- కలుషిత ఆహార బాధితులకు ఆసుపత్రిలో పరామర్శ
- ఘటనపై జిల్లా జేసీతో విచారణ
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం
- రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి ఘటనలు పునరావృతం కానీయం
గూడూరు: కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురైన తిరుపతి జిల్లా నాయుడుపేట అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులను రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పరామర్శించారు. గూడూరు ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న విద్యార్థులను మంత్రి సోమవారం నాడు పరామర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని మంత్రి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఈ ఘటనపై జిల్లా జాయింట్ కలెక్టర్‌తో విచారణ జరిపించి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం మంత్రి నాయుడుపేటలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను సందర్శించి భోజనశాల, వసతి గృహాలను పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, స్కూలు సిబ్బందితో మంత్రి మాట్లాడారు.
పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, ఎప్పటికప్పుడు శానిటైజేషన్ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులు బాధ్యతతో వ్యవహరించాలని విద్యార్థులను తమ సొంత పిల్లల్లా చూసుకోవాలన్నారు. విద్యార్థులను కేర్ టేకర్స్ నిరంతరం పర్యవేక్షిస్తుండాలన్నారు. విద్యార్థుల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. రాష్ట్రంలో ఎక్కడా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని మంత్రి డోలా అన్నారు. మంత్రితో పాటు విద్యార్థులను పరామర్శించిన వారిలో గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్, సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, తిరుపతి జిల్లా కలెక్టర్ డా. ఎస్ వెంకటేశ్వర్లు, పలువురు అధికారులు ఉన్నారు.
100 మంది విద్యార్థులకు అస్వస్థత
నాయుడుపేట: కలుషిత ఆహారం కారణంగా తిరుపతి జిల్లా నాయుడుపేటలోని అంబేద్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో సుమారు 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. 50 మంది తీవ్ర, మరో 50 మంది స్వల్ప అనారోగ్యం పాలయ్యారు. రెండు రోజుల క్రితం వండిన ఆహార పదార్థాలు వడ్డించడంతోనే అస్వస్థతకు గురయ్యామని బాధిత విద్యార్థులు ఆరోపించారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతున్న వారిలో తీవ్రంగా అనారోగ్యం పాలైన వారిని గూడూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మరికొందరిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్య సేవలందిస్తున్నారు. విద్యార్థులను స్థానిక తహసీల్దార్ కల్యాణి, మున్సిపల్ కమిషనర్ జనార్దన్ రెడ్డి పరామర్శించారు. వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు.