అమరావతి (చైతన్య రథం): రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి నారా భువనేశ్వరి కుప్పం సెగ్మెంట్ నాలుగు రోజులు పర్యటనలో భాగంగా తొలిరోజు పర్యటన ఉత్సాహంగా సాగింది. ఉదయం బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న భువనమ్మ కమ్మగుట్టపల్లి గ్రామం వద్ద నియోజకవర్గంలోకి ప్రవేశించారు. భువనమ్మకు నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అడుగడుగునా భువనమ్మకు నియోజకవర్గ ప్రజలు సాదర స్వాగతం పలికారు. నియోజకవర్గ మహిళలు భువనమ్మకు హారతులు పట్టారు. కమ్మగుట్టపల్లిలో పూర్ణకలశాలు, మంగళవాయిద్యాలతో భారీ ర్యాలీతో మహిళలు స్వాగతించారు. కమ్మగుట్టపల్లి మహిళలతో నిర్వహించిన ముఖాముఖికి భారీ స్పందన లభించింది. మహిళలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై భువనమ్మ ఆరా తీశారు. అదేవిధంగా సమస్యలపై వినతిపత్రాలను తీసుకుని, ప్రజల సమస్యలను ఓపికగా విన్నారు. ప్రతి సమస్యను సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కంచిబందార్లపల్లి గ్రామంలో నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ వచ్చిన కారణంగా భువనేశ్వరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా ఆ గ్రామాన్ని నేడు దత్తత తీసుకున్నారు. అదేవిధంగా గుత్తార్లపల్లి, కోటపల్లి గ్రామాల్లోనూ భువనమ్మ మహిళలతో ముఖాముఖి నిర్వహించి ముచ్చటించారు. ప్రతి గ్రామంలో భువనమ్మకు నియోజకవర్గ ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై వినతిపత్రాలు అందించారు. మొదటి రోజు కుప్పం పర్యటనకు నియోజకవర్గ ప్రజల నుండి భారీ స్పందన లభించింది. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్చార్జి పీఎస్ మునిరత్నంనాయుడు, డాక్టర్ సురేష్, జనసేన, బీజేపీ నాయకులు కార్యక్రమాలను దగ్గరుండి పర్యవేక్షించారు.