టిడిపి హయాంలో బ్రాహ్మణుల సంక్షేమానికి నిర్దేశించిన పథకాలు అన్నింటినీ అధికారంలోకి రాగానే పునరుద్ధరిస్తామని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లడించారు. పేద బ్రాహ్మణులకు ఇళ్ళ స్థలాలు కేటాయించటం తో పాటు పక్కా గృహాలు నిర్మిస్తామని ఆయన తెలిపారు.
యువగళం పాదయాత్రలో భాగంగా బుధవారం పెనుకొండ నియోజకవర్గం నల్ల గొండ్రాయనపల్లి వద్ద రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన ప్రతినిధులు లోకేష్ ను కలిసి తాము ఎదుర్కొంటున్న సమస్యలు విన్నవించారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ బ్రాహ్మణ సమాజంలో పేదరికాన్ని గుర్తించి టిడిపి హయాంలో 2014 లో దేశంలోనే తొలిసారిగా బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేసి, రూ.300 కోట్లు మూలాధనాన్ని కేటాయించినట్లు చెప్పారు.
పేద బ్రాహ్మణ విద్యార్థుల కోసం భారతీ పథకం, గాయత్రీ విద్యా ప్రశస్తి పథకం, వశిష్ట విద్యా పథకం, ద్రోణాచార్య పథకం వంటివి అమలుచేసి పోటీ పరీక్షలకు శిక్షణ సైతం ఇప్పించినట్టు వివరించారు. చాణక్య పథకం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు ఆర్థిక సహాయం అందజేసినట్లు తెలిపారు. గరుడ పథకం ద్వారా పేద బ్రాహ్మణులు మరణించినప్పుడు, అంత్యక్రియల నిమిత్తం రూ.10 వేలు ఆర్థిక సహాయం అందజేసినట్లు చెప్పారు. కనీస మానవత్వం కూడా లేని జగన్ ఆ పథకాన్ని సైతం రద్దు చేశారని లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. బ్రాహ్మణుల సంక్షేమానికి టిడిపి కట్టుబడి ఉన్నదన్నారు. చంద్రబాబు ను ముఖ్యమంత్రిని చేసేందుకు సహకరించాలని లోకేష్ విజ్ఞప్తి చేశారు.