- కష్టాల్లో ప్రజల మధ్యనే ఉండే నాయకుడు
- రాష్ట్ర అభివృద్ధి కోసమే మూడు పార్టీల పొత్తు
- ప్రజల్లో చైతన్యం తెచ్చి ఓట్లు వేయించాలి
- ప్రభావవంతులతో ముఖాముఖిలో భువనేశ్వరి
కుప్పం(చైతన్యరథం): చంద్రబాబును తమ నాయకుడిగా గత ఏడు దఫాలుగా గెలిపించి ముందుకు నడుపుతున్న కుప్పం ప్రజలకు నారా భువనేశ్వరి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కుప్పం నియోజకవర్గంలోని ఇన్‌ఫ్లుయెన్సర్లతో (ప్రభావవంతులతో) నారా భువనేశ్వరి శుక్రవారం ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భువనేశ్వరి మాట్లాడుతూ కుప్పం నియోజకవర్గంలో అనేక మంది ప్రభావవంతులు ఉన్నారు…వారి వద్దకు అనేక మంది ప్రజలు ప్రతిరోజు వస్తారు. ఇలాంటి వారికి చంద్రబాబు విజనరీ లక్షణాలను వివరించి టీడీపీ గెలుపునకు కృషి చేయాలని కోరారు.
2010లోనే చంద్రబాబు విజన్ 2020ని ప్రకటిస్తే..చాలా మంది అవహేళన చేశారు. కానీ విజన్ 2020 నుండి ఐటీ పరిశ్రమ, హైటెక్ సిటీ వచ్చాయి…నేడు హైదరాబాద్ లో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు తమ కుటుంబాలను ముందుకు తీసుకెళ్లగలుగుతున్నారు. రాష్ట్ర విభజన అయ్యాక ఏపీ ప్రజలను కట్టు బట్టలతో బయటకు పంపించారు. అలాంటి సమయంలో అమరావతిని రాజధానిగా చంద్రబాబు ప్రకటించి…నిర్మాణ పనులు చేపట్టారు. అమరావతి నిర్మాణానికి అక్కడి రైతులు 33వేల ఎకరాలను చంద్రబాబును నమ్మి అప్పజెప్పారు…చంద్రబాబు నాయకత్వంపై అక్కడి రైతులకు అంత నమ్మకం. రాష్ట్ర భవిష్యత్తు కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతులను వైసీపీ ప్రభుత్వం హింసించని రోజు లేదు..మహిళా రైతులను సైతం వైసీపీ ప్రభుత్వం వేధించింది..అయినప్పటికీ 1,500రోజుల పైబడి పోరాటం కొనసాగిస్తూనే ఉన్నారు.
ఒక్కరాజధాని లేని ఏపీకి 3రాజధానులు అంటూ రాష్ట్రం పరువును వైసీపీ తీస్తోంది. రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని అవమానాలకు వైసీపీ ప్రభుత్వం గురిచేస్తోంది. చంద్రబాబు పాలనలో కియా మోటార్స్, ఐటీ పరిశ్రమలు, వివిధ కంపెనీలు రావడానికి కారణం చంద్రబాబు నాయకత్వంపై ఉన్న నమ్మకమే. రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర ప్రజల భవిష్యత్తుకోసం చంద్రబాబు రాత్రింబవళ్ల్లు కష్టపడ్డారు..ఏపీని దేశంలో నంబర్ వన్ రాష్ట్రంగా నిలబెట్టాలని నిద్రలేని రాత్రులు గడిపారు. పోలవరాన్ని రాష్ట్ర ప్రజలకు వరంగా మార్చాలని చంద్రబాబు సంకల్పించారు…అందులో భాగంగానే 72శాతం పనులను చంద్రబాబు పూర్తిచేశారు. ఈ ప్రాజెక్టును వైసీపీ ప్రభుత్వం నేడు గాలికొదిలేసింది. పోలవరం ప్రాజెక్టును పూర్తిచేసి ఉంటే రైతులు బాగుపడే వారు, వ్యవసాయరంగం సస్యశ్యామలం అయ్యేది…రాయలసీమకు నీరు కూడా వచ్చేదని భువనేశ్వరి అన్నారు.
చంద్రబాబు నిజాయితీకి నిదర్శనం
చంద్రబాబు నాయకత్వం, పనితీరు అంటే ఏంటో ఆయన అక్రమ అరెస్టు సమయంలో తెలిసింది…చంద్రబాబు రూ.3,700కోట్లు అవినీతి చేశారని ఆరోపణలు చేసి, నేడు రూ.27కోట్లు అవినీతి అని ప్రభుత్వం యూటర్న్ తీసుకుంది…ఈ రూ.27కోట్లు కూడా అవినీతి జరిగిందని నేటికీ నిరూపించలేకపోయింది. అదే చంద్రబాబు నిజాయితీకి నిదర్శనం. చంద్రబాబును అరెస్టు చేసిన సమయంలో రాష్ట్రమంతా స్పందించింది…ఏనాడూ రోడ్లపైకి రానటువంటి మహిళలు కూడా రోడ్డు మీదకు చంద్రబాబుకు సంఫీుభావంగా నిలిచారు. వైసీపీ పాలనలో టీడీపీ కార్యకర్తలు, నాయకులను వేధిస్తోంది…హింసిస్తోంది..అభివృద్ధి కార్యక్రమాలను గాలికొదిలేసింది. వైసీపీ పాలనలో రాష్ట్రం గంజాయి, డ్రగ్స్, ఇసుక మాఫియా, భూకబ్జాల్లో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలబడిరది…రాష్ట్రం పరువు పోయింది. కల్తీమద్యాన్ని రాష్ట్ర ప్రజలకు అమ్మి వైసీపీ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారు..ఈ కల్తీ మద్యం తాగిన ప్రజలు అనారోగ్యాలబారిన పడి చనిపోతున్నారు…వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. రాష్ట్ర ప్రజలంతా రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల భవిష్యత్తు గురించి ఆలోచించాలి. నిజం గెలవాలి కార్యక్రమాన్ని చేపట్టక ముందు నాకు ప్రజాక్షేత్రంలోకి వచ్చిన అనుభవం లేదు..కానీ నాకు నా పార్టీ బిడ్డలు, కార్యకర్తలు అండగా నిలిచారు..కార్యక్రమాన్ని విజయవంతంగా చేయడానికి సహకరించారు. నేడు రాజకీయ కార్యక్రమాల్లో కూడా పాల్గొని మాట్లాడగలుగుతున్నానని భువనేశ్వరి అన్నారు.
నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్లాయి
వైసీపీ పాలనలో రాష్ట్రం అంధకారంగా మారింది. చంద్రబాబు రాష్ట్రం గురించి నిత్యం కలలు కంటూనే ఉంటారు…ఆ కలలను నిజం చేయడానికి నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. అందుకే ఏపీలో అనేక ప్రాజెక్టులు చేపట్టారు…గతంలోనూ ఉమ్మడి రాష్ట్రంలో ఐటీ రంగాన్ని నెలకొల్పారు. ప్రపంచం గుర్తించదగిన నాయకుడు అయ్యారు. చంద్రబాబు రాష్ట్రంలో అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి నేను తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోయాను…అన్ని సామాజికవర్గాలకు న్యాయం చేసేలా చంద్రబాబు సంక్షేమ పథకాలను అమలు చేశారు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. కానీ గతంతో పోలిస్తే ఎక్కువ ఖర్చు పెట్టామని వైసీపీ నేతలు చెబుతున్నారు. రద్దు చేసిన పథకాలకు ఖర్చుపెట్టాల్సిన నిధులన్నీ ఎవరి జేబులోకి వెళ్లాయో వైసీపీ నేతలను రాష్ట్ర ప్రజలు ప్రశ్నించాలని భువనేశ్వరి అన్నారు.
ప్రత్యేక గుర్తింపు
కుటుంబానికి తండ్రి ఎంత ముఖ్యమో..రాష్ట్రాన్ని ముందుకు నడపాలంటే మంచి నాయకుడు కావాలి…ఆ నాయకుడికి ఓ మంచి టీమ్ కావాలి. రాష్ట్రమంతా చంద్రబాబుకు చేయూతనిచ్చి ప్రోత్సహించాలి…చంద్రబాబును ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టి రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలి. కుప్పం నియోజకవర్గ ప్రభావవంతులంతా ఒక్కొక్కరు 100 మందితో టీడీపీకి ఓట్లు వేయించాలి. నాయకుడు అంటే ఆఫీసులో కూర్చునేవాడు కాదు…ప్రజల మధ్యన నిలిచేవాడే నిజమైన నాయకుడు. హుద్ హుద్, తిత్లీ తుఫానులు వచ్చిన సమయంలో ప్రజల మధ్యే ఉండి, రాత్రింబవళ్లు కష్టపడి, తుఫాను వచ్చిన ప్రాంతంలోనే బస్సులో ఉంటూ పరిస్థితులను చక్కదిద్ది ప్రజలకు చంద్రబాబు అండగా నిలిచారు. నేడు మనం మన సమయాన్ని త్యాగం చేస్తే…భావితరాల భవిష్యత్తు బాగుంటుందని డాక్టర్ అబ్దుల్ కలాం అన్నారు…ఈ విధంగానే చంద్రబాబు ఆలోచిస్తారు..అందుకే ఆయనకు ప్రత్యేక నాయకుడిగా గుర్తింపు ఉందని భువనేశ్వరి చెప్పారు.
కుప్పం అభివృద్ధికి ప్రణాళిక
చంద్రబాబుపై గత పాలకులు అనేక కేసులు పెట్టారు..కానీ ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం జరగని తప్పును జరిగిందని అపోహలు సృష్టించి, చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి, జైలులో పెట్టి, నేడు సాక్ష్యాలు దొరక్క ప్రభుత్వం సృష్టించిన ఫేక్ సాక్ష్యాధారాల పేపర్లను తగులబెట్టిన పరిస్థితులు మనం చూశాం. చంద్రబాబు ప్రతి జిల్లాను హబ్ గా చేసుకుని ఆ జిల్లాలోని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని చూశారు. కుప్పంలో పాడిపరిశ్రమ, ప్రజలకు ఇళ్లు, డ్రిప్ ఇరిగేషన్, కార్గో ఎయిర్ పోర్టు, యువతకు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు, పంచాయతీ, మున్సిపాలిటీలకు ప్రత్యేక నిధులు, పట్టు పరిశ్రమలకు ప్రోత్సాహకాలు, కోల్డ్ స్టోరేజీలు ఏర్పాటు, హంద్రీనీవా ద్వారా కుప్పం ప్రజలకు నీళ్లు తీసుకురావడం, రాతిపని వారికి క్లస్టర్ ఏర్పాటు, సామాజిక భవనాలు, కుప్పం ప్రజలకు 200పడకల ఆసుపత్రి ఏర్పాటు, పేదల ఆదాయం రెట్టింపు, ద్రావిడ యూనివర్శిటీ అభివృద్ధి, ఆలయాలు, పర్యాటక ప్రాంతాల అభివృద్ధి, మైనారిటీల అభివృద్ధి ఇలా అనేక అంశాలతో చంద్రబాబు ప్రత్యేక మ్యానిఫెస్టో పెట్టారు..దీన్ని అమలు చేసి కుప్పం అభివృద్ధికి సిద్ధంగా ఉన్నారని భువనేశ్వరి చెప్పారు.
ధైర్యంగా ఓట్లు వేయించాలి
వైసీపీ పాలనలో ప్రతిపక్ష నేతలను హింసించడం, వేధించడం, అక్రమంగా అరెస్టు చేయడం, దుర్మార్గంగా చంపడం తప్ప రాష్ట్రానికి ఏమీ చేయలేదు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ప్రభావవంతులంతా చేయి చేయి కలిపి టీడీపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేయాలి. రాష్ట్రంలోని వివిధ వర్గాల వారికి ఏమేమి చేయాలో నేను చంద్రబాబుకు ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు…ఆయనకు అన్ని వర్గాలకు ఏమేమి చేయాలా అని ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నారు. రానున్న ఎన్నికల కురుక్షేత్రంలో ఓటర్లను జాగ్రత్తగా ఓటు కేంద్రానికి తీసుకొచ్చి ధైర్యంగా ఓట్లు వేయించాలి. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి రాష్ట్ర అభివృద్ధి కోసమే తప్ప…మరొక ఉద్దేశం లేదు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రభావవంతులంతా ఏకం కావాలని భువనేశ్వరి పిలుపు ఇచ్చారు.