- స్టాప్ లాగ్ ఏర్పాటులో నీ నైపుణ్యం అమోఘం
- భారతదేశ చరిత్రలోనే ఇదొక అపూర్వ ఘట్టం
- 40 టిఎంసి తుంగభద్ర జలాలు పదిలం
- రాష్ట్ర రైతాంగం తరపున కన్నయ్యకు కృతజ్ఞతలు
- రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు
అమరావతి (చైతన్య రథం): వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తుండగా తుంగభద్ర 19వ గేటు స్థానంలో స్టాప్ లాగ్ గేటును ఏర్పాటు చేయడమనేది భారతదేశ చరిత్రలోనే అపూర్వ ఘట్టమని, అటువంటి రికార్డును సృష్టించిన సాగునీటి రంగ నిపుణులు కన్నయ్య నాయుడుకు రాష్ట్ర జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు అభినందనలు తెలిపారు. స్టాప్ లాగ్ గేటు ఏర్పాటువల్ల సుమారు 40 టీఎంసి జలాలు వృధాకాకుండా కాపాడుకున్నామన్నారు. బుధవారం రాష్ట్ర సచివాలయం పబ్లిసిటీ సెల్‌లో సర్వేపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు, రిటైర్డ్ అధికారి కన్నయ్య నాయుడుతో కలసి మంత్రి మీడియాతో మాట్లాడారు. తుంగభద్ర రిజర్వాయరు 19వ గేటు వరదనీటికి కొట్టుకు పోవడంతో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రైతాంగం తీవ్ర ఆందోళనకు గురైంది.
అటువంటి క్లిష్టపరిస్థితులో సంక్షోభాలను అధిగమించడంలో మంచి అనుభవం ఉన్న రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు సాగునీటి రంగంలో దాదాపు 50 ఏళ్ల అనుభవమున్న కన్నయ్య నాయుడు సహాకారంతో స్టాప్‌లాగ్ గేటు ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితంగా నేడు సుమారు 77 టీఎంసీ జలాలు రిజర్వాయరులో నిల్వ ఉండటంవల్ల రాయలసీమ ప్రాంతంలోని ఎల్‌ఎల్‌సి, హెచ్‌ఎల్‌సి, కెసి కెనాల్‌కు సమృద్దిగా తాగునీరు, సాగునీరు అందించగలిగే పరిస్థితి ఏర్పడిరదన్నారు. తుంగభద్ర గేటు కొట్టుకుపోయిందని తెలిసిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అర్థరాత్రి సైతం నాతో, అనంతపురం జిల్లాకు చెందిన మంత్రి పయ్యావుల కేశవ్ మరియు జలవనరుల శాఖ కార్యదర్శితో కాన్ఫరెన్స్ నిర్వహించి అప్రమత్తం చేయడంవల్లే సంక్షోభం నుండి గట్టెక్కగలిగామన్నారు. లేకుంటే తుంగభద్ర జలాశయం ద్వారా తాగు, సాగునీరు పొందే అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలతో పాటు తెలంగాణకు చెందిన ప్రజలు, రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడేదన్నారు. రాష్ట్ర రైతాంగం ప్రత్యేకించి రాయలసీమ రైతాంగం తరపున కన్నయ్య నాయుడికి మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రముఖ సాగునీటి రంగ నిపుణులు కన్నయ్య నాయుడు మాట్లాడుతూ గత 52 ఏళ్లుగా సాగునీటిరంగంలో పనిచేస్తూ దక్షణాది రాష్ట్రాల్లో ఇలాంటి గేట్లు ఎన్నో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తుంగభద్ర డ్యామ్‌ను 1954లో కమిషనింగ్ చేయడం జరిగిందని, దాని కాలపరిమితి 45 ఏళ్లుకాగా, ఇప్పటి వరకూ దాదాపు 70 ఏళ్లపాటు పనిచేయడం జరిగిందన్నారు. 1970లోపు ఏర్పాటు చేయబడిన తుంగభద్ర, ప్రకాశం, నాగార్జునసాగర్ డ్యామ్‌కు స్టాప్ లాగ్స్ లేవన్నారు. 2002లో ప్రకాశం బ్యారేజ్ గేట్లు మార్చడం జరిగిందన్నారు. తీవ్రమైన వరదనీటిలో రిస్కు తీసుకుని తుంగభద్ర రిజర్వాయరు గేటు మార్చడం అనే పనిని చాలెంజ్‌గా నిర్వహించడం జరిగిందన్నారు. 50మంది సాయంతో ఐదు రోజుల్లో గేటు డిజైన్‌చేసి ఏర్పాటు చేయడమనేది ఒక రికార్డు అన్నారు. ఇప్పడు 26 లక్షల ఎకరాలకు నీరు లభించినట్టేనని కన్నయ్య నాయుడు అన్నారు.