హైదరాబాద్: ఎన్డీయే భాగ స్వామ్య పక్షాలైన టీడీపీ, జనసేన పార్టీల అధినేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్ గురువారం హైదరా బాదులో సమావేశమయ్యారు. చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా పొత్తుకు సంబంధించిన అంశాల పై చర్చించారు. ఇప్పటికే టీడీపీ, జనసేన పలువురు అభ్యర్థులతో జాబితాలు ప్రకటిం చాయి. మిగిలిన అభ్యర్థులు, వారి స్థానాలు తదితర అంశాలపై ఈ సమావేశంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ చర్చించారు. వీలైనంత త్వరగా మిగిలిన అభ్యర్థులను ప్రకటించి, ఎన్నికల ప్రచారం మొదలుపెట్టాలని ఇరువురు నిర్ణయించారు. ఎన్నికలు 50 రోజుల్లో ఉన్నందున సాధ్యమైనంత బలంగా ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో అనుసరించాల్సిన ఉమ్మడి ప్రచార వ్యూహంపై చంద్రబాబు, పవన్ సమాలో చనలు జరిపారు. మరిన్ని ప్రజాగళం సభలు నిర్వహించడంపై కూడా ఈ భేటీలో చర్చించారు. పొత్తులో భాగంగా ఏపీలో టీడీపీ 144 అసెంబ్లీ స్థానాలు, 17 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. జనసేన 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది. మిగిలిన 6 ఎంపీ స్థానాలు, 10 అసెంబ్లీ స్థానాలు బీజేపీకి కేటాయించారు. టీడీపీ ఇప్పటికే 128 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఇంకా 16 అసెంబ్లీ, 17 లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.