సీఐడీ పదేపదే వాయిదాలు కోరడంపై ఆగ్రహం
ఇదే చివరి వాయిదా అని స్పష్టం చేసిన హైకోర్టు
అమరావతి: స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ప్రధాన బెయిల్ పిటిషన్‌పై విచారణను రాష్ట్ర హైకోర్టు ఈ నెల 15వ తేదీకి వాయిదా వేసింది. శుక్రవారం హై కోర్టులో చంద్రబాబు పిటిషన్‌పై విచారణ జరగాల్సి ఉండగా ప్రభుత్వ అదనపు ఏజీ హాజరు కాలేదనే కారణంగా తమకు మరింత సమయం కావాలని, విచారణను వాయిదా వేయాలని ఏపీ సీఐడీ పీపీ వివేకానంద కోరటంతో విచారణను న్యాయస్థానం వాయిదా వేసింది. తొలుత ఈ నెల 22 వ తేదీకి వాయిదా వేయలని పీపీ కోరారు. ఆయన అభ్యర్థనను న్యాయస్థానం తోసిపుచ్చింది. 15వ తేదీకి వాయిదా వేస్తూ మరోసారి గడువు పొడిగించేది లేదని స్పష్టం చేసింది.
కేసు విచారణకు వచ్చిన ప్రతి సారి సీఐడీ అధికారులు ఏదో ఒక కారణంతో వాయిదాలతో కాలయాపన చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. అన్ని ఆధారాలు సేకరించిన తరువాతనే బాబుని అరెస్టు చేశామంటూ పదేపదే చెబుతున్న అధికారులు ఇలా వాయిదాలతో నెట్టుకురావడం ఆ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది.
ఈ కేసులో నిందితులందరూ ఇప్పటికే రెగ్యులర్ లేదా ముందస్తు బెయిలు పొందగా, ఇదే కేసులో 37వ నిందితుడైన చంద్రబాబుకు మాత్రం బెయిలు దక్కకపోవడంపై న్యాయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాన నిందితులు బెయిలు పొందాక మిగిలిన నిందితులకు బెయిలు దక్కడం సర్వసాధారణమని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు. నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో చంద్రబాబు ఒక్కరికే బెయిలు రావాల్సి ఉంది. ఈ కేసులో ఆయన 52 రోజులు జ్యుడిషియల్ కస్టడీలో గడిపారు. మిగిలిన నిందితులెవరూ లేనంత కాలం చంద్రబాబు జైల్లో ఉన్నారు. ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్‌ఎస్‌డీసీ) మాజీ ఎండీ, మొదటి నిందితుడు గంటా సుబ్బారావుతో పాటు మిగిలిన నిందితులందరూ ఇప్పటికే బెయిలు పొందారు. బెయిలు పొందినవారిలో సీమెన్స్ సంస్థ, డిజైన్‌టెక్‌కు చెందిన ఎండీ, సీఎండీలు ఉన్నారు. సీమెన్స్ సీనియర్ డైరెక్టర్‌గా పనిచేసిన జీవీఎస్ భాస్కర్‌కు సైతం సుప్రీంకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేసింది.
గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిలును తాజాగా పూర్తిస్థాయి బెయిలుగా మార్చింది. ఇదే కేసులో ఐఏఎస్ అధికారిణి, భాస్కర్ భార్య అపర్ణకూ హైకోర్టు ముందస్తు బెయిలు ఇచ్చింది. ప్రధాన నిందితులు ఇప్పటికే బెయిలు పొందారని, అపర్ణకు బెయిలివ్వడం తప్పెలా అవుతుందని ఆ సందర్భంలో హైకోర్టు పేర్కొంది. నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల దుర్వినియోగం ఆరోపణలతో సీఐడీ నమోదు చేసిన కేసులో నిందితులందరికీ దిగువ, హైకోర్టు, సుప్రీంకోర్టు ఉపశమనం కలిగించాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నమోదుచేసిన కేసులో సైతం డిజైన్‌టిక్ సంస్థకు చెందినవారు బెయిలు పొందారు. 37వ నిందితుడిగా ఉన్న చంద్రబాబు సుదీర్ఘ న్యాయపోరాటం చేసిన తరువాతనే ఆరోగ్య కారణాల రీత్యా మధ్యంతర బెయిలు సాధించగలిగారు. రెగ్యులర్ బెయిల్ పై విచారణను సీఐడీ వాయిదాల పేరుతో సాగదీస్తోంది.