- అవసరం మేరకు అదనపు భూమినీ ఇస్తాం
- మచిలీపట్నం అభివృద్ధికి పోర్టు దోహదం
- మఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
మచిలీపట్నం (చైతన్య రథం): బందర్ పోర్టు పనులను 2025 నాటికి పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రూ.3,669 కోట్ల అంచనాతో చేపట్టిన పోర్టు పనులు వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా మందకొడిగా సాగడంతో 24 శాతం మాత్రమే పూర్తయిందన్నారు. స్వచ్ఛత హి సేవా కార్యక్రమంలో భాగంగా మచిలీపట్నంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, బందరు పోర్టు పనులను బుధవారం పరిశీలించారు. పనుల పురోగతిపై పోర్టు అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘మచిలీపట్నం మంచి సిటీ. బ్రిటిష్‌వారి హాయంలో ఓ వెలుగు వెలిగింది. 2025 డిసెంబర్ నాటికి బందరు పోర్టు నిర్మిస్తాం. ఎప్పుడో పూర్తి కావాల్సిన పోర్టు దుర్మార్గుల నిర్లక్ష్యంతో వెనక్కిపోయింది. బందరు నుండి రేపల్లెకు రైల్వే లైను ఏర్పాటుకు చొరవ తీసుకుంటాం. పోర్టు నిర్మాణానికి అవసరమైన మరో 38.32 ఎకరాల భూమిని అందిస్తామని చంద్రబాబు వెల్లడిరచారు. పోర్టు పనులు పూర్తయితే మొదట నాలుగు బెర్త్‌లు ఏర్పాటవుతాయని, మాస్టర్ ప్లాన్ ప్రకారం 16 బెర్త్‌ల వరకూ ఏర్పాటు చేయవచ్చన్నారు. పోర్టు నిర్మాణం పూర్తయితే మచిలీపట్నం అభివృద్ధికి ఎంతో దోహదపడుతుందని, అమరావతి రాజధానికీ పోర్టు దగ్గరగా ఉంటుందన్నారు. అవసరమైన రోడ్లు, పోలీస్ ట్రైనింగ్ సెంటర్ స్ట్రీమ్ లైన్, నీటి సదుపాయం కల్పిస్తామమని సీఎం చంద్రబాబు ప్రకటించారు. కంటైనర్ పోర్టు కింద ఇంటిగ్రేడ్ చేస్తే తెలంగాణతోపాటు పలు రాష్ట్రాలకు ఉపయోగపడుతుందని అభిప్రాయపడ్డారు. ఈ పోర్టు కోసం ఏళ్ల తరబడి ఉద్యమాలు సాగిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రాధాన్యతను గుర్తించి తాను పోర్టు పనుల ప్రారంభిస్తే.. తర్వాత వచ్చిన పాలకులు విధానాలు మార్చి నిర్లక్ష్యం చేశారన్నారు. తాను కూడా మారిస్తే విధ్వంసం చేసినట్లు అవుతుందని.. పనులను యథావిధిగా కొనసాగిస్తామని సీఎం స్పష్టం చేశారు. పోర్టుకు అనుసంధానంగా పరిశ్రమలు తెస్తామని, బీపీసీఎల్ ఏర్పాటుపైనా త్వరలో క్లారిటీ వస్తుందన్నారు. పోలీస్ ల్యాండ్‌లో కట్టిన వైసీపీ కార్యాలయంపై సమాచారం సేకరించి యాక్షన్ తీసుకుంటామని సీఎం చంద్రబాబు వెల్లడిరచారు.
వాస్తవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారిక పర్యటనలో పోర్టు పరిశీలన లేదు. ఆబ్కారీ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి విజ్ఞప్తి మేరకు.. పర్యటనలో చిన్న మార్పు చేసుకుని మచిలీపట్టణం పోర్ట్‌కు సీఎం చంద్రబాబు వెళ్లారు. అధికారులు, పోర్ట్ ఇంజినీర్లతో కలిసి మాస్టర్ ప్లాన్ పరిశీలించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితులపై ఆరా తీశారు. ఏయే పనులు ఎంతమేరకు పూర్తయ్యాయి, ఇంకా చేపట్టాల్సిన పనులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.
ముఖ్యమంత్రి వెంట మంత్రులు పి నారాయణ, కొలుసు పార్థసారథి, కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలసౌరి, ఎమ్మెల్సీ పంచుమర్తి అనూరాధ, ఎమ్మెల్యేలు వెనిగళ్ల రాము, కాగిత కృష్ణ ప్రసాద్, వర్ల కుమార్ రాజా, మండలి బుద్ధప్రసాద్, యార్లగడ్డ వెంకట్రావు, అధికారులు, పోర్టు ఇంజనీర్లు ఉన్నారు.