- 200 ఇళ్లకు ముంపు ప్రమాదం
- అధికారులు వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలి
- భూ కబ్జాలపై పలువురి ఫిర్యాదులు
- టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన అర్జీదారులు
- వినతులు స్వీకరించిన రావి వెంకటేశ్వరరావు, శ్యావల దేవదత్
అమరావతి (చైతన్యరథం): మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం జరిగిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుండి పలు సమస్యలపై అర్జీదారులు తరలివచ్చారు. అర్జీదారుల నుంచి రాష్ట్ర వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, ఏపీ స్టేట్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ సర్టిఫికేషన్ అథారిటీ చైర్మన్ శ్యావల దేవదత్ వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా బత్తులపల్లి మండలం గంటాపురం గ్రామానికి చెందిన అప్పస్వామి, పలువురు గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తూ.. నీరు పోయే వాగుకు ఈశ్వరయ్య అనే వ్యక్తి అడ్డుకట్ట కట్టాడని దాంతో నీరు ఊరిమీదకు వచ్చి 200 ఇళ్లకు పైగా ముంపు ప్రమాదం ఉందని.. దయ చేసి ప్రమాదం జరగకముందే అధికారులు వాగు ఆక్రమణను తొలగించి ముంపు బారినుండి గ్రామస్తులను కాపాడాలని వేడుకున్నారు.
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం ఆమందూరుకు చెందిన కె. వెంకటేశ్వరరావు విజ్ఞప్తి చేస్తూ.. గ్రామంలోని సర్వే నెంబర్ 134/25 లో ఉన్న 0.98 సెంట్ల ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతోందని.. అధికారులు స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూమి కబ్జాకు గురికాకుండా చూడాలని కోరారు.
దళితులమైన తమ భూములకు జి. చంగల్ రెడ్డి, కృష్ణారెడ్డి అనే వ్యక్తులు దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి కాజేయాలని చూస్తున్నారని.. దీన్ని అడ్డుకునే ప్రయత్నంలో తమపై దాడులు చేస్తున్నారని.. అధికారులు విచారించి తమకు న్యాయం చేయాలని కడప జిల్లా ఎర్రగుంట్లకు చెందిన కృపాకర్ అనే వ్యక్తి గ్రీవెన్స్‌లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.
గుంటూరు జిల్లా కొల్లిపర మండలానికి చెందిన ఏడుకొండలు, శివనాగేశ్వరరావు, తదితరులు విజ్ఞప్తి చేస్తూ.. తమ బిడ్డల విదేశీ చదువులకోసం విదేశీ విద్యా దీవెన అందించి ప్రభుత్వం ఆదుకోవాలని అభ్యర్థించారు.
ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడికి చెందిన ఈనిడ్ జాయ్ విజ్ఞప్తి చేస్తూ.. తమ భూమిని అమ్మడానికి నిరాకరించడంతో తన తల్లి సంతకాన్ని ఫోర్జరీ చేసి మోసపూరితంగా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కాకుండా పొలంలోకి వెళితే తమను చంపేస్తామని బెదిరిస్తున్న ఎడ్లపల్లి సుబ్బారావు, జూలూరి కృష్ణ, వంకాయలపాటి వెంకటేశ్వరరావు, కలిదిండి గోపాలరాజు, మేడవరపు శ్రీరామచంద్రమూర్తి, జూలూరి రాఘవేంద్రరావులపై చర్యలు తీసుకోవాలని కోరారు.
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలం ముట్లూరు గ్రామానికి చెందిన మాదల సాంబశివరావు విజ్ఞప్తి చేస్తూ.. గత ఏడాది జూన్ 8వ తేదీన తన ఇంట్లో దొంగతనం జరిగి 30 సవర్ల బంగారం, లక్షా 10 వేలు నగదు పోయాయని.. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే నేటికీ ఫలితం లేదని.. దయ చేసి దొంగలను పట్టుకొని తమ సొత్తును రికవరీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
కడప జిల్లా ఒంటిమిట్ట మండలం క్రొత్త మాధవరం గ్రామానికి చెందిన ఆలూరి నరసింహులు అను వ్యక్తి గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేస్తూ.. రూ.2 కోట్ల విలువైన స్థలానికి మాజీ సర్పంచ్ ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి హోటల్ నిర్మాణం చేపడుతున్నాడని.. దీనిపై విచారించి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.