అమరావతి: ముఖ్యమంత్రిగా చివరి పుట్టినరోజు జరుపుకుంటున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు వ్యంగ్యం ప్రదర్శించారు. బర్త్ డే పేరుతో ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా, సోషల్ మీడియాకు ప్రకటనల రూపంలో రూ. 100 కోట్ల ప్రజాధనాన్ని మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు చేయడం జగన్ రెడ్డి పెత్తందారీ పోకడలను తెలియజేస్తోందని విమర్శించారు. నెలకు ఒక్క రూపాయే గౌరవ వేతనం తీసుకుంటానని గొప్పలు చెప్పిన జగన్ రెడ్డి .. పుట్టినరోజు పేరుతో కోట్లు ఖర్చు చేయడం ఆయన రాచరిక పోకడలకు అద్దం పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేయడం, సొంత పత్రిక సాక్షికి ప్రకటనలు ఇవ్వడం, కొంతమంది కాంట్రాక్టర్లకు దోచిపెట్టడంపై ఉన్న శ్రద్ధ ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయడంపై ముఖ్యమంత్రికి లేకపోవడం బాధాకరం. జీతాలు పెంచమని అంగన్వాడీలు ప్రజాస్వామ్యబద్ధంగా సమ్మె చేస్తుంటే కనీసం స్పందించని ముఖ్యమంత్రి తన పుట్టినరోజు కోసం కోట్ల రూపాయిలు వృథా చేయడం దేనికి సంకేతం? పైగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ముఖ్యమంత్రి ఫ్లెక్సీలను విద్యార్థులే స్వయంగా తయారుచేసి ప్రదర్శించాలని ఆదేశాలివ్వడం సిగ్గుచేటు కాదా? నాలుగున్నరేళ్లలో రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు. పన్నుల బాదుడు, చార్జీల మోత, నిత్యావసరాల పెంపుతో పేద, మధ్యతరగతి నడ్డి విరిచారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారు. ఇన్ని వైఫల్యాలు కళ్ల ముందు కనిపిస్తుంటే ఘనంగా బర్త్ డే ఎలా చేసుకోవాలపించిందో జగన్ రెడ్డికే తెలియాలని గురువారం ఒక ప్రకటనలో అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు.