అమరావతి: మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్ సింగ్, హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్‌కు కేంద్రప్రభుత్వం భారతరత్న ప్రకటించడం పట్ల టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు హర్షం వ్యక్తం చేశారు. తెలుగు జాతి ముద్దుబిడ్డ, బహుబాషా కోవిదుడైన పీవీ నరసింహారావు… ప్రధానిగా దేశానికి అందించిన సేవలు మరువలేనివి. ఆర్థిక సంస్కరణలతో దేశాన్ని అభివృద్ధి పథం వైపు పరుగులు పెట్టించారు.
నేడు మనదేశం బలమైన ఆర్థిక శక్తిగా ఎదిగిందంటే అందుకు ఆ రోజు పీవీ వేసిన పునాదులే కారణం. ప్రధానిగా చరణ్ సింగ్ అందించిన సేవలు మరువలేనివి. అలాగే ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. తన పరిశోధనలతో నూతన వంగడాలు సృష్టించడంతో భారతదేశ వ్యవసాయ ముఖ చిత్రమే మారిపోయింది. ఇటువంటి భరతమాత ముద్దుబిడ్డలకు దేశంలోనే అత్యున్నత పురస్కారమైన భారతరత్న ఇచ్చిన కేంద్ర ప్రభుత్వానికి ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు కృతజ్ఞతలు తెలిపారు.