- వైసీపీ పెత్తందారులకు చంద్రబాబు హెచ్చరిక
- ఇక ఎర్రచందనం స్మగ్లర్ల పనైపోయింది..
- తరిమికొడతానని హెచ్చరిక
- జగన్ సేవలో మునిగితే వాలంటీర్లు జైలుకే..
- ప్రజాసేవ చేసే వాలంటీర్లను వ్యతిరేకించం
- జాబు రావాలంటే.. బాబే రావాలి
- జీడీ నెల్లూరు రా… కదలిరా సభలో చంద్రబాబు
జీడీ నెల్లూరు: పులివెందులలోనే జగన్ ఫ్యూజ్ కాలి పోయింది.. వైసీపీనుంచి పోటీకి అభ్యర్థులే దొరకడం లేదు.. దిక్కులేని స్థితిలోవున్న వైసీపీ కుప్పంలో వేలు పెట్టగలదా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నిక ల్లో టీడీపీ, జనసేన కూటమి ప్రభంజనానికి ఫ్యాన్ రెక్కలు ముక్కలవటం ఖాయమన్నారు. మంగళవారం చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరులో నిర్వహించిన రా కద లిరా సభ జన ప్రభంజనమైంది. పోటెత్తిన జనాన్ని ఉద్దేశించి చంద్రబాబు ప్రసంగం ఉద్వేగంగానూ సాగింది. ‘చిత్తురు జిల్లాలో మీ మధ్యే పెరిగా. రాజకీయాల్లో ఎవరికీ దక్కని గౌరవం మీవల్ల నాకు దక్కింది. అక్కడినుంచే హెచ్చరిస్తున్నా. ఎర్రచందనం స్మగ్లర్లు, అవినీతిపరుల బాగోతం ఇక రెండు నెలలే. తరువాత ఆలోచించుకోడానికి కూడా మీకు అవకాశ ముండదు’ అంటూ అక్రమార్కులను హెచ్చరించారు.
‘నా చిన్నతనంలో గ్రామాల్లో కరెంట్ ఉండేది కాదు. ఒక ముఖ్యమంత్రిగా విద్యుత్ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చా. సోలార్, గాలితో నేడు విద్యుదుత్పత్తి అవుతోంది. డ్రైవర్ లెస్ కార్లొచ్చాయి. సంస్కరణలతోనే సంపద సృష్టి సాధ్యం. అలా పెరిగిన సంపద పేదలకందాలి. పేదరికం లేని సమాజం చూడాలన్నదే నా జీవిత లక్ష్యం. అది నెరవేరాలంటే రాష్ట్రానికి పట్టిన శనిగ్రహాన్ని తరిమికొట్టాలి. ప్రజలు `రాతియుగం వైపు పోకుండా స్వర్ణయుగం వైపు రమ్మంటున్న పిలుపే `రా..కదలిరా’ అన్నారు.
జగన్‌ని నమ్ముకున్న వాలంటీర్లు జైలుకే..
‘ఓటమి అన్న మానసిక రోగంతో జగన్‌రెడ్డి బాధపడుతున్నారు. అవినీతి సొమ్ముతో సిద్ధం కటౌట్లు పెట్టాడు. కానీ జగన్‌ని ఓడిరచి ఇంటికి పంపేందుకు జనమే సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గ్రహించలేక పోతున్నాడు. సిద్ధం కటౌట్ చూసినప్పుడు ఉపాధిలేక వలసలు, పెరిగిన ధరలు, బడుగు బలహీనవర్గాలపై దాడులతోపాటు ప్రభుత్వం మిమ్మల్ని పెట్టిన ఇబ్బందులన్నీ గుర్తుకు రావాలి. ఇతను మాకు వద్దని ఛీ కొట్టాలి. ఎన్నికల్లో మీరు బటన్ నొక్కితే జగన్ రెడ్డి మైండ్ బ్లాంక్ అవ్వాలి. దానికి మీరు సిద్ధమా?’ అంటూ చంద్రబాబు జనాన్ని ప్రశ్నించారు. మేం సిద్ధం అంటూ జనంలోంచి పెద్దఎత్తున సమాధానం వచ్చింది. వాలంటీర్ వ్యవస్థను జగన్ పార్టీకి వాడుకుంటున్న ఉదంతంపై మాట్లాడుతూ `‘జగన్‌ని నమ్ముకుంటే వాలంటీర్లు జైలుకెళ్లక తప్పదు. టీడీపీ వస్తే వాలంటీర్లను తొలగిస్తామని జగన్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజాసేవ చేసే వాలంటీర్లను వ్యతిరేకించం. కానీ వైసీపీకి సేవ చేసేవారిని వదలిపెట్టం. వాలంటీర్లతో జగన్ తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.
జగన్‌వల్ల రాష్ట్రం ఎలా నష్టపోయిందో ప్రతి ఇంటికి వెళ్లి మీరే వివరించాలి’ అని చంద్రబాబు సూచించారు. మీరే నాకు స్టార్ క్యాంపెనయిర్లు, జగన్ మార్క్ అంటూ జగన్ వ్యవస్థలను వాడుకునే కొత్త ప్రచారం మెదలుపెట్టాడని ఎద్దేవా చేశారు. ‘టీడీపీ హయాంలో రూ.200 కరెంట్ బిల్లు వస్తే నేడు రూ.1000 వస్తోంది. ఇదీ జగన్ మార్క్. టీడీపీ 5 ఏళ్లలో ఒక్కసారీ కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంట్ ఇచ్చింది. 9సార్లు కరెంట్ ఛార్జీలు పెంచి జగన్ రెడ్డి ప్రజలపై రూ.64 వేల కోట్ల భారం మోపారు అంటూ దుయ్యబట్టారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చారు. రూ.60 ఉన్న మద్యం బాటిల్‌ను జగన్ రూ.200లకు పెంచాడని, నాసిరకం బ్రాండ్లతో 30 లక్షల మందికి ఆరోగ్యం పాడైతే, 30 వేలమంది చనిపోయినా జగన్ రెడ్డికి ధనదాహం తీరలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చాక ఇలాంటి సమస్యలకు చెక్ పెడతామన్నారు. టీడీపీ హయాంలో రూ.5 లక్షల కోట్ల పెట్టుబడులతో 6 లక్షలమందికి ఉద్యోగాలిచ్చామని, 11 డీఎస్సీలు నిర్వహించి లక్షా 50వేలమందికి టీచర్ ఉద్యోగాలిచ్చామని గుర్తు చేస్తూ.. జాబు రావాలంటే మళ్లీ బాబు రావాలని పిలుపునిచ్చారు.
నాడు ఉచితంగా ఇచ్చిన ఇసుక నేడు కిలోల లెక్కన కొనాల్సి వస్తోందని బాబు ఎద్దేవా చేశారు. ‘నేడు ట్రాక్టర్ ఇసుక రూ.5వేలు. డబ్బంతా ఎవరికి వెళ్తోంది? ఇసుక దొంగలు ఖబడ్దార్ జాగ్రత్త’ అని హెచ్చరిం చారు. ఒక్క గ్రామంలో కూడా చిన్న డ్రైనేజీ కట్టలేకపోవటం జగన్ మార్క్ పాలనైతే `టీడీపీ హయాంలో 25 వేల కి.మీ సీసీ రోడ్లు వేశాం. ఇది నా మార్క్ పాలన అని చంద్రబాబు చెప్పుకున్నారు. నేడు ఎక్కడైనా రోడ్లు బాగున్నాయా? అని ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. అన్ని రోడ్లు గుంతలు పెట్టడమే జగన్ మార్క్ అని ఎద్దేవా చేశారు.
ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీ
ఆడబిడ్డలను అన్ని విధాల అభివృద్ధి చేసిన పార్టీ టీడీపీది అన్న చంద్రబాబు, ఆడబిడ్డ నిధి కింద ఇంట్లో ఎంతమంది మహిళలున్నా నెలకు రూ.1500 ఇస్తామన్నారు. తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా… ఆంక్షలు లేకుండా మోసం చేయకుండా అందరికీ రూ.15 వేలు ఇస్తానని, ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తానన్నారు. నిత్యవసరాల ధరలు తగ్గిస్తానని, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని. రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని. సబ్సీడీకి పనిముట్లు, వ్యవసాయ పరికరాలు అందిస్తామని హామీ ఇచ్చారు. వ్యవసాయాన్ని ఆధునీకరించి రైతుల్ని అన్ని విధాల ఆదుకుంటామన్నారు.
బీసీలకు రక్షణ చట్టం తెస్తానని, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీరందిస్తానని హామీ ఇచ్చారు. ఇంటింటి కుళాయి కోసం కేంద్రమిచ్చిన రూ.30 వేల కోట్లను ఉపయోగించుకోలేని అసమర్ధ ప్రభుత్వం వైసీపీ అని దుయ్యబట్టారు. తిరుమలను అపవిత్రం చేస్తున్నారని, భక్తులకు నాణ్యమైన ఫలహారం అందించలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయ పైరవీలకు వాడుకుంటున్న వైసీపీ పాపాలను, పాపులను పైనుంచి చూస్తున్నాడని, తప్పు చేసిన వారిని తప్పక శిక్షిస్తాడని హెచ్చరించారు.