- కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి లోకేష్ పర్యవేక్షణ
- క్షేత్రస్థాయిలో మంత్రి రామానాయుడు సమన్వయం
- రెండు గండ్లు పూడ్చివేత
- మూడోగండి పనులకు రంగంలోకి సైన్యం
- నేటికల్లా పూర్తయ్యే అవకాశం
- నేడు వినాయక చవితిరోజు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లోనే మంత్రి లోకేష్
విజయవాడ(చైతన్యరథం): మంత్రులు లోకేష్, నిమ్మల రామానాయుడు పర్యవేక్షణలో బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తుండగా క్షేత్రస్థాయిలో ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు సమన్వయంతో రేయింబవళ్ళు శ్రమించి గురువారం రాత్రికి రెండు గండ్లు పూడ్చివేశారు. మూడోగండి పూడ్చివేత పనులు మొదలయ్యాయి. ఫ్లడ్‌లైట్ల వెలుగులో రాత్రివేళ కూడా పనులను నిర్విరామంగా కొనసాగిస్తున్నారు. కాగా శనివారం వినాయక చవితి నాడు కూడా విజయవాడ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి వరద బాధితుల సహాయ కార్యక్రమాలు, బుడమేరు గండి పూడ్చవేత పనులను మంత్రి లోకేష్ పర్యవేక్షించనున్నారు.
మరోపక్క వరద తగ్గడంతో విజయవాడ నగరంలో సహాయ కార్యక్రమాలు ముమ్మరంగా సాగుతున్నాయి. వరద బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ జోరుగా సాగుతోంది.
బుడమేరు గండ్లు పూడ్చివేత పనులపై సీఎం చంద్రబాబు నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎప్పటికప్పుడు మంత్రులు లోకేష్, రామానాయుడు, అధికారులతో మాట్లాడి పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం ఏరియల్ సర్వే ద్వారా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు. వాతావరణం అనుకూలిస్తే శనివారం నాటికి మూడో గండి పూడ్చివేత పనులు పూర్తి చేస్తామని రామానాయుడు తెలిపారు.
బుడమేరుకు భారీస్థాయిలో ఏర్పడిన మూడవ గండి పూడ్చివేత పనులను డ్రోన్ లైవ్ ద్వారా సూచనలు ఇస్తూ మంత్రి లోకేష్ పర్యవేక్షిస్తున్నారు. గండ్ల పూడ్చివేత పురోగతిపై కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో మంత్రులు పయ్యావుల కేశవ్, అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ లతో కలిసి లోకేష్ శుక్రవారం సమీక్షించారు. ఏకకాలంలో గండికి రెండువైపుల నుంచి పూడ్చివేత పనులు జరుగుతున్నాయి. అప్రోచ్ రోడ్డు వేయడంతోపాటు పొదలు తొలగించడంతో రెండో వైపు నుంచి కూడా పనులు ప్రారంభమయ్యాయి. 24 గంటల్లో 3వ గండి పూడ్చివేత కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ గండ్ల ద్వారా 30 నుంచి 40వేల క్యూసెక్కుల వరదనీరు ప్రవహించి విజయవాడలోని రాయనపాడు, అజిత్‌సింగ్ నగర్, తదితర ప్రాంతాలను ముంచెత్తింది.
రంగంలోకి దిగిన ఆర్మీ
యుద్ధప్రాతిపదికన బుడమేరు గండ్లు పూడ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం పనిచేస్తుండగా సైన్యం కూడా రంగంలోకి దిగింది. గండ్ల వద్ద సమస్య పరిష్కరించేందుకు పలు చర్యలు తీసుకుంటోంది. బుడమేరు గండ్లను గేబియాన్ బుట్టల (ఇనుప చువ్వలతో బుట్టలా చేసి దానిని పెద్ద రాళ్లు, ఇసుక బస్తాలతో నింపుతారు) ద్వారా పూడ్చాలని నిర్ణయించినట్లు సైన్యం వెల్లడిరచింది. మూడో గండి 80 నుంచి 100 మీటర్లు ఉంది. దీనిని గేబియాన్ బుట్టలతో పూడ్చుతాం. మొదట గేబియాన్ బుట్టలు పేర్చి.. తర్వాత రాళ్లు వేస్తాం. బుట్టలను పటిష్టం చేసేందుకు 4 మీటర్ల వరకు రక్షితకట్ట నిర్మిస్తాం. గేబియాన్ బుట్టల తయారీ స్థానికంగా జరుగుతోంది. ఇసుక సంచులతో నింపి హెస్కో బుట్టలు కూడా వాడతాం. గండ్లను పూడ్చేందుకు ఆర్మీ హెచ్‌ఎడీఆర్ బృందం పనిచేస్తోందని ఆర్మీ అధికారులు తెలిపారు. మరోవైపు జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు దగ్గరుండి బుడమేరు మూడో గండి పూడ్చివేత పనులు పర్యవేక్షిస్తున్నారు.