ప్రకాశం: అధికార వైసీపీకి ప్రకాశం జిల్లాలో మరోషాక్ తగిలింది. ఆ పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా బుధవారం ఉద యం ఆయన ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ మాగుంట కుటుంబానికి ప్రకాశం జిల్లా రాజకీయ జన్మనిచ్చిందన్నారు. మాగుంట కుటుంబం ప్రకాశం జిల్లాకు వచ్చి 33 సంవత్సరాలు గడిచాయన్నారు. అనేకసార్లు పార్లమెంట్, అసెంబ్లీ, ఎమ్మెల్సీ పదవులకు పోటీ చేశామన్నారు. మాగుంట కుటుంబానికి అహం లేదు.. ఆత్మగౌరవం ఉందని.. ఆ గౌరవాన్ని నిలబెటుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు.
రాబోయే ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా తన కుమారుడు రాఘవరెడ్డి పోటీ చేస్తాడని ఆయన ప్రకటించారు. కొన్ని అని వార్య కారణాల వల్ల వైసీపీని వీడుతున్నామన్నారు.దవైసీపీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. వైసీపీ అధిష్టానం ఒంగోలులో మాగుంటని దూరంపెట్టింది. ఒంగోలు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని సీఎం జగన్ తెరపైకి తెచ్చారు. వైసీపీలో పరిణామాలపై మాగుంట శ్రీనివాసులురెడ్డి అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ఆయన మీడియా సమావేశంలో ప్రకటించారు. మార్చి మొదటి వారంలో మాగుంట టీడీపీలో చేరనున్నట్లు సమాచారం.