ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నేటి నుంచి మూడురోజుల పాటు ఉమ్మడి కృష్ణా జిల్లాలో పర్యటన జరుపనున్నారు. ఇప్పటి వరకు ఉత్తరాంధ్ర, గోదావరి, ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అద్భుత స్పందన లభించింది. ఉమ్మడి కృష్ణా పరిధిలోని మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు నియోజకవర్గాలలో చంద్రబాబు పాల్గొననున్న ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమాన్ని భారీస్థాయిలో విజయవంతం చేసేందుకు టిడిపి శ్రేణులు సమిష్టిగా కృషిచేస్తున్నాయి.
ప్రధానంగా గుడివాడ నియోజకవర్గం లో జరుగనున్న కార్యక్రమంపై అందరి దృష్టి వుంది. టిడిపి పై చౌకబారు విమర్శలు చేస్తూ పదేపదే నోరు పారేసుకునే మాజీమంత్రి కొడాలి నానికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు టిడిపి శ్రేణులు కృతనిశ్చయంతో వున్నాయి. అందుకోసం ఆ నియోజకవర్గంలో హేమాహేమీలు గా పేరొందిన నాయకులందరూ ఓకే వేదికపైకి వచ్చి సమిష్టిగా కృషి చేస్తుండటం శుభపరిణామం గా భావిస్తున్నారు. గతంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి కార్యక్రమం జరిగిన నియోజకవర్గాలలో చంద్రబాబు పర్యటనలకు జనం పోటెత్తటంతో అక్కడి అధికారపార్టీ నాయకులకు ఇబ్బందికర పరిణామాలు తలెత్తాయి.
అధికారపార్టీ అధినేత ఆయా నియోజకవర్గాలలో నాయకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా చంద్రబాబు పర్యటన జరుగనున్న మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు నియోజకవర్గాలలో అధికారపార్టీ నాయకులు అప్రమత్తం అయ్యారు. అదే సమయంలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేసేందుకు టిడిపి నాయకులు సమిష్టిగా, పట్టుదలతో కృషి చేస్తున్నారు. అందుకనుగుణంగా క్షేత్రస్థాయిలో సన్నాహాలు మొదలుపెట్టారు.
చంద్రబాబు తాజాగా తలపెట్టిన పర్యటనకు మరో ప్రాముఖ్యత వుంది. వచ్చే నెలలో జరుగనున్న ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను సన్నాహక కార్యక్రమాన్ని నిమ్మకూరు లో చంద్రబాబు 13వ తేదీన లాంఛనంగా ప్రారంభిస్తారు. అప్పటి నుంచి మే 28 వ తేదీ లోగా ప్రపంచవ్యాప్తంగా వంద కార్యక్రమాలు నిర్వహించాలి అనేది టిడిపి కార్యాచరణ గా వున్నది. ఇప్పటికే టిడిపి శ్రేణుల్లో ఎన్టీఆర్ శతజయంతి వుత్సవాల జోష్ వెల్లివిరుస్తోంది. మునుపెన్నడూ లేనంత పట్టుదల పార్టీ శ్రేణుల్లో కానవస్తున్నది. నాయకులు సైతం సమిష్టిగా పనిచేస్తూ పార్టీ శ్రేణులకు మంచి సందేశాన్ని ఇస్తున్నారు. రానున్న ఎన్నికల వరకు ఈ జోష్ ను ఇలాగే కొనసాగించేందుకు చంద్రబాబు నిర్విరామ కార్యక్రమాలతో ప్రణాళిక సిద్ధం చేశారు.