- ఐపీఎస్ అధికారులు పీఎస్‌ఆర్ ఆంజనేయులు, కాంతిరాణా టాటా, విశాల్ గున్నీ సస్పెన్షన్
- సినీనటి కాదంబరి జెత్వానీపై తప్పుడు కేసు, వేధింపుల వ్యవహారం
- డీజీపీ నివేదిక మేరకు ప్రభుత్వం చర్యలు
అమరావతి(చైతన్యరథం): ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్)ను జగన్ పొలిటికల్ సర్వీస్ (జేపీఎస్) గా మార్చి, చట్టాలను లెక్కచేయకుండా తాడేపల్లి మాఫియా ముఠా ఆదేశాలను అడ్డగోలుగా పాటించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ అయ్యారు. ముంబై నటి కాదంబరి జెత్వానీని తప్పుడు కేసులతో వేధించిన ముగ్గురు ఐపీఎస్ అధికారులపై సస్పెన్షన్ వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నాటి ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆదేశాలతో, ప్రభుత్వ యంత్రాంగం మొత్తం, ఒక మహిళని వేధించిన ఘటనలో వీరు సస్పెండ్ అయ్యారు. జగన్‌ని నమ్ముకుని, జగన్ చెప్పినట్టు చేసి, చట్టాన్ని లెక్క చేయని అప్పటి ఇంటలిజెన్స్ చీఫ్ పీ సీతారామంజనేయులు, విజయవాడ కమిషనర్‌గా పని చేసిన కాంతి రాణా టాటా, నాటి విజయవాడ డీసీపీ విశాల్ గున్నీలపై సస్పెన్షన్ వేటు పడిరది. డీజీపీ ఇచ్చిన నివేదిక మూడు రోజుల కిందటే ప్రభుత్వానికి చేరింది. ఈ నివేదిక ఆధారంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు 1590, 1591, 1592 నెంబర్ జీవోలు జారీ అయ్యాయి.
తప్పుడు కేసులో ముంబయి సినీ నటి కాదంబరీ జెత్వానీని అరెస్టు చేసి, ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో కీలకపాత్రధారులుగా ఐపీఎస్ అధికారులపైనే తీవ్రస్థాయి ఆరోపణలు రావడంతో దీనిపై డీజీపీ ద్వారకా తిరుమలరావు విచారణకు ఆదేశించారు. ఆయన ఆదేశాలతో విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్‌బాబు.. ఇబ్రహీంపట్నం స్టేషన్లో కాదంబరీ జెత్వానీ, ఆమె కుటుంబసభ్యులపై నమోదైన కేసు ఫైళ్లను పరిశీలించారు. కేసు నమోదు, దర్యాప్తులో అనేక లొసుగులు ఉన్నట్లు గుర్తించారు. వీటిపై నివేదికను రూపొందించి డీజీపీకి అందజేశారు.
ముగ్గురూ కలిసే..
ఈ ఏడాది ఫిబ్రవరి రెండో తేదీన ఉదయం 6:30 గంటలకి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన విశాల్ గున్ని బృందం డీజీపీకి ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ముంబైకి వెళ్లినట్టు ప్రభుత్వం గుర్తించింది. అదేరోజు ఉదయం ఏడున్నర గంటలకి ముంబై వెళ్లే విమానం ఎక్కినట్టు విచారణలో వెల్లడైంది. సినీనటి జెత్వానీ అరెస్టుకు సంబంధించినటువంటి అంశాన్ని డీజీపీకి సమాచారం ఇవ్వకుండా ఉండటంపైనా అభియోగాలు నమోదు అయ్యాయి. అదే సమయంలో ఎఫ్‌ఐఆర్ నమోదైన కొన్ని గంటల్లోనే ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్టు వ్యవహారంలో నిర్ణయం తీసుకోవడంపైనా అభియోగాలు నమోదయ్యాయి. ఈ వ్యవహారంలో మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్‌ఆర్ ఆంజనేయులు, అప్పటి విజయవాడ సీపీ కాంతిరాణా తాతా, విజయవాడ డీసీపీ విశాల్ గున్నిలు గూడుపుఠాణీతో వ్యవహరించినట్టు అధికారులు గుర్తించారు.
ముంబై నటి కేసులో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి, ఆమెను వేధించిన వ్యవహారంపై ఇబ్రహీంపట్నం పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ఏసీపీ హనుమంతరావు, సీఐ సత్యనారాయణను సస్పెండ్ చేశారు. వైసీపీ నాయకుడు కుక్కల విద్యాసాగర్ రావుతో కలిసి పోలీసు అధికారులు తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి జెత్వానీపై తీవ్ర వేధింపులకు పాల్పడ్డారు. దీని వెనుక కుట్ర బయటపడటంతో వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. కుక్కల విద్యాసాగర్‌పై కేసు పెట్టిన పోలీసులు ఇంకా ఐపీఎస్ అధికారులపై ఎలాంటి కేసులు పెట్టలేదు. అయితే డీజీపీ నివేదిక ఆధారంగా వారిపై సస్పెన్షన్ వేటు వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి వీరు ఐదేళ్ల కాలంలో చేసిన అరాచకాలు అన్నీ అన్నీ కావు. వాటికి సంబంధించిన నేరాలు, ఘోరాలు ఇంకా బయటకు రావాల్సి ఉంది.
కేసులు నమోదు చేయాలన్న ముంబై నటి
మరోవైపు ఫోర్జరీ పత్రంతో తనపై తప్పుడు కేసు నమోదు చేసి, అరెస్టు చేసి ఇబ్బందులకు గురిచేసిన వ్యవహారంలో అప్పటి నిఘా విభాగాధిపతి సీతారామాంజనేయులు, కాంతిరాణా తాతా, విశాల్‌గున్ని, వైఎస్సార్సీపీ నేత కుక్కల విద్యాసాగర్‌లపై కేసు నమోదు చేయాలని ముంబయి నటి ఫిర్యాదు చేశారు. శుక్రవారం, శనివారం వరుసగా రెండు రోజుల పాటు తన న్యాయవాదులు పీవీజీ ఉమేష్ చంద్ర, పాల్‌తో కలసి ఆమె విజయవాడ కమిషనరేట్ పరిధిలోని ఇబ్రహీంపట్నం స్టేషన్‌కు వెళ్లారు. సీఐ చంద్రశేఖర్‌కు పలు వివరాలు ఇచ్చి, ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ముంబై నటి ఫిర్యాదు మేరకు కుక్కల విద్యాసాగర్, మరికొందరిని నిందితులుగా పేర్కొన్నారు.
తండ్రి హయాంలో ఐఏఎస్‌లు, కొడుకు పాలనలో ఐపీఎస్‌లు
గతంలో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ధికారాన్ని అడ్డుపెట్టుకుని ఐఏఎస్ అధికారులని బలి చేసాడు. ఇప్పుడు తనయుడు జగన్ రెడ్డి తన అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఐపీఎస్ అధికారులను బలి చేసాడు.. జగన్‌ని నమ్ముకుంటే, ఆయనతో పాటు జైలుకి వెళ్ళాల్సిందే అనేది మరోసారి రుజువయింది. దేశంలోనే అత్యున్నతమైన సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో విజయం సాధించి, ఐపీఎస్ ఎంచుకున్న వీరు చివరికి ఒక నటి కేసులో అడ్డంగా దొరికి, అవమానకరంగా సస్పెండ్ అవ్వడం దేశంలోనే సంచలనం కలిగించింది. ఐపీఎస్ అధికారులు ఎలా వ్యవహరించకూడదో చెప్పేందుకు ఈ ముగ్గురి ఉదంతం ఒక కేస్ స్టడీ కానుంది.