తెలుగుదేశం పార్టీకి ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా ప్రజాక్షేత్రంలో చెదరని బలం వుంది. అందుకు చంద్రబాబు మహోన్నత ఆదర్శం, వ్యక్తిత్వం ప్రధాన కారణం. నాలుగు దశాబ్దాలుగా టిడిపి తోనే మమేకమై పయనం సాగిస్తున్న నాయకులు ఒక్క టిడిపికే సొంతం. టిడిపి అనేది కేవలం అధికారం కోసం అర్రులు చాచే ఒక రాజకీయ పార్టీ కాదు. సమాజం పట్ల బాధ్యత కలిగిన ఒక ప్రజాస్వామిక శక్తి. తన విజన్ తో ప్రపంచాన్ని ఒక ‘ గ్లోబల్ విలేజ్ ‘ గా రూపొందించిన చంద్రబాబు, పార్టీ పట్ల సైతం అదే దార్శనికత ప్రదర్శించి టిడిపి అంతా ఒకే కుటుంబం అనే రీతిలో తీర్చిదిద్దారు. కుటుంబ పెద్దగా చంద్రబాబు పార్టీ శ్రేణులపై వాత్సల్యం కనబరుస్తారు. మమకారం చూపిస్తారు. తప్పుదోవ పట్టకుండా మందలిస్తారు. ఎవరికైనా ఏదైనా కష్టం వస్తే తాను విలవిల లాడిపోతారు.
గత ఏడాది మాచర్ల లో చంద్రయ్య అనే బిసి నాయకుడు హత్యకు గురయినప్పుడు తల్లడిల్లి పోయారు. అంత్యక్రియలకు స్వయంగా హాజరై ఆయన భౌతిక కాయాన్ని భుజాలపైకెత్తుకుని మోశారు. తాజాగా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు మరణానికి చంద్రబాబు శోకసంద్రంలో మునిగిపోయారు. ముందుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలన్నీ రద్దుచేసుకొని అంత్యక్రియలలో స్వయంగా పాల్గొన్నారు. ఇన్ని రోజులు పార్టీని మోసిన అర్జునుడు పార్థివ దేహాన్ని చంద్రబాబు తన భుజాలపై మోసుకుంటూ తీసుకెళ్లారు. అంతేగాక బచ్చుల అర్జునుడు అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో చంద్రబాబు ప్రతిరోజూ ఆయన ఆరోగ్యం గురించి వాకబు చేసేవారు. ఆసుపత్రికి వెళ్లి పరామర్శించి వైద్యులతో నూ మాట్లాడారు.
ఒక కుటుంబం విషయం లో పెద్ద గా వున్న వ్యక్తి ఏ విధంగా వ్యవహరిస్తారు, అదే తరహాలో, కొన్ని సందర్భాలలో అంతకు మించి చంద్రబాబు బాధ్యతలు నిర్వర్తించారు. ఏడాది క్రితం పార్టీ కార్యాలయంలో పనిచేసే కుమారస్వామి అనే ఉద్యోగి గుండెపోటు తో మరణించినప్పుడూ చంద్రబాబు ఇదే బాధ్యత చేపట్టారు. కొంతమంది నాయకులు, కార్యకర్తలు పై పోలీసు కేసులు నమోదు కావటం, అరెస్ట్ అయి చిత్రహింసలకు గురికావటం వంటి సందర్భాలలో చంద్రబాబు స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి, నేనున్నాను అనే భరోసా కల్పించారు. కొమ్మారెడ్డి పట్టాభిరామ్, దొంతు చిన్నా, దారపునేని నరేంద్ర తదితరులు పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించి, అక్రమ కేసులు బనాయించినప్పుడు చంద్రబాబు ఇదే తరహా ధోరణి కనబర్చారు. కుప్పం, పుంగనూరు, పీలేరు నియోజకవర్గంలో బిసి, మైనారిటీ వర్గాలకు చెందిన కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్ చేసినప్పుడు, ఆయా ప్రాంతాలలో జైళ్లకు వెళ్లి స్వయంగా వారిని పరామర్శించి, వారి కుటుంబ సభ్యుల్లో మనోస్థైర్యం నింపారు.
వీల్లేవరూ చంద్రబాబు కు బంధువులు కారు. స్నేహితులు కారు. అంతకు మించి అనుబంధం వున్న పార్టీ కుటుంబ సభ్యులు. ఒక తండ్రి కుటుంబ సభ్యులు అందరినీ సమదృష్టితో చూస్తాడు. చంద్రబాబూ అంతే. కుటుంబ సభ్యుల స్థాయి, సామాజిక వర్గం తో నిమిత్తం లేదు. చిరుద్యోగి అయినా, రాష్ట్ర స్థాయి నాయకుడైనా ఓకే విధమైన ప్రేమ, ఆప్యాయత కనబరుస్తారు. చంద్రబాబు ఎప్పుడూ సామాజిక న్యాయం కోసమే పోరాడుతారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా పేద, బడుగు, బలహీన వర్గాలకు అత్యుత్తమ విద్య నందించటం, విపత్తుల సమయంలో అవసరార్ధులకు ఆపన్నహస్తం అందించటం చంద్రబాబు నిర్వర్తిస్తున్న కుటుంబ బాధ్యతలలో మరో కోణం. దేశంలోని మరే ఇతర రాజకీయ పార్టీ లలోనూ ఈ తరహా కుటుంబ వాతావరణం కానరాదు. ఒక వైపు తన విజన్ తో రాష్ట్ర భవిష్యత్ కు ప్రణాళికలు వేయటం, మరోవైపు కుటుంబ పెద్దగా పార్టీ శ్రేణులను కాపాడుకోవటం, భావితరాల బంగరుభవిత కోసం అనుక్షణం తపిస్తుండటం వంటి లక్షణాలు ఒక్క చంద్రబాబు లోనే కనిపిస్తాయి. అందుకే వర్తమాన రాజకీయ యవనికపై చంద్రబాబు ఎవర్ గ్రీన్ హీరోగా వెలుగొందుతున్నారు.