సుమారు 25 ఏళ్ళ క్రితం... భారతదేశంలో ఐటీ పేరెత్తితే బెంగళూరు నగరం గురించే చెప్పేవారు. ఏడాదికి కొన్ని వేల కోట్ల రూపాయల సాఫ్ట్ వేర్ ఎగుమతులతో కర్ణాటక రాష్ట్రానికి బోలెడంత ఆదాయం ఇస్తూ... ఐటీ హబ్ గా బెంగళూరు నగరం దూసుకుపోతోంది. ఇంజనీరింగ్ పూర్తిచేసి మంచి సాఫ్ట్ వేర్ ఉద్యోగం కావాలంటే దేశంలోని ఏ రాష్ట్ర యువత అయినా బెంగళూరుకే వెళ్లాల్సి వచ్చేది. ముంబయ్ కాస్త మెరుగ్గా ఉన్నప్పటికీ... ఢిల్లీ, చెన్నై వంటి నగరాల్లో ఐటీ రంగం బెంగళూరుతో పోటీ పడేంత స్థాయిలో లేదు. ఇక హైదరాబాద్ సంగతి సరే సరి. .అలాంటి సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నారు.
1997 మార్చి నెల... సాఫ్ట్ వేర్ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుల్లో ఒకరైన బిల్ గేట్స్ భారతదేశం వచ్చారు. చంద్రబాబు నాయుడు ఆయన అపాయింట్మెంట్ తీసుకుని తన విజన్ గురించి చెప్పారు. ఒక రాజకీయ నాయకుడికి ఇలాంటి విజన్, ఐటీ మరియు సాంకేతిక రంగాల మీద శ్రద్ధ, అవగాహన ఉండటం బిల్ గేట్స్ ను ఆశ్చర్యపరచింది. కలిసింది మొదటిసారే అయినా... ఆంధ్రప్రదేశ్ లో మైక్రోసాఫ్ట్ సంస్థ కార్యాలయం ఏర్పాటుకు బిల్ గేట్స్ అంగీకారం తెలిపారు. అప్పటికి అమెరికాలో ప్రధాన కార్యాలయం తప్ప ప్రపంచంలో మరెక్కడా మైక్రోసాఫ్ట్ కార్యాలయం లేదు.
అదే సంవత్సరం (1997) విజన్ 2020 డాక్యూమెంట్ తయారీకి 14 టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేసారు చంద్రబాబు. దానికి తోడు హైదరాబాద్ నగర శివారులో హైటెక్ సిటీ కట్టేందుకు ఉపక్రమించారు. హైదరాబాద్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ కన్సల్టెన్సీ సిటీ... దీన్నే షార్ట్ కట్ లో హైటెక్ సిటీ అంటున్నాం.
హైటెక్ పేరుతో ఒక బిల్డింగ్ కట్టేస్తే... అందులో వచ్చే ఒక నాలుగు కంపెనీలతో రాష్ట్రానికి ఒరిగేదేంటి అని ప్రతిపక్షాలు ఎగతాళి చేసాయి. దేనికైనా చేతల్లోనే సమాధానం చెప్పే అలవాటున్న చంద్రబాబు... హైటెక్ సిటీలో సైబర్ టవర్స్ పేరిట ఒక నిర్మాణం చేసి... 1998 నవంబర్ 22న నాటి ప్రధాని వాజపేయి చేతుల మీదుగా ప్రారంభింపచేసారు.
ఆ తర్వాత హైదరాబాద్ ముఖచిత్రం మారిపోయింది. మాట ఇచ్చినట్టుగానే 1999 ఫిబ్రవరి 28న హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ ను ప్రారంభించారు బిల్ గేట్స్. తర్వాత ఇన్ఫోటెక్, ఐబియం, జీఈ, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్, డెల్, ఒరాకిల్ వంటి ఎన్నో ఐటీ సంస్థలు హైటెక్ సిటీ చుట్టూరా పాతుకుపోయాయి. తెలుగునాట సామాజిక, ఆర్థిక పురోగతికి బీజం వేసిన హైటెక్ సిటీలోని సైబర్ టవర్స్ నగరానికి ఒక ఐకాన్ గా మారిపోయింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వున్న లక్షల మంది యువతకు లక్షల్లో జీతాలిచ్చే సలక్షణమైన ఉపాధి కేంద్రమైంది హైటెక్ సిటీ. ఐటీ అన్న పదాన్ని మారుమూల తెలుగు యువతకు పరిచయం చేసి... రైతు బిడ్డలను ఐటీ ఉద్యోగులుగా మార్చింది హైటెక్ సిటీ. చదువుకున్న ప్రతి ఒక్కరికీ హైదరాబాద్ వెళ్తే ఉద్యోగం పక్కా అని భరోసా ఇచ్చి... మధ్యతరగతి వారిని ఎందరినో విదేశీ విమానాలు ఎక్కించింది హైటెక్ సిటీ.
1999 జనవరి 26... విజన్ 2020 పేరిట డాక్యుమెంట్ ను విడుదల చేసారు చంద్రబాబు. 2020 లక్ష్యంగా "ఆంధ్రప్రదేశ్ విజన్: 2020" పేరుతో చంద్రబాబు విడుదల చేసిన ఆ దార్శనిక పత్రం గురించి విని నవ్విన వారికి సమాధానమే సైబరాబాద్.
బెంగుళూరు, ముంబయిలతో పొటీపడి ఐటీ రంగాన్ని హైదరాబాద్ ఆకట్టుకుంటున్నవేళ... ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్, ఐఆర్డిఏ, ఐఐఐటీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, రహేజా మైండ్ స్పేస్, టెలికాం రెగ్యులేటరీ అధారిటీ... వంటి ఎన్నో సంస్థలను హైదరాబాద్ కు తెచ్చారు చంద్రబాబు. కరోనా వాక్సిన్ ను ప్రపంచానికి అందజేసిన భారత్ బయోటెక్ వంటి సంస్థలకు నెలవైన జీనోమ్ వ్యాలీని ఏర్పాటు చేసారు చంద్రబాబు. వీటితో పాటు సరికొత్త భవనాలు అధునాతన సదుపాయాలు ఏర్పాటయ్యాయి. సైబర్ టవర్స్ ను అనుకునే హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటయింది. వినూత్నంగా, ఆధునికతకు మారుపేరుగా అభివృద్ధి చెందుతున్న హైటెక్ సిటీ పరిసర ప్రాంతాలకు ప్రత్యేకంగా ఒక పోలీస్ కమీషనరేట్ ను 2003లో ఏర్పాటు చేసారు చంద్రబాబు. నాటి నుండి సికింద్రాబాద్, హైదరాబాద్ ల సరసన సైబరాబాద్ చేరింది.
నాడు ఐటీ రంగంలో చంద్రబాబు సాధించిన విజయాన్ని చూసిన అమెరికన్ మ్యాగజైన్ "టైమ్"కు చెందిన అపరిసిమ్ ఘోష్... " గ్రామీణ వెనుకబడినతనం, పేదరికం ఉన్న ప్రాంతాన్ని, కేవలం ఐదు సంవత్సరాలలో భారతదేశ కొత్త సమాచార-సాంకేతిక కేంద్రంగా మార్చారు చంద్రబాబు." అని పేర్కొన్నారు. ఆ పత్రిక చంద్రబాబును "సౌత్ ఆసియన్ ఆఫ్ ద ఇయర్ "గా అభివర్ణించింది.
అలాగే 2000 జనవరి 9 ఇండియా టుడే తదితర సంస్థల పోలింగ్ లో 11,016 ఓట్లతో 'ఐటీ ఇండియన్ ఆఫ్ ది మిలీనియం'గా చంద్రబాబు నాయుడు ఎంపిక అయ్యారు
1995లో హైదరాబాద్ నగరంలోని ఐటి సెక్టార్ లో ఉన్న ఉద్యోగాలు 5 వేలు అయితే 2003 నాటికి ఆ ఉద్యోగాల సంఖ్య 10 లక్షలకు చేరింది. భారతదేశ ఐటీ రంగంపై నారా చంద్రబాబు నాయుడు వేసిన ప్రత్యేకమైన ముద్ర ఇది.
నవ్యాంధ్రలోనూ అదే జోరు:
తెలుగు రాష్ట్రాల విభజనతో హైదరాబాద్ నగరం... దానితో పాటే చంద్రబాబు ఎంతో కష్టపడి అభివృద్ధి చేసిన సైబరాబాద్... అన్నీ తెలంగాణకు వెళ్లిపోయాయి. రాజధాని కూడా లేని నవ్యాంధ్రకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు... విశాఖ, తిరుపతి, విజయవాడలను ఒక్కొక్క సైబరాబాద్ గా తీర్చిదిద్దాలనుకున్నారు. ముఖ్యంగా విశాఖను ఐటీ హబ్ గా తీర్చిదిద్ధేందుకు కృషిచేశారు.
ఐటీ శాఖామంత్రిగా తనకు ఇచ్చిన అవకాశాన్ని సమర్థవంతంగా సద్వినియోగం చేసుకున్న నారా లోకేష్... ఆంధ్రప్రదేశ్ కు కాండ్యుయెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్‌సీఎల్ వంటి ప్రతిష్ఠాత్మక ఐటీ సంస్థలను తెచ్చారు.
నూతన ఐటీ విధానం ద్వారా రెంటల్ సబ్సిడీ, ఐటి ఇన్సెంటివ్ ప్యాకేజీ ఇచ్చి దాదాపు 170 ఐటీ సంస్థలను రాష్ట్రానికి తెచ్చి 38వేలకు పైగా ఉద్యోగాలను కల్పించారు నాటి ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. అందులో విశాఖకే 110 ఐటీ కంపెనీలను తెచ్చి 24 వేల మంది విశాఖ యువతకు ఐటీ ఉద్యోగాలు ఇచ్చారు. రుషికొండలో ప్రపంచ ఫిన్ టెక్ మకుటాన్ని తీర్చిదిద్దారు. ఫైనాన్షియల్ టెక్నాలజీ అవసరాలు పెరుగుతుండటంతో విశాఖ ఐ.టి.హిల్స్‌పై ఫిన్‌టెక్ సంస్థ ‘ఫిన్‌టెక్ టవర్’ను ప్రారంభించింది
హెచ్‌సీఎల్ కంపెనీ రాకతో ఐటీ రంగంలో అమరావతి ప్రత్యేక స్థానాన్ని సాధించింది. గన్నవరంలో పదేళ్లుగా ఖాళీగా ఉన్న మేధా టవర్స్‌లోని రెండు లక్షల చదరపు అడుగుల స్థలంలో 2 వేల మందికి ఉద్యోగాలు కల్పించే అనేక ఐటీ కంపెనీలు ఏర్పాటయ్యాయి. గన్నవరానికి అనుబంధంగా మంగళగిరి మినీ ఐటీ కేంద్రంగా మారింది. పైకేర్, ఇన్వికాస్ సహా అనేక కంపెనీలు కొలువుదీరాయి. ముఖ్యంగా స్టార్ట్ అప్ సంస్థలకు ఆనాడు ఈ పట్ణణం ప్రధాన కేంద్రంగా నిలిచింది
ఏపీలో 2014లో రూ. 379 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు .. 2019 నాటికి రూ.6 వేల కోట్లకి చేరాయంటే అది నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ల సంయుక్త విజయం.