హైదరాబాద్ : అహంకారానికి నిలువెత్తు నిదర్శనంగా కనిపించే కేసీఆర్ పార్టీ బీఆర్‌ఎస్‌కు తెలంగాణలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఓటర్లు రిక్తహస్తం చూపించారు. మొత్తం 17 లోక్‌సభ స్థానాల్లో ఆ పార్టీకి ఒక్కటి కూడా దక్కకపోగా రెండు మినహా అన్ని స్థానాల్లోనూ డిపాజట్ కోల్పోయింది. ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ రెండో స్థానంలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆర్‌ఎస్ ఓట్లు 23 శాతం మేర తగ్గాయి. రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ చెరో 8 స్థానాలు గెలుచుకోగా, ఎంఐఎం ఒక సీటు గెలుచుకుంది. ఈ ఫలితాలతో తెలంగాణ మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కు దిమ్మతిరిగిపోయింది. అందరూ అంచనా వేసినట్టుగానే.. కేసీఆర్ పార్టీ నేడు రాజకీయంగా అస్తమయం దిశగా పతనమవుతోంది. అత్యంత దారుణ, దయనీయ స్థితికి చేరిపోయింది. మొత్తం 17 స్థానాల్లో ఎక్కడా ఒక్క చోట కూడా.. బలమైన పోటీ ఇవ్వలేక పోయింది. మొత్తం 17 స్థానాల్లో రెండు, మూడైనా గెలుస్తామని బీఆర్‌ఎస్ సీనియర్లు చెప్పుకొచ్చారు.
మెదక్ కచ్చితంగా తమదేనని కూడా అనుకున్నారు. కానీ.. అక్కడ కూడా.. బీఆర్‌ఎస్ బలమైన పోటీ ఇవ్వలేక పోయింది. దీంతో పార్టీ ఆవిర్భావం తర్వాత.. తొలిసారి లోక్‌సభలో ప్రాతినిథ్యం లేకుండా పోయింది. 2002లో పార్టీని పెట్టిన తర్వాత నుంచి ఇప్పటి వరకు కూడా.. బీఆర్‌ఎస్ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చింది. వాస్తవానికి తెలంగాణ సాధన జరిగి కేవలం దశాబ్ద కాలమే అయింది. ఇంకా, నాటి ఉద్యమాలు.. సంగతులు, అరెస్టులు కూడా.. కళ్ల ముందు కనిపిస్తున్నాయి. మరి ఇలాంటి సమయంలోనూ.. కేసీఆర్ బలమైన పోటీ ఇవ్వలేకపోయారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లోనే చావు దెబ్బ తగిలిన పార్టీని ఉన్న మూడు నెలల కాలాన్ని సద్వినియోగం చేసుకుని లోటుపాట్లు సరిచేసుకునే ప్రయత్నం ఎక్కడా చేయలేదు. పైగా.. దొరల పాలన అన్న విమర్శలను కూడా.. కేసీఆర్ బలంగా తిప్పికొట్టలేక పోయారు.
కానీ, ఇప్పుడు కేవలం పుష్కర కాలంలోనే.. బీఆర్‌ఎస్‌కు లోక్‌సభలో ప్రాతినిధ్యం లేకుండా పోవడంతో ఆ పార్టీ మనుగడే ప్రమాదంలో పడిరదని చెప్పాలి. ఎన్నికల సమయంలో తాను ప్రధాని రేసులో ఉన్నానని కేసీఆర్ అదే పనిగా ప్రచారం చేసుకున్నారు. వైనాట్ అంటూ కేఏ పాల్ తరహాలో మాట్లాడారు. ఏపీలో జగన్ గెలుస్తారంటూ తన జోస్యం వినిపించారు. జగన్ విజయంపై తనకు సమాచారం ఉందని అదే పనిగా వ్యాఖ్యలు చేశారు. అది ఆయన కోరిక కావచ్చు కానీ.. తనకు తెలంగాణలో ఒక్క సీటు కూడా రాదన్న సమాచారం ఆయనకు ఎవరూ ఇవ్వలేదేమో కానీ ఇప్పుడు పరువు పోయింది. అడ్డగోలు రాజకీయాలు చేసిన ఫలితంగానే బీఆర్‌ఎస్ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇప్పుడు కనీస బలం కూడా లేకపోవడంతో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలు అంతా పక్క చూపులు చూడటం ఖాయంగా కనిపిస్తోంది. ఎన్నికలు అయిపోయాక తన పార్టీలో ఎంత మంది ఉంటారో.. ఎంత మంది వెళ్లిపోతారో అన్న సమాచారం అయినా కేసీఆర్‌కు ఉందో లేదో మరి !