూపాయి ఇవ్వలేదని వివరించారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగులకు కార్పొరేషన్ ద్వారా రూ.3 లక్షలు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలని, 50 సంవత్సరాలు వయసు దాటిన వారికి పింఛన్లు మంజూరు చేయాలని, లాండ్రీ షాపులకు సబ్సిడీతో కరెంట్ అందించాలని వినతిపత్రం ఇచ్చారు.
` అక్రమంగా తాటిచెట్లు నరికారని పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేస్తే ఇంటిపైకి దాడికి వచ్చి తమ పొలం లాక్కున్నారని కలెక్టర్, తహసీల్దార్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని అనంతపురం జిల్లా పమిడి మండలానికి చెందిన శివశంకర్ వేడుకున్నాడు.