- రైతులకు గిట్టుబాటు ధర భరోసా
- కందులు, పెసలు, మినుముల కొనుగోలు చేస్తాం
- కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం
- రాష్ట్ర వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు కృషికి ఫలితం
అమరావతి (చైతన్యరథం): రాష్ట్ర రైతులకు మేలు చేసేలా కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. పప్పుదినుసుల కొనుగోలుకు ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో రాష్ట్రంలోని పప్పు దినుసుల రైతులకు గిట్టుబాటు ధర లభించనుండగా, వారి ఆదాయం పెరిగే అవకాశాలు మెరుగుపడ్డాయి. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు నిరంతర కృషి, కేంద్ర ప్రభుత్వంతో చేసిన సమన్వయ ప్రయత్నాల ఫలితంగా ఖరీఫ్ 2025`26 సీజన్‌కు సంబంధించి పప్పుదినుసుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ వెల్లడిరచారు. ఈ మేరకు మంత్రి అచ్చెన్నాయుడుకి కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ లేఖ రాశారు. ప్రైస్ సపోర్ట్ స్కీమ్ (పీఎస్‌ఎస్) కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ) వద్ద 1,16,690 మెట్రిక్ టన్నుల కందులు, 903 మెట్రిక్ టన్నుల పెసలు, 28,440 మెట్రిక్ టన్నుల మినుములు కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఆ లేఖలో తెలిపారు.
ఈ నిర్ణయం పూర్తిగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రత్యేక చొరవ, రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చేసిన నిరంతర ప్రయత్నాల వల్లే సాధ్యమైందని కేంద్ర మంత్రి ప్రశంసించారు. దీని ద్వారా రాష్ట్రంలోని కందులు, పెసలు, మినుములు పండిరచే రైతులకు గిట్టుబాటు ధర లభించడంతో పాటు, తక్కువ ధరలకు పంటలను విక్రయించాల్సిన పరిస్థితి తప్పుతుందన్నారు. రైతులకు కనీస మద్దతు ధర భరోసా కల్పించేందుకు, అవసరమైనప్పుడు మార్కెట్‌లో జోక్యం చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. ఈ నిర్ణయం వల్ల ఖరీఫ్ 2025`26 సీజన్‌లో ఆంధ్రప్రదేశ్ రైతులకు గణనీయమైన మేలు జరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
త్వరితగతిన కొనుగోలు: మంత్రి అచ్చెన్నాయుడు
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో పప్పు రైతులకు గిట్టుబాటు ధర లభించనుండగా, వారి ఆదాయం పెరిగే అవకాశాలు మెరుగుపడ్డాయని మంత్రి అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్రంలో పప్పుదినుసుల కొనుగోలు ప్రక్రియను త్వరితగతిన చేపట్టి, రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి అచ్చెన్న పేర్కొన్నారు










