- నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
- గోదావరి గట్లు, చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహాలపై దృష్టి పెట్టాలి
- అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశాలు
- భారీ వర్షాలు, వరదలపై సమీక్ష
అమరావతి(చైతన్యరథం): రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై సీఎం చంద్రబాబు శుక్రవారం సమీక్షించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులన సీఎం అప్రమత్తం చేశారు. వర్షాలు అధికంగా ఉన్న ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, వివిధ శాఖల అధికారులతో శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం సమీక్షించారు. భారీ వర్షాలు కురుస్తున్న జిల్లాల్లోని తాజా పరిస్థితులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాతావరణ శాఖ ద్వారా వర్షాలు, వరదలను అంచనా వేసి ప్రజలను అప్రమత్తం చేయాలని సీఎం అన్నారు. ముందస్తు ప్రణాళికతో పనిచేయడం ద్వారా ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు.
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 185 మి.మి గాను 244 మి.మి నమోదైందని, రాష్ట్ర వ్యాప్తంగా 31 శాతం అదనంగా వర్షపాతం నమోదైందన్నారు. 13 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయిన ప్రాంతాలు కూడా ఉన్నాయన్నాన్న సీఎం…చెరువు కట్టలు, వాగుల్లో ప్రవాహాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఇసుక, మట్టి అక్రమ తవ్వకాల వల్ల గోదావరి కట్టలు బలహీన పడ్డాయని, వీటిపై దృష్టిపెట్టాలని అన్నారు. ఇరిగేషన్, రెవెన్యూ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. ఫ్లడ్ మాన్యువల్ ద్వారా నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విపత్తులు వచ్చినప్పుడే పనితీరు, సమర్థత బయటపడుతుందని…వర్షాల నేపథ్యంలో అధికారులు పూర్తి అప్రమత్తంగా, డైనమిక్ గా పనిచేయాలన్నారు.
వర్షాలు, వరదలు వచ్చిన తరువాత కాకుండా వాతావరణ శాఖ హెచ్చరికలు, పరిస్థితులను అంచనా వేసి ముందుగానే అప్రమత్తంగా వ్యవహరిస్తే నష్టాలను నివారించగలుగుతామని సూచించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ విషయంలో గతంలో ఉన్న వ్యవస్థలను వైసీపీ ప్రభుత్వం నాశనం చేసిందని…మళ్లీ వాటిని క్రియాశీలం చేయాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.