తెలుగుదేశం పార్టీ దమ్ము ఏమిటో ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతుంది. రాజకీయాలలో దమ్ము అంటే రోడ్డు మీద వీధి రౌడీల తరహాలో తొడలు కొట్టుకుంటూ విసురుకునే ఛాలెంజ్ కాదు. తాను చేసిన అభివృద్ధిని సగర్వంగా చెబుతూ అందుకు సజీవ సాక్ష్యంగా వున్న చోట సెల్ఫీ ఫోటో దిగి ప్రజల ముందు వుంచి, ఇలాంటిది నువ్వేమైనా చేసావా అంటూ సవాల్ విసరటం. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తొలిసారిగా ఈ విధమైన సెల్ఫీ ఛాలెంజ్ కు శ్రీకారం చుట్టారు. ఇప్పుడది రాష్ట్రవ్యాప్తంగా ఒక పెద్ద సునామీని రేకెత్తిస్తోంది.
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సైతం తాను సిఎం గా నిర్మించిన టిడ్కో గృహ సముదాయం ముందు శుక్రవారం స్వయంగా సెల్ఫీ దిగి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ” చూడు జగన్ ఇవే మా ప్రభుత్వ హయాంలో పేదలకు నాడు నెల్లూరు లో కట్టిన వేలాది టిడ్కో ఇళ్లు. టిడిపి హయాంలో నిర్మించిన లక్షల ఇళ్లకు ఇవే సజీవ సాక్ష్యం అని చంద్రబాబు ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఈ నాలుగేళ్లలో నువ్వు కట్టిన ఇళ్లు ఎన్ని? నువ్వు కట్టిన ఇళ్లెక్కడ? జవాబు చెప్పగలవా? అంటూ జగన్ ను ట్యాగ్ చేస్తూ సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. తన మొబైల్ ఫోన్ తో నెల్లూరులోని టిడ్కో గృహ సముదాయం వద్ద స్వయంగా సెల్ఫీ తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై ప్రభుత్వానికి సెల్ఫీ ఛాలెంజ్ విసరాలని టిడిపి నాయకులు, కార్యకర్తలకు చంద్రబాబు ఇంతకుముందే పిలుపునిచ్చారు. అందుకనుగుణంగా చంద్రబాబు తానే ముందుగా శ్రీకారం చుట్టారు.
పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన ఈ సరికొత్త సంప్రదాయం రాజకీయ యవనికపై సంచలనాలు నమోదు చేస్తోంది. యువగళం పాదయాత్ర సందర్భంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో టిడిపి హయాంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ఏర్పాటైన పరిశ్రమల ముందు లోకేష్ స్వయంగా సెల్ఫీ దిగి విసిరిన సవాళ్లకు అధికార పార్టీ వైపు నుంచి ఇప్పటి వరకు ప్రతిస్పందన లేకుండా పోయింది. అసభ్య పదజాలాలు, ఫేక్ ప్రచారాలకు అలవాటు పడి పదే పదే ‘ దమ్ము ‘ గురించి మాట్లాడే అధికార పార్టీ నాయకులకు ఈ సెల్ఫీ ఛాలెంజ్ ఒక చెంపపెట్టు వంటిది. ఒకరకంగా చెప్పాలంటే నోరుతెరిస్తే చాలు ‘ దమ్ము ‘ అనే పదాన్ని పర్యాయపదంగా వాడే నాయకులకు ఈ సెల్ఫీ ఛాలెంజ్ లు దుమ్ము దులిపాయి.
సెల్ఫీ ఛాలెంజ్ లకు సమాధానం చెప్పే ‘ దమ్ము ‘ అధికార పార్టీ నాయకులకు వుందా? అని క్షేత్రస్థాయిలో సామాన్య ప్రజానీకం ప్రశ్నిస్తోంది. సెల్ఫీ ఛాలెంజ్ లకు సమాధానం చెప్పలేక అధికార పార్టీ ఆత్మరక్షణ లో పడింది. దాదాపు అన్ని నియోజకవర్గాల లోనూ ప్రతి గ్రామం నుంచి టిడిపి హయాంలో జరిగిన అభివృద్ధిని చూపుతూ సెల్ఫీ ఛాలెంజ్ విసరాల్సిందిగా చంద్రబాబు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఆ దిశగా సామాజిక మాధ్యమాలలో ఛాలెంజ్ లు హోరెత్తసాగాయి. గత నాలుగు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఏ విధమైన అభివృద్ధి జరగటం లేదన్నది కేవలం ఆరోపణ గానే కాకుండా, ఆధార పూర్వకంగా ప్రజల ముందు ఉంచాలనే చంద్రబాబు వ్యూహం విజయవంతం అవుతున్న సూచనలు కన్పిస్తున్నాయి.