- యలమంచిలి నియోజకవర్గంలో యువగళానికి బ్రహ్మరథం
- యువనేతకు టిడిపి-జనసేన కార్యకర్తల అపూర్వ స్వాగతం
- అడుగడుగునా నీరాజనాలు, కేరింతల నడుమ యువగళం
పాయకరావుపేట/యలమంచిలి: యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాతకు అనకాపల్లి జిల్లా యలమంచిలి నియోజకవర్గంలో జనం బ్రహ్మరథం పట్టారు. 221వ రోజు యువగళం పాదయాత్ర నక్కపల్లి శివార్లనుంచి బుధవారం ఉదయం ఉత్సాహంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం భోజన విరామానంతరం పులకుర్తి వద్ద పాదయాత్ర యలమంచిలి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా లోకేష్ కు కనీవినీ ఎరుగని రీతిలో ఘనస్వాగతం లభించింది. యలమంచిలి టీడీపీ ఇన్‌చార్జి ప్రగడ నాగేశ్వరరావు, జనసేన ఇన్‌ఛార్జి సుందరపు విజయ్ నేతృత్వంలో యువనేత లోకేష్ కు అపూర్వస్వాగతం పలికారు. భారీ గజమాలలు, డప్పుశబ్ధాలు, కోలాటం, బాణాసంచా మోతలతో పులకుర్తి గ్రామం దద్దరిల్లింది. యువనేతకు మహిళలు, యువకుల నీరాజనాలు పట్టగా, టిడిపి-జనసేన కార్యకర్తలు కేరింతలు కొట్టారు. లోకేష్ రాకతో యలమంచిలి నియోజకవర్గ శివార్లలో జాతీయరహదారి కిక్కరిసిపోయింది. యువనేతను చూసేందుకు జనం రోడ్లవెంట బారులు తీరారు. యువగళం రాకతో యలమంచిలి శివారు ప్రాంతం జాతరను తలపించింది. ఉదయం నక్కపల్లి కృష్ణగోకులం లేఅవుట్ నుంచి ప్రారంభమైన యువగళం… సరిపల్లిపాలెం, కోనవానిపాలెం, తిమ్మాపురం అడ్డరోడ్డు, గోకులపాడు, పెనుగల్లు, యలమంచిలి నియోజకవర్గం పులకుర్తి, లక్కవరం, ములకలపల్లి, పురుషోత్తమపట్నం, పోతిరెడ్డిపాలెం, రేగుపాలెం మీదుగా కొత్తూరు ఎస్ వి కన్వెన్షన్ సెంటర్ కు చేరుకుంది. దారిపొడవునా రైతులు, న్యాయవాదులు, యువకులు, వివిధ వర్గాల ప్రజలు యువనేతకు సమస్యలను విన్నవించారు. 221వరోజు యువనేత లోకేష్ 18.3 కి.మీ.ల పాదయాత్ర చేశారు. ఇప్పటివరకు యువగళం పాదయాత్ర 3059.6 కి.మీ.పూర్తయింది.