అవాకులు, చవాకులు పేలుతున్న వైసీపీ కుక్కలకు లోకేష్ పాదయాత్రే ఓ గుణపాఠం అని బనగానపల్లి నియోజకవర్గ టిడిపి ఇంచార్జ్ బీసీ జనార్ధన రెడ్డి వెల్లడించారు. యువగళం పాపాదయాత్ర సందర్భంగా శనివారం బనగానపల్లి లో జరిగిన బహిరంగ సభలో జనార్ధన రెడ్డి ప్రసంగించారు. యువనేత లోకేష్ జన నీరాజనాల మధ్య 1,300 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తిచేశారన్నారు.
లోకేష్ పంచాయతీరాజ్ మంత్రిగా ఉన్నప్పుడు గ్రామాల్లో 25వేల కి.మీ.ల సిసి రోడ్లు వేశారని చెప్పారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 30లక్షల ఎల్ ఇడి లైట్లు వేసి సుందరంగా తీర్చిదిద్దారు.
వైసీపీ నాయకులు నాలుగేళ్లలో ఒక్క కిలోమీటరు సిసి రోడ్డు వేశారా, రోడ్లపైన తట్టమట్టి పోశారా?అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో బనగానపల్లి నియోజకవర్గంలో 300కిలోమీటర్ల రోడ్లు వేయించినట్టు తెలిపారు.
వైసిపి ప్రభుత్వం ఏర్పాటుచేసిన గ్రామ, వార్డు సచివాలయాలు అలంకారప్రాయంగా మారాయని విమర్శించారు. సంక్షేమ పథకాలను బూచిగా చూపుతూ అభివృద్ధిని అటకెక్కించారన్నారు. ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పిన జగన్ మాటతప్పి మడమతిప్పారని ధ్వజమెత్తారు. బెల్టు షాపులు, జె.బ్రాండ్ల మధ్యంతో వైసీపీ నాయకులు పేదవాళ్లను దోచుకుంటున్నారని ఆరోపించారు. కల్తీ మద్యంతో మహిళల మాంగల్యాలు తెంచుతున్నారన్నారు. కాటసాని రామిరెడ్డికి సవాల్ విసురుతున్నా. నేను ఏం చేశానో చెబుతా, నువ్వు ఏం చేశావో చెప్పే దమ్ముంటే బహిరంగ చర్చకు రావాలి అని సవాల్ విసిరారు.
టీడీపీ హయాంలో సంక్షేమం అందిస్తే, వైసీపీ పాలనలో విధ్వంసం చేస్తున్నారనిధ్వజమెత్తారు. నాలుగేళ్లలో ప్రజలకు పైసా అభివృద్ధి చేయని కాటసాని బనగానపల్లిలో ఎలా తిరుగుతాడో మేం చూస్తామని వెల్లడించారు. రింగురోడ్డుపై దద్దమ్మ కాటసాని రామిరెడ్డి సవాల్ విసిరాడు, రింగు రోడ్డు కమీషన్ల రింగులో కొట్టుకుపోయిందా?అని ప్రశ్నించారు. టీడీపీ హయాంలో ఈ గ్రామానికి రింగురోడ్డు మంజూరు చేయించి, మేం భూమిపూజ చేశామని చెప్పారు. కాటసాని వచ్చాక రింగ్ రోడ్డుకు బైపాస్ అని పేరుమార్చారు తప్ప, పనులు మాత్రం ముందుకు సాగలేదన్నారు. మేం అధికారంలోకి వచ్చిన సంవత్సరంలోనే రింగురోడ్డు పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.
బనగానపల్లె మైనారిటీలకు షాదీఖానా కోసం నా సొంత నిధులు రూ.30లక్షలు పెట్టి 60శాతం పనులు చేపిస్తే, కాటసాని పనులు నిలిపివేయించాడని ఆరోపించారు. పదిరోజుల్లో షాదీఖానా పనులు ప్రారంభించి, నాలుగునెలల్లో పూర్తిచేసే బాధ్యత నాది అని హామీ ఇచ్చారు. నువ్వు అడ్డుతగలకుండా ఉంటే అదే పదివేలు, మొత్తం షాదీఖానాను నా సొంతడబ్బుతో పూర్తిచేస్తామని వెల్లడించారు. రూ.75లక్షలతో వెంకటేశ్వరస్వామి గుడి పునర్నిర్మాణానికి అనుమతులు తెస్తే, దాన్ని గాలికొదిలేశారని విమర్శించారు. ప్రతి విషయంలో ఉత్తుత్తి సవాళ్లు విసిరి పారిపోవడం కాటసానిగా అలవాటుగా మారిందన్నారు. రాబోయే ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి వచ్చాక పెండింగ్ పనులన్నీ పూర్తిచేస్తామని హామీ ఇచ్చారు.