- ఓటర్ల జాబితాలో అక్రమాలపై ఫిర్యాదు
- మధ్యాహ్నం ఆళ్లగడ్డలో రా.. కదలిరా సభకు బాబు హాజరు
- రేపు బొబ్బిలి, తునిలో సభలు
అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మంగళవారం ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం అధికారులను కలవనున్నారు. రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో జరుగుతున్న అక్రమాలను ఈసీ బృందం దృష్టికి తీసుకువెళ్లనున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో పెద్దసంఖ్యలో టీడీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగిస్తున్న వైనం, అధికార పార్టీ నేతలు కొందరు గంపగుత్తగా ఓట్ల తొలగింపునకు ఉద్దేశించిన ఫామ్ 7 దరఖాస్తులు సమర్పిస్తున్నా అధికారులు సరైన చర్యలు తీసుకోని విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకువెళ్లనున్నారు. ఓట్ల అవకతవకలపై చంద్రబాబు ఇప్పటికే ఢల్లీిలో ఓసారి సీఈసీని కలిశారు.
చంద్రబాబు, పవన్ ఇద్దరూ కలిసి సీఈసీతో భేటీ కానుండడం ఇదే ప్రథమం. ఉదయం ఉండవల్లి నివాసం నుండి బయలుదేరి విజయవాడ నోవాటెల్ హోటల్లో ఈసీ బృందంతో 11.10 గంటల నుండి 30 నిమిషాలు చంద్రబాబు, పవన్ భేటీ అవుతారు. ఈ సమావేశం అనంతరం చంద్రబాబు తిరిగి ఉండవల్లి నివాసానికి చేరుకుని, మధ్యాహ్నం ఒంటిగంటకు హెలీకాప్టర్‌లో బయలుదేరి, 2 గంటలకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ చేరుకుంటారు. 2.30 నుంచి 3.45 వరకు ఆళ్లగడ్డ బీబీ రెడ్డి స్కూలు ఎదురుగా జరిగే రా.. కదలిరా సభలో పాల్గొంటారు. సభ అనంతరం హెలీకాప్టర్‌లో బయలుదేరి సాయంత్రం 5.30కి ఉండవల్లి నివాసానికి చేరుకుంటారు.
బుధవారం (10వ తేదీ) ఉదయం 10.15 గంటలకు విజయవాడ నుంచి విమానంలో బయలుదేరి 11.10 కి విశాఖ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడనుండి హెలీకాప్టర్‌లో విజయనగరం జిల్లా బొబ్బిలి చేరుకుంటారు. మధ్యాహ్నం 12 గంటలనుండి 1.30 వరకు బొబ్బిలి రాజా కాలేజీ మైదానంలో జరిగే రా.. కదలిరా సభలో పాల్గొంటారు. అక్కడనుండి 2.45 గంటలకు హెలీకాప్టర్‌లో బయలుదేరి 3.35 గంటలకు కాకినాడ జిల్లా తుని మండలం చామవరం హెలీప్యాడ్ వద్ద దిగుతారు.
3.45 నుండి సాయంత్రం 5.45 వరకు తుని మండలం ఎస్ అన్నవరంలో జరిగే రా.. కదలిరా సభలో పాల్గొంటారు. తరువాత రోడ్డు మార్గంలో బయలుదేరి రాజమండ్రి విమానాశ్రయం చేరుకుని, రాత్రి 8.10 గంటలకు విమానంలో హైదరాబాద్ వెళతారు. 9.10 గంటలకు హైదరాబాద్‌లోని బేగంపేట విమానాశ్రయానికి చేరుకుని, జూబ్లీహిల్స్‌లోని నివాసానికి వెళతారు.