- జెండూబామ్ రాసి మరీ కొట్టారు
- జడ్జి ఎదుట కన్నీరు మున్నీరైన దారపునేని నరేంద్ర
- వైద్యపరీక్షల కోసం జిజిహెచ్‌కు రిఫర్ చేసిన న్యాయమూర్తి
గుంటూరు : అర్థరాత్రి మొదలు ఉదయం 5.30వరకు కొడు తూనే ఉన్నారు! ‘‘విచారణ పేరుతో మఫ్టీలో ఉన్న అయిదుగురు సిఐడి పోలీసులు నన్ను అర్థరాత్రి నుంచి ఉదయం 5.30గంటల వరకు కొట్టారు..జెండూబామ్ రాసి మరీ కొట్టారు.. దెబ్బలు బయట కు కన్పించకుండా చిత్రహింసలకు గురి చేశారు’’ అని తెలుగుదేశంపార్టీ మీడియా కోఆర్డినేటర్ దారపు నేని నరేంద్ర జడ్జి ఎదుట కన్నీరు మున్నీరయ్యారు. విచారణ పేరుతో నరేంద్రను సీబీఐ కస్టోడియల్ టార్చర్ చేసింది. బుధవారం రాత్రంతా నరేంద్రను తీవ్రంగా హింసించిన సిఐడి పోలీసులు గురువారం ఉదయం నుంచి సాయంత్రం గుంటూరులో వివిధ పోలీస్‌స్టేషన్ల చుట్టూ తిప్పుతూ కోర్టు సమయం అయ్యే వరకు కాల యాపన చేశారు. రాత్రి 7.30గంటలకు జడ్జి ఇంటి వద్ద నరేంద్రను సిఐడి పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా నరేంద్ర వాంగ్మూలాన్ని జడ్జి రికార్డు చేశా రు. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలు విన్న న్యాయమూర్తి నరేంద్రను వైద్యపరీక్షల నిమిత్తం జిజి హెచ్‌కి తరలించాల్సిందిగా ఆదేశించారు. రాత్రి 9.30 గంటలప్రాంతంలో జడ్జి ఆదేశాలమేరకు పోలీసులు నరేంద్రను గుంటూరు జనరల్ ఆసుపత్రికి తరలిం చారు.
జడ్జి నివాసం ఎదుట టిడిపి శ్రేణుల ఆందోళన
దారపునేని నరేంద్రను సిఐడి పోలీసులు విచారణ పేరుతో హింసించడాన్ని నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు గురువారం రాత్రి గుంటూరులోని సిఐడి కోర్టు జడ్జి నివాసం ఎదుట ధర్నా నిర్వహించారు. నరేంద్రపై భౌతికదాడికి పాల్పడిన సిఐడి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు.
రాత్రంతా నరకం చూపించారు!
నరేంద్రను వైద్యపరీక్షల నిమిత్తం గుంటూరు జిజిహెచ్ కు రిఫర్ చేసిన తర్వాత న్యాయవాది దొద్దాల కోటేశ్వరరావు మాట్లాడుతూ.. సిఐడి పోలీసులు నరేంద్రను చిత్రహింసలకు గురిచేశారు.. దెబ్బలు కనపడకుండా నరకం చూపించారు. ఆయనపై అదనంగా సాక్ష్యాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నించారంటూ 201 (2) సెక్షన్ ను అదనంగా చేర్చారని తెలిపారు. గతంలో రఘురామకృష్ణంరాజు నడవలేని పరిస్థితుల్లో గుంటూరు జిజిహెచ్ కు వెళ్లినా తప్పుడు రిపోర్టులు ఇచ్చారు. నరేంద్ర వైద్యపరీక్షల నివేదికకు కూడా అంతకు మించి వస్తుందని ఆశించలేమని అన్నారు. ఇదే విషయాన్ని తాము జడ్జికి చెప్పగా, జిజిహెచ్ వైద్యుల నివేదిక వచ్చాక తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారని కోటేశ్వరరావు పేర్కొన్నారు.