టిడిపి అధికారంలోకి రాగానే ఇటుక తయారీని కుటీర పరిశ్రమగా గుర్తించి షెడ్ ల నిర్మాణానికి సబ్సిడీపై రుణాలు అందజేయటం జరుగుతుందని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హామీ ఇచ్చారు. యువగళం పాదయాత్రలో భాగంగా మంగళవారం పెనుగొండ నియోజకవర్గం మల్లాపల్లి గ్రామంలో ఇటుక తయారీదారులు లోకేష్ ను కలిసి సమస్యలపై విన్నవించారు.
చెరువుకుంటలో ఉచితంగా మట్టి తోలుకోవటానికి అనుమతులు ఇవ్వాలని, ఇటుక బట్టీలకు అవసరమైన బొగ్గు నిమిత్తం కట్టెలు కొట్టుకునేందుకు అనుమతి ఇవ్వాలని, కార్పొరేషన్ ల నుంచి సబ్సిడీ రుణాలు అందజేయాలని వారు లోకేష్ కు విజ్ఞప్తి చేశారు. వారి సమస్యలపై లోకేష్ సానుకూలంగా స్పందిస్తూ నిర్మాణ రంగంలో కీలకంగా వున్న ఇటుకల తయారీ కార్మికులకు అవసరమైన సహాయ, సహకారాలు అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇటుక తయారీకి అవసరమైన గ్రామీణ చెరువులలో మట్టి తవ్వుకోటానికి, కట్టెలు కొట్టుకునేందుకు ఉచితంగా అనుమతులు జారీ చేయనున్నట్టు వెల్లడించారు.