గన్నవరం: చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవంలో నందమూరి బాలకృష్ణ ఎంతో ఉత్సాహంగా అన్నీ తానై వ్యవహరించారు. వేదికపైకి అతిథులను ఆహ్వానించడం, వారికి సరైన సదుపాయాలు అందేలా చూడడం వంటి పనులతో బాలయ్య బిజీగా కనిపించారు. ఈ క్రమంలో ఆయన తన సోదరి నారా భువనేశ్వరి నుదుటిపై ఆప్యాయంగా ముద్దాడారు. అవధుల్లేని ఆనందాన్ని ఎవరైనా సరే కుటుంబ సభ్యులతోనే షేర్ చేసుకుంటారు. దీనికి ఎవరూ అతీతులు కారు. సరిగ్గా సినీ నటుడు, హిందూపురం బాలకృష్ణ విషయంలో ఇదే జరిగింది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కార్యక్రమానికి బాలకృష్ణ హాజరయ్యారు. ప్రమాణ స్వీకార వేదికపై చంద్రబాబు నాయుడు సతీమణి, బాకలృష్ణ సోదరి భువనేశ్వరి ఉన్నారు. ఆమెను చూసిన వెంటనే బాలకృష్ణ.. భువనేశ్వరి నుదుటిపై ముద్దు పెట్టి ఆత్మీయంగా పలకరించారు. భువనేశ్వరిని ఆ వేదికపై చూసి ఎమోషనల్ అయిన బాలకృష్ణ.. సోదరుడిగా నుదుటిపై ముద్దు పెట్టి తన సంతోషాన్ని పంచుకున్నారు. బాలకృష్ణకు సంబంధించిన ఈ దృశ్యం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అలాగే నందమూరి బాలకృష్ణ సభ మొత్తం తిరుగుతూ అందరినీ పలకరిస్తూ, తన అక్కలు ఇద్దరినీ ఎంతో ఆప్యాయంగా పలకరించారు.
నా సంతోషాన్ని రెట్టింపు చేశావు: భువనేశ్వరి
దీనిపై నారా భువనేశ్వరి సోషల్ మీడియా ద్వారా స్పందించారు. ఒక భార్యగా, ఒక అమ్మగా నా మనసు ఆనందంతో నిండిన క్షణాల్లో… నాకు తోడబుట్టిన ప్రేమను పంచుతూ నా సంతోషాన్ని రెట్టింపు చేశావు బాలా అన్నయ్యా… అంటూ భువనేశ్వరి ట్వీట్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను కూడా ఆమె పంచుకున్నారు.