రాజమండ్రి: రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసే పార్టీ బీజేపీ అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి అన్నారు. రాజమండ్రిలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ పురందరేశ్వరి ఆధ్వర్యంలో సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, బీజేపీ సీనియర్ నాయకుడు సోము వీర్రాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా పురందరేశ్వరి మాట్లాడుతూ.. 2014లో నిర్వహించిన సభ్యత్వ నమోదులో మొదటిసారిగా ఆన్ లైన్ విధానం ప్రవేశపెట్టామన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో భాగంగా భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు, బీజేపీ దేశానికి సేవ చేసే అంశాల గురించి అప్పట్లో ప్రజలకు వివరించామన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ తొమ్మిది కోట్ల మంది సభ్యులతో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా అవతరించిందని పురందేశ్వరి పేర్కొన్నారు.
2014లో భారతీయ జనతా పార్టీ 11 కోట్ల మంది కొత్త సభ్యులు నమోదు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందని పురందేశ్వరి తెలిపారు. ఎలాంటి అవినీతి మరకలేకుండా ప్రజాహితంగా తమ పార్టీ పని చేస్తోందన్నారు. భారత దేశంలో ఈ రోజుకి సభ్యుల సంఖ్య 18 కోట్ల వరకూ ఉందని పురందేశ్వరి తెలిపారు. 1980 వ సంవత్సరంలో ఇద్దరు పార్లమెంట్ సభ్యులతో మొదలైన బీజేపీ ప్రస్థానం, నేడు 240 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించుకునే స్థాయికి వెళ్లిందని పురందేశ్వరి పేర్కొన్నారు.
ప్రతిపక్ష ఇండియా కూటమి దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి విస్తృంగా తీసుకెళ్లటం వల్ల ఇటీవలి ఎన్నికల్లో కొంతమేర సీట్లు తగ్గాయన్నారు. భారతీయ జనతా పార్టీ అధికారంలోకి తీసుకొస్తే రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, చర్చిల్ని, మసీదుల్ని కూల్చేస్తారని, రిజర్వేషన్లు తీసివేస్తారని కావాలని దుష్ప్రచారం చేశారన్నారు. అందువల్లనే ఎన్నికల్లో సీట్లు తగ్గాయన్నారు. రాజ్యాంగానికి కట్టుబడి పని చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ అని పురందేశ్వరి స్పష్టం చేశారు.