అమరావతి (చైతన్యరథం): తిరుపతి జిల్లా చంద్రగిరి ఇంటిగ్రేటెడ్ బాలిక హాస్టల్ విద్యార్థినులకు అస్వస్థతపై బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత ఆరా తీశారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌ను ఆదేశించారు. ఈ మేరకు శనివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 27 మంది చంద్రగిరి ఇంటిగ్రేటెడ్ బాలిక హాస్టల్ విద్యార్థినులు వాంతులతో అస్వస్థతకు గురయ్యారు. వారిలో 18 బీసీ విద్యార్థినులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే కలెక్టర్ వెంకటేశ్వర్ తో మంత్రి సవిత ఫోన్‌లో మాట్లాడారు. అస్వస్థతకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు మెరుగైన వైద్యసేవలందించాలని ఆదేశించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినుల ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. హాస్టల్‌లో మిగిలిన విద్యార్థినులంతా క్షేమంగా ఉన్నారని మంత్రికి కలెక్టర్ వివరించారు. అస్వస్థతకు గురైన విద్యార్థినులను వైద్యుల పర్యవేక్షణలోనే ఉంచాలన్న మంత్రి.. హాస్టల్‌లో వైద్య శిబిరం నిర్వహించాలని ఆదేశించారు. విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారమందించాలని రాష్ట్ర బీసీ వెల్ఫేర్ డైరెక్టర్ ను మంత్రి సవిత ఆదేశించారు.