- సీఎం జగన్‌కు డిల్లీ రaలక్!
- అజెండాలో స్పష్టం చేసిన కేంద్రం
- ఈనెల 27న కేంద్ర హోంశాఖ సమావేశం
- 3రాజధానులను ప్రస్తావించని కేంద్ర హోంశాఖ
(చైతన్యరథం ప్రత్యేక ప్రతినిధి – అమరావతి)
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పరిష్కారం కాని విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ ఈనెల 27న కీలక సమావేశం నిర్వహించనుంది. విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్ర సహకారంపై భేటీలో చర్చించనున్నారు. విభజన చట్టం షెడ్యూల్ 9, 10లోని ఆస్తుల పంపకాలపైనా భేటీలో చర్చించనున్నట్లు సమాచారం. ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న ఆర్థిక పరమైన అంశాలూ చర్చకు రానున్నాయి. సమావేశంలో ఏ అంశాలు చర్చించాలన్న దానిపై కేంద్ర హోం శాఖ ఇరు రాష్ట్రాల అధికారులకు ఇప్పటికే సమాచారం అందించింది. కాగా ఒక్క రాజధానికే నిధులిస్తామని తాజాగా విడుదల చేసిన ఉత్తర్వుల్లో కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. మూడు రాజధానుల పేరుతో నాటకమాడుతున్న జగన్ రెడ్డికి కేంద్ర తాజానిర్ణయంతో షాకిచ్చింది.
కేంద్ర హోంశాఖ అజెండాలో 3 రాజధానులపై ప్రస్తావించలేదు. కొత్త రాజధానికి నిధులు అని మాత్రమే పేర్కొంది. కొత్త రాజధాని ఏర్పాటుకు కేంద్ర సహకారం, విద్యాసంస్థల స్థాపన, రాజధాని నుంచి ర్యాపిడ్ రైల్ అనుసంధానంపై చర్చించాలని కేంద్ర హోంశాఖ అజెండాలో పొందుపరిచింది. కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌భల్లా నేతృత్వంలో జరిగే ఈ భేటీకి హాజరుకావాలని ఏపీ, తెలంగాణ ప్రధాన కార్యదర్శులతో పాటు రైల్వే బోర్డు ఛైర్మన్ సహా వివిధ శాఖల అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. కేంద్ర ఆర్థికశాఖతో పాటు విద్య, రైల్వే, పెట్రోలియం శాఖతో పాటు దాదాపు 9శాఖల అధికారులను భేటీకి ఆహ్వానించారు. ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు సంబంధించి ఇప్పటికీ కొలిక్కి రాని పరిస్థితి నెలకొంది. దీనిపై కూడా చర్చించేందుకు అజెండాలో పొందుపర్చారు. వీటితో పాటు సింగరేణి కాలరీస్, ఏపీ హెవీ మిషనరీ ఇంజినీరింగ్‌కు సంబంధించిన రెండు సంస్థలపై, పన్ను ప్రోత్సాహకాలు, రెవెన్యూ లోటు భర్తీ, ఏపీలో వెనుకబడిన 7 జిల్లాలకు ఇవ్వాల్సిన గ్రాంటుపై చర్చ జరిగే అవకాశముంది.
రాష్ట్ర విభజన అంశాలపై ఈనెల 27న కేంద్ర హోంశాఖ సమావేశం కానుంది. విభజన చట్టం ప్రకారం రాజధానికి కేంద్రం సహకారంపై సమావేశంలో చర్చించనున్నారు.