- క్షతగాత్రులకు మంత్రి సుభాష్ పరామర్శ
- మెరుగైన వైద్యం అందించాలని ఆదేశం
- ప్రమాదంపై మంత్రి కొల్లు ఆరా
- ఐదేళ్ల బూడిద దోపిడీపై విచారణ: దేవినేని
విజయవాడ: వరుస బాయిలర్ పేలుడు ఘటనలతో ఎన్టీఆర్ జిల్లా దద్దరిల్లుతోంది. జగ్గయ్యపేట మండలం బూదవాడ వద్ద అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో బాయిలర్ పేలుడు ఘటన మరవక ముందే ఇబ్రహీంపట్నంలో మరో ప్రమాదం జరగటం కలకలం రేపింది. నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్ ఐదవ యూనిట్ బాయిలర్‌లో సోమవారం అర్ధరాత్రి మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా మంటలు రావడంతో ఇద్దరు కార్మికులకు తీవ్రగాయాలు అయ్యాయి. బాధితులను హుటాహుటీన చికిత్స నిమిత్తం గొల్లపూడి లోని ఆంధ్ర ఆస్పత్రికి తరలించారు.
జులై 7వ తేదీన బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీలోనూ బాయిలర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. మరో 15మంది తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్‌లో బాయిలర్ నుంచి మంటలు రావడం, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కంపెనీలు అత్యంత ప్రమాదకరమైన బాయిలర్లను ఎప్పటికప్పుడు తనిఖీలు చేసేలా, కార్మికుల ప్రాణాలకు భద్రత కల్పించేలా యాజమాన్యాలు చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించే కంపెనీలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.
బాధితులకు మంత్రి సుభాష్ పరామర్శ
ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్‌లో జరిగిన ప్రమాదంలో గాయపడిన బాధితులకు తక్షణమే మెరుగైన వైద్యం అందించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అధికారులను ఆదేశించారు. బాయిలర్ నుంచి మంటలు చెలరేగి గాయపడిన ఇద్దరు కార్మికులను మంత్రి వాసంశెట్టి సుభాష్, మాజీ మంత్రి దేవినేని ఉమామహశ్వరరావు పరామర్శించారు. అర్ధరాత్రి సమయంలో ఎన్టీటీపీఎస్ ఐదో దశలో బాయిలర్ ఆగిపోవడంతో కార్మికులు మరమ్మతులు చేపట్టారు. ఆ సమయంలో బూడిద నిల్వ తలుపులు ఒక్కసారిగా తెరుచుకున్నాయి. దీంతో మంటలు చేలరేగి ఓ ఉద్యోగి, మరో కాంట్రాక్టు కార్మికుడికి తీవ్రగాయాలయ్యాయి. బాధితులను చికిత్స నిమిత్తం గొల్లపూడిలోని ఆంధ్ర ఆస్పత్రికి తరలించగా.. విషయం తెలుసుకున్న మంత్రి వాసంశెట్టి బాధితులను పరామర్శించారు.
ప్రమాదంపై మంత్రి ఆరా..
ప్రమాదం ఎలా జరిగిందనే విషయాన్ని ఎన్టీటీపీఎస్ ఉద్యోగులు, అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇలాంటి ఘటనలు దురదృష్టకరమని మంత్రి అన్నారు. క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉందని, వారి కుటుంబాలు అధైర్య పడొద్దని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ప్రమాదవశాత్తూ ఎలాంటి ఘటనలు జరిగినా.. సీఎం చంద్రబాబు అండగా ఉంటారని వాసంశెట్టి చెప్పారు. ఈ సందర్భంగా జగ్గయ్యపేట మండలం బూదవాడ అల్ట్రాటెక్ సిమెంట్ కర్మాగారంలో జరిగిన ప్రమాదాన్ని మంత్రి గుర్తు చేశారు. రాష్ట్రంలోని పరిశ్రమల యాజమాన్యాలు ఎప్పటికప్పుడు బాయిలర్లను తనిఖీ చేయాలని, కార్మికుల ప్రాణాలను కాపాడే బాధ్యత యాజమాన్యాలదే అని స్పష్టం చేశారు.
గత ఐదేళ్ల బూడిద దోపిడీపై విచారణ చేస్తాం: దేవినేని
ఎన్టీటీపీఎస్ ప్రమాదంపై సమగ్ర విచారణ చేయిస్తామని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా చెప్పారు. బాధితులకు అండగా ఉంటామని ఆయన హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రారంభం చేసిన పాపాలే ఈ దుర్ఘటనకు కారణం అని దేవినేని విరుచుకుపడ్డారు. నట్లు, బోల్టులు మార్చడానికి కూడా పది రూపాయలు వెతుక్కునే పరిస్థితికి థర్మల్ పవర్ స్టేషన్‌ను గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాలనలో ఐదేళ్లపాటు బూడిద దోచుకుని ఇబ్రహీంపట్నాన్ని బూడిద పట్టణంగా మార్చారని ఆయన మండిపడ్డారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పీఏగా చెప్పుకునే వ్యక్తి థర్మల్ పవర్ స్టేషన్ల సీఈ స్థాయి అధికారులను శాసించి, క్వాలిటీ బూడిదను తరలించి, సిమెంట్ ఫ్యాక్టరీలకు అమ్ముకుని కోట్లు దండుకున్నారని ఆరోపించారు. గత ఐదేళ్లపాటు బూడిద ఎవరు దోచుకుతున్నారో విచారణ చేసి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మాజీ మంత్రి దేవినేని ఉమా హెచ్చరించారు.
మెరుగైన వైద్యం అందించండి: మంత్రి కొల్లు
ఇబ్రహీంపట్నం ఎన్టీటీపీఎస్ ప్రమాదంపై మంత్రి కొల్లు రవీంద్ర విచారం వ్యక్తం చేశారు. బాయిలర్‌కు మరమ్మతులు చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగి ఒక ఉద్యోగి, మరో కాంట్రాక్టు కార్మికుడు తీవ్రంగా గాయపడిన సంఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ఘటనకు గల కారణాలపై వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. క్షతగాత్రులు చికిత్స పొందుతున్న ఆస్పత్రి సిబ్బందితో మంత్రి కొల్లు ఫోన్లో మాట్లాడారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.