- తిట్టడం తప్ప నీకెం తెలుసు నీతుల నాని?
- తాడేపల్లిలో పెద్ద సైకో జగన్…బందర్‌లో బుల్లి సైకో కిట్టు
- ఎన్డీయే ప్రభుత్వ హయాంలో బందర్‌కు పూర్వ వైభవం
- మచిలీపట్నం వారాహి విజయభేరి సభలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్
అమరావతి,చైతన్యరథం: మచిలీపట్నం ఎమ్మెల్యే నీతుల నానికి తమను ఎప్పుడూ తిట్టడం తప్ప తన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, ఎక్కడ చూసినా కమిషన్లే కనిపిస్తాయని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. పొద్దున లేస్తే నీతులు చెప్పడం కాకుండా బందర్ అభివృద్ధికి చేసింది ఏదో చెప్పగలవా అని పేర్ని నానిని వీరు ప్రశ్నించారు. ఇప్పుడు నీతుల నాని పోయి బుల్లి కిట్టు వచ్చాడని, ఇతను బందర్‌లో రౌడీ రాజ్యం చెలాయిసున్నాడని, ఎందరో మహానుభావులకు నెలవైన మచిలీపట్నాన్ని గంజాయి కేంద్రంగా మార్చారని విరుచుకుపడ్డారు. ఇక్కడి యువతతో పోల్చుకుంటే ఎమ్మెల్యే కొడుకు అయినంత మాత్రాన బుల్లి కిట్టుకు ఉన్న ప్రత్యేకత ఏముందని, మీ రక్తం ఏమైనా నీలి రంగులో పారుతుందా అని ప్రశ్నించారు. ఎన్డీయే కూటమి ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి మచిలీపట్నంలో నిర్వహించిన వారహి విజయభేరి సభలో పాల్గొన్నారు.
సైకో జగన్ జిల్లాలో సైకోని తయారు చేశాడు: చంద్రబాబు
మచిలీపట్నం ప్రజాగళం సభలో చంద్రబాబు మాట్లాడుతూ ‘‘‘సైకో జగన్ ఒక్కో జిల్లాకి ఒక్కో సైకోని తయారు చేశాడు. మమ్మల్ని మానసికంగా దెబ్బ తీయాలని చూస్తున్నాడు. కృష్ణా జిల్లాలో ఇద్దరు నానిలు మంత్రులుగా పదవులు వెలగబెట్టారు. ఒకరు బూతుల నాని, ఇంకొకరు నీతుల నాని. బందరులో ఉన్న నీతుల నాని మాట్లాడితే చెప్పులు చూపుతూ కథలు చెబుతాడు. ఆ కథలు చెప్పే ముందు బందరుకు ఏం చేశావో చెప్పే ధైర్యం ఉందా?’ అని చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. జగన్ నీకు మంత్రి పదవి ఇచ్చింది శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, నన్ను తిట్టడానికా అని నిలదీశారు. బుల్లెట్లకే భయపడని మేము వీళ్లకు భయపడతామా? అన్నారు. బందరు అభివృద్ధి కోసం ఎన్ని నిధులు తెచ్చావంటే సమాధానం చెప్పలేని నీతుల నాని మాటలకు విలువెక్కడుందన్నారు. ‘‘వారాహి నుంచి నీతుల నానికి సవాలు విసురుతున్నా.. బందరుకి నువ్వు చేసిన అభివృద్ధి ఏంటో చెప్పు. బందరులో అభివృద్ధి ఉందో లేదో గాని ఎక్కడ చూసినా ముడుపులు మాత్రం ఉన్నాయి. బందరు బైపాస్ లో నితీష్ అనే వ్యక్తి రూ. 150 కోట్లతో మాల్ కడితే ఎన్‌ఓసీ ఇవ్వకుండా ఈ నీతుల నాని అడ్డుపడ్డాడు. ఆంధ్రా బ్యాంక్ వ్యవస్థాపకులు భోగరాజు పట్టాభి సీతారామయ్య గారి మెమోరియల్ కడదామంటే ఎన్‌ఓసీ ఇవ్వకుండా అడ్డుపడ్డాడు ఈ నీతుల నాని. వారాహి నుంచి మాటిస్తున్నాం మేం అధికారంలోకి వచ్చిన మొదటి రోజునే మెమోరియల్ కు ఎన్‌ఓసీ ఇస్తాం. బందరు తమ్మనవారి సత్రం భూమి వెయ్యి గజాలు కబ్జా చేసింది ఎవరు? రంగనాయకస్వామి ఆలయలో గుడిని గుడిలో ఉండే లింగాన్ని కూడా మింగేసి నీతులు చెబుతాడు ఈ నాని’’ అని చంద్రబాబు విరుచుకుపడ్డారు.
నాని పోయి బుల్లి కిట్టు వచ్చాడు
‘‘ఇప్పుడు నీతుల నాని పోయి బుల్లి కిట్టు వచ్చాడు. పెద్ద సైకో జగన్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే పిల్ల సైకో కిట్టు ఇక్కడ తయారయ్యాడు. బందరులో గంజాయి బ్యాచ్ లు, రౌడీలు, గొడవలు, సెటిల్మెంట్ల వ్యవహారం మొత్తం కిట్టూనే చూస్తాడు. చివరికి ఆడబిడ్డలపై అఘాయిత్యం చేసే పరిస్థితికి వచ్చారు. నీతుల నాని ముందు వీటికి సమాధానం చెప్పాలి. మాట్లాడితే నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీలని జగన్ అంటారు. దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసిన దుర్మార్గుడు, శిరో ముండనం చేసిన వ్యక్తిని ఎమ్మెల్యేగా నిలబెట్టిన వ్యక్తి. ఎనిమిది మందిని సామూహికంగా శిరోముండనం చేసిన వ్యక్తికి శిక్ష పడిరది. అతను ఎమ్మెల్యే అభ్యర్ధి. జడ్జిలను తిట్టిన కేసులో ఇంటర్ పోల్ వెతుకుతున్న నింధితుల్ని పక్కన పెట్టుకుని తిరిగే పరిస్థితికి వచ్చాడు. రాష్ట్రానికి తీవ్ర గాయం చేసిన వ్యక్తి జగన్. విధ్వంసం, రౌడీయిజం, అవినీతితో రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. కోల్లు రవీంద్ర మీద మీ శాసనసభ్యుడు పెట్టిన తప్పుడు కేసును మర్చిపోం. ఏదో ఓక రోజున మీకు అదే జరుగుతుంది’’ అని చంద్రబాబు హెచ్చరించారు.
అతని కొడుకు దిగి వచ్చాడా: పవన్ కళ్యాణ్
విజయభేరి సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ‘‘రాష్ట్రంలోని యువతకు బందరు ఎమ్మెల్యే కొడుకుకి ఏంటి తేడా..? అతనికున్న అదనపు అర్హతలు ఏంటి..? ఆయనేమైనా పైనుంచి దిగివచ్చాడా..? ఇది ప్రజాస్వామ్యామా లేక రాచరికమా..? మీ రక్తం ఏమైనా నీలి రంగులో పారుతోందా..? జగన్ కులాల మధ్య చిచ్చు పెట్టడానికి ఎంతో ప్రయత్నిస్తుంటాడు. స్థానిక ఎమ్మెల్యేతో నన్ను బూతులు తిట్టిస్తుంటాడు. మేము మేము కాపులం అంటూ ఇష్టానుసారం తిడతాడు. ఎందుకు ఈ బలుపు..? జగన్ కు ఊడిగం చేసి కుక్క పిల్లలా ఉండాలంటే ఉండొచ్చు. అంతే కానీ కులం పేరు తీసుకొచ్చి ఇష్టానుసారం మాట్లాడితే జాగ్రత్త. ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడు. మర్యాద ఇచ్చినప్పుడు దానిని నిలబెట్టుకో… పిచ్చివాగుడు వాగడం మానేయ్… నాతో గొడవ పెట్టుకుంటే అదే చచ్చే వరకు అన్నది గుర్తు పెట్టుకో. చంద్రబాబు హయంలో పెద్దిరెడ్డి మీద ద్వేషం పెంచుకుంటే వాళ్లు రాష్ట్రంలో తిరిగేవాళ్లా..? వాళ్ల ప్రాంతంలోకి ఇతరులు రాకూడదని హుకుం జారీ చేస్తారు. వాళ్లు మాత్రం రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లి దోచుకోవచ్చు. అన్యాయం మీద సామాన్యుడు గుండె పగిలి తిరగబడితే ఎలా ఉంటుందో చూపిస్తా’’ అని హెచ్చరించారు.
ఇంత దిగజారి మాట్లాడిన ముఖ్యమంత్రి ఎవరూ ఉండరు
‘‘నేను ఏనాడూ జగన్ గారి సతీమణి గురించిగాని… వారి కుటుంబ సభ్యుల గురించిగానీ మాట్లాడలేదు. ఈ ముఖ్యమంత్రి మాత్రం ఇష్టానుసారం దిగజారి మాట్లాడుతున్నాడు. వ్యక్తిగత విషయాలను ప్రజా వేదికల్లో మాట్లాడుతూ మరింత దిగజారిపోతున్నాడు. పెళ్లాం అనే మాటను ఎవరూ.. ఎప్పుడు ఇతరుల భార్యలను ప్రస్తావిస్తూ ఉపయోగించరు. కానీ ముఖ్యమంత్రి మాత్రం పదే పదే అదే మాటను వాడుతూ ఏం మాట్లాడుతున్నాడో కూడా అదుపు లేకుండా మాట్లాడుతున్నాడు. సొంత చెల్లి జీవితాన్ని రోడ్డు మీదకు నెట్టేవాడు… ఆమెను గోడకు కొట్టేవాడు ఇంతకన్నా ఏం మాట్లాడగలడు. వ్యక్తిగత విషయాలు మాట్లాడుతూ ఈ ముఖ్యమంత్రి ప్రజల ముందు మరింత చులకన అవుతున్నాడు. చంద్రబాబు కూడా జగన్ లా పాలించి ఉంటే అసలు అన్ని రోజులు జగన్ రోడ్లపై తిరిగేవాడా..? అధికారంలోకి వచ్చేవాడా..? ప్రజలు ఆలోచించాలి. నేను కూడా పాలసీపరంగా చంద్రబాబుతో విబేధించినా ఏనాడు వ్యక్తిగతంగా ఆయన నన్ను దూషించలేదు. ప్రజాస్వామ్యయుతంగానే ప్రవర్తించారు’’ అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రాగానే బందర్‌కు పూర్వవైభవం తీసుకువస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్పారు. అధికారంలోకి వచ్చాక ఆక్వా రంగానికి విద్యుత్ సబ్సిడి ఇచ్చి ఆదుకుంటామని, 217 జీవో రద్దు చేసి మత్స్యకారులను ఆదుకుంటామని, వలలు, బోట్ల మీద మెరుగైన సబ్సిడి ఇస్తామని, మచిలీపట్నం పోర్టు పూర్తి చేసి బందరుకు పూర్వ వైభవం తెస్తామని హామీ ఇచ్చారు. అన్ని అభివృద్ధి పనులు పూర్తి చేసే బాధ్యత మాది.. మమ్మల్ని ఆశీర్వదించే బాధ్యత మీది అని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అన్నారు.