- దొంగ ఓట్లతో లబ్దిపొందాలనే ప్రయత్నం
- ఓటర్లనూ బదిలీ చేస్తున్న వైసీపీ
- పురంధేశ్వరీ ధ్వజం
అమరావతి, చైతన్యరథం: సీఎం జగన్‌రెడ్డి వైనాట్ 115 నినాదం వెనుక భారీ కుట్ర ఉందని… వచ్చే ఎన్నికల్లోనూ దొంగ ఓట్లతో లబ్ధిపొందాలని చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి ఆరోపించారు. వైకాపా తమ అభ్యర్థులతోపాటు ఓటర్లను కూడా ఒక చోటు నుంచి మరొక చోటుకు బదిలీ చేస్తోందని ఆరోపించారు. పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలంతా అప్రమత్తంగా ఉండి వీటిని నిలువరించాలని కోరారు. వైకాపా పాలనలో రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని పురందేశ్వరి విమర్శించారు. ప్రభుత్వ పనితీరులో లోపాలను ప్రస్తావించిన వారిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేసి భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు.
విజయవాడ భాజపా కార్యాలయంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆమె పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం తమవిగా ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. ఈనెల 20 నుంచి 29 వరకు అసెంబ్లీ నియోజకవర్గాల స్థాయిల్లో ప్రజాపోరు యాత్ర నిర్వహిస్తామని చెప్పారు. ప్రధాని నరేంద్రమోదీ పాలన, నాయకత్వం పట్ల ఆకర్షితులై ఆరు జిల్లాల్లో పారిశ్రామికవేత్తలు, ఇతర పార్టీల నాయకులు భాజపాలో చేరుతున్నారని తెలిపారు.
ప్రకాశం, చిత్తూరు జిల్లాల నుంచి ఏలూరు రామచంద్రారెడ్డి, కావూరి వాసు, ఐనాబత్తిన సుబ్బారావు, ఖాదర్ వలీసబ్బీ, రామచంద్రారెడ్డి తదితరులకు పురందేశ్వరి భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.