అమరావతి : అసెంబ్లీలో టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు ప్రభుత్వం ఏ మాత్రం సుముఖంగా లేదని ఉండి ఎమ్మెల్యే మంతెన రామరాజు అన్నారు. రాష్ట్ర రైతాంగం సమస్యలపై ఇచ్చిన వాయిదా తీర్మానంపై ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేసింది? ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్ రూ.1.50 పైసలకు ఇస్తు న్నట్టు గవర్నర్ ప్రసంగంలో ప్రభుత్వం చెప్పించింది. ఎంతమందికి ఇస్తున్నారంటే 60వేల మంది ఆక్వా రైతులకు అని చెప్పారు. కానీ ఇంతకు ముందు ఆక్వా రైతులు ఎంత విద్యుత్ వాడేవారు..ఇప్పుడు ఎంత వాడుతున్నారో ప్రభుత్వం చెప్పాలి. 60వేల మంది రైతులు రోజుకి కోటి యూనిట్ల విద్యుత్ వాడుతున్నా రా.. లేక 30 లక్షల యూనిట్ల విద్యుత్ వాడుతున్నారా అనేది చెప్పకుండా మేం రూ.1.50 పైసలకే ఇస్తున్నా మని ప్రభుత్వం చెప్పుకోవడం బాధాకరం. వాస్తవంగా ప్రభుత్వ సబ్సిడీలు, రాయితీలు లేక రాష్ట్రవ్యాప్తంగా ఆక్వారంగం పూర్తిగా కుదేలైంది. టీడీపీ ప్రభుత్వంలో తమకు ఎలాంటి ఇబ్బందులులేవని, వైసీపీ ప్రభుత్వం వచ్చాకే పాతబకాయిల పేరుతో తమపై అధికంగా విద్యుత్‌ఛార్జీల భారం మోపి వేధిస్తోందని ఆక్వారైతు లు బోరుమంటున్నారని రామరాజు అన్నారు.
కాలువలు కూడా బాగుచేయించలేని ప్రభుత్వం
వ్యవసాయ రంగానికి కానీ, ఆక్వా సాగుకి కానీ పంటకాలువలు చాలా ముఖ్యం. వాటిని ఎప్పటికప్పు డు బాగుచేయాలి. వాటిలోని పూడిక తీయడం.. గుర్రపు డెక్క వంటి వాటిని తొలగించడం చేయాలి. కానీ ఈ ప్రభుత్వం అలాంటి ఆలోచన ఎప్పుడూ చేయలేదు. నీటికాలువలు పూర్తిగా నాచు,గుర్రపుడెక్క, బురదతో నిండి పోవడంతో పొలాలకు, చెరువులకు నీరు అందని పరిస్థితి. ఆక్వాసాగుకి ముఖ్యమైన ఫీడ్, సీడ్ ధరలు భారీగాపెంచారు. ఫీడ్ యాక్ట్, సీడ్ యాక్ట్ ను క్షేత్రస్థాయిలో అమలుచేయడం సాధ్యం కాదని చెప్పినా ఈ ప్రభుత్వం వినకుండా గుడ్డిగా ముందు కెళ్లింది. పెరిగిన డీవోఆర్‌బీ ధరల్ని కట్టడి చేయడంలో విఫలమైంది.
కేంద్రప్రభుత్వం ఇచ్చిన నిధులతో రైతు భరోసా కేంద్రాలు నిర్మించిన జగన్ ప్రభుత్వం, వాటి లో రైతులకు ఎలాంటి సేవలు ఎంత సమయంలో అందిస్తున్నారో చెప్పాలి. రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగుమందులు, ఎరువులు ఏవీ రైతు భరోసా కేంద్రాల్లో లభించడం లేదు. ఇలాంటి సమస్యలపై రైతుల పక్షాన చర్చించడం కోసం తెలుగుదేశం పార్టీ వాయిదా తీర్మానం ఇస్తే, దానిపై చర్చకు ప్రభుత్వం వెనకడుగు వేసింది. కేవలం సొంత మీడియా ద్వారా ప్రచారం చేసుకోవాలనే ఆరాటం కోసం ప్రభుత్వం అసెంబ్లీని నిర్వహిస్తోంది తప్ప, నిజంగా ప్రజలు, వారి సమస్యల పరిష్కారం కోసం కాదు. ప్రభుత్వం ఎంత మూర్ఖత్వంగా వ్యవహరించినా మేము వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. రేపు మరలా మరో అంశం పై వాయిదా తీర్మానం ఇస్తామని రామరాజు తేల్చిచెప్పారు.