- తాజాగా మరో రూ.4 వేల కోట్ల అప్పులకు రాష్ట్ర ప్రభుత్వం దరఖాస్తు
- ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు అప్పులు, చెల్లింపులు చేయకుండా అడ్డుకోవాలి
- చట్టవ్యతిరేకంగా వ్యవహరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలి
- సీఈసీకి అచ్చెన్నాయుడు లేఖ
అమరావతి(చైతన్యరథం): బినామీ, సొంత కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇష్టానుసారం అప్పులు చేస్తూ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాసు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు ఎటువంటి అప్పులు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలువరించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని అచ్చెన్నాయుడు కోరారు. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ)కు సోమవారం అచ్చెన్నాయుడు లేఖ రాశారు. అప్పులపై కేంద్ర ప్రభుత్వం విధించిన ఎఫ్ఆర్బీఎం పరిమితిని రాష్ట్ర ప్రభుత్వం జూన్ 1వ తేదీకే దాటివేసిందని లేఖలో పేర్కొన్నారు. ఈ ఏడాది చేసిన అప్పుల్లో ఎక్కువ శాతం అప్పులు ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాతే చేశారు. తెచ్చిన అప్పులను బినామీ కాంట్రాక్టర్లకు, కంపెనీలకు బిల్లుల రూపంలో చెల్లించి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. తాజాగా ఈ మంగళవారం మరో రూ.4,000 కోట్ల అప్పులకు దరఖాస్తు చేసినట్లు ఆర్బీఐ ప్రకటన ద్వారా తెలిసింది. ముందు వచ్చిన వారికి ముందుగా (ఫిఫో) బిల్లులు చెల్లించాలన్న సీఎఫ్ఎంఎస్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఇప్పుడు తెస్తున్న రూ.4 వేల కోట్లు అప్పులు సైతం సొంత కాంట్రాక్టర్లకు చెల్లించాలని చూస్తున్నారు. జూన్ 4, 2024 న ఎన్నికల ఫలితాల రానున్న నేపథ్యంలో అధికారం కోల్పోతున్న ప్రభుత్వం ఇంత పెద్ద మొత్తంలో అప్పులు చేయడం రాజ్యాంగ విరుద్ధం. కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని ఎన్నికల ఫలితాలు విడుదలయ్యే వరకు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ఎటువంటి అప్పులు, చెల్లింపులు చేయకుండా అడ్డుకోవాలి. ఇష్టానుసారం అప్పులు చేసేందుకు సహకరిస్తూ.. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అధికారులపై సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు కోరారు.