హైదరాబాద్: టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హైదరాబాదులోని ఏఐజీ (ఏషియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ) ఆసుపత్రిలో చేరారు. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి మంగళవారం విడుదలైన చంద్రబాబు బుధవారం హైదరాబాదులోని తన నివాసానికి చేరుకున్నారు. ఆయనను ఏఐజీ వైద్యుల బృందం కలిసి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేసింది. ఆసుపత్రికి వచ్చి వైద్య పరీక్షలు చేయించుకోవాలని చంద్రబాబుకు డాక్టర్లు సూచించారు. దాంతో, గురువారం ఉదయం ఆయన ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకున్నారు. చంద్రబాబు మెడికల్ రిపోర్ట్స్ పరిశీలించిన వైద్యులు… ఆయన ఆసుపత్రిలో చేరితే బాగుంటుందని తెలిపారు. వైద్యుల సూచనతో చంద్రబాబు ఏఐజీ ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన వెంట కుటుంబ సభ్యులు నారా భువనేశ్వరి, నారా లోకేష్, బ్రాహ్మణి ఉన్నట్లు తెలుస్తోంది. వీరితో పాటు టీడీపీ కీలక నేతలు కూడా ఉన్నారని సమాచారం. మరోవైపు చంద్రబాబు త్వరగా అనారోగ్య సమస్యల నుంచి కోలుకోవాలని టీడీపీ కార్యకర్తలు పూజలు చేస్తున్నారు.