6 పధకాలతో టిడిపి మినీ మ్యానిఫెస్టో ప్రకటించిన చంద్రబాబు
మహాశక్తి పధకం ద్వారా 18 నుంచి 59 సంవత్సరాల మధ్య మహిళలకు నెలకు రూ.1,500 లు
తల్లి వందనం పధకం ద్వారా ప్రతి బిడ్డకు ఏడాదికి రూ. 15 వేలు.
బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం
యువగళం ద్వారా 5 ఏళ్లలో 20లక్షల ఉద్యోగాలు
నెలకు రూ. 3 వేల నిరుద్యోగభృతి
అన్నదాత పధకం క్రింద ఒక్కో రైతుకు ఏడాదికి రూ. 20వేలు
ఇంటింటికి మంచినీరు
బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం
పేదల్ని ధనికులు చేసేందుకు రిచ్ టు పూర్
……
రాజమహేంద్రవరం మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల శంఖారావం పూరించారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలతో పాటు ఆదివారం జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడులో లక్షలాదిమంది ప్రజానీకాన్ని ఉద్దేశించి చంద్రబాబు ఉద్వేగభరిత ప్రసంగం చేశారు. మహానాడు వేదికగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే చేపట్టనున్న ఆరు పధకాలపై సంచలన ప్రకటన చేశారు. సామాన్య, పేద, మద్యతరగతి ప్రజల జీవనగమనంలో పెనుమార్పులకు నాంది పలికే విధంగా చంద్రబాబు తొలి దశలో ఆరు పధకాలను ప్రకటించారు.
మహానాడు వేదికగా చంద్రబాబు సంధించిన ‘ సంక్షేమాస్త్రం ‘ అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. భవిష్యత్ కు భరోసా పేరుతో చంద్రబాబు ఆరు పధకాలను వెల్లడించారు. ఈ పథకాల ప్రకటన చేయడం కోసమే నేను మీ ముందుకు వచ్చాను. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగు దేశం పార్టీ. దాన్ని పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు చెప్పారు. నా ఆడబిడ్డల కోసం మహా శక్తి అనే కార్యక్రమాన్ని చేపడతాం. ప్రతి మహిళను మహా శక్తిగా తయారు చేస్తాం అని వెల్లడించారు. మహాశక్తి పథకం కింద, ఆడబిడ్డ నిధి కింద నెలకు మహిళలకు నెలకు రూ.1500 మీ అకౌంట్ లో వేస్తాం. ఇంట్లో ఇద్దరు మహిళలు ఉంటే ఇద్దరికీ ఇస్తాం. 18 నుంచి 59 వయసు ఉండే ఆడబిడ్డలకు ఆడబిడ్డల నిధి కింద రూ.1500 ఇస్తాను. మీ అన్నగా నేను ఈ సాయం చేస్తాను. నెలకు రూ.1500, ఏడాదికి రూ. 18 వేలు, 5 ఏళ్లలో రూ. 90 వేలు మా ఆడబిడ్డ అకౌంట్ కు పంపిస్తా అని చంద్రబాబు హామీ ఇచ్చారు.
మహిళలకు అండగా ఉండే పార్టీ తెలుగు దేశం పార్టీ. డ్వాక్రా సంఘాలు పెట్టిన పార్టీ, మహిళలకు రిజర్వుషన్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పారు. అలాగే జగన్ అమ్మఒడి ఒకబూటకంగా మార్చాడు. అందరి బిడ్డలకు అని మోసం చేశాడు. అందుకే తల్లులకోసం తల్లికి వందనం అనే కార్యక్రమంపెడుతున్నాం అని చెప్పారు. తల్లికి వందనం కింద ఏడాది ప్రతి బిడ్డకు రూ. 15000 ఇస్తాం. ఎంత మంది బిడ్డలు ఉంటే అంత మందికి ఏడాదికి రూ. 15000 ఇస్తా. ఎంత మంది పిల్లలు ఉన్నా, వారిని చదివించేందుకు రూ. 15 వేలు ఇస్తాం అని చంద్రబాబు వివరించారు. స్థానిక సంస్థల్లో ఎంత మంది పిల్లలు ఉన్నా పోటీ చేసే విధంగా చట్టంలో మార్పు చేస్తాం అని చెప్పారు. నాడు దీపం పథకం ఇచ్చాను. సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్ లో నా తల్లి కష్టం చూసి నాడు దీపం పథకం ఇచ్చాను. ఇప్పుడు వంట సిలిండర్ భారంగామారింది. సిలిండర్ రూ. 1200 అయ్యింది. దీంతో మళ్లీ కట్టెల పొయ్యికి వెళ్లే పరిస్థితి వచ్చింది. అందుకే ఏడాదికి ఇంటికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తాం. మూడు సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇచ్చిదీపం వెలిగిస్తా అని చంద్రబాబు వెల్లడించారు. మహిళలు ఎక్కడికి ప్రయాణం చేయాలి అన్నా,వారికి జిల్లా పరిధిలో ఉచిత ప్రయాణం ఏర్పాటు చేస్తాం అని చెప్పారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆడబిడ్డలకు ఇచ్చే కానుక ఇది. మహా శక్తి కింద ఈ నాలుగు కార్యక్రమాలు చేపట్టనున్నట్టు వివరించారు.
ఇక రెండోది యువగళం. ఈ పథకం కింద ఎపిలో 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం అని చంద్రబాబు ప్రకటించారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చేబాధ్యత టీడీపీ తీసుకుంటుందన్నారు. యువతకు ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ. 3 వేలు నిరుద్యోగ బృతి ఇస్తాం అని చంద్రబాబు హామీ ఇచ్చారు. యువతను వైసీపీ నిర్వీర్యం చేసింది. ఆదుకునే పార్టీ తెలుగు దేశం అని చెప్పారు. మీకు కులాలు కావాలా? మీ భవిష్యత్ కావాలా? యువత ఆలోచించుకోవాలి. ఎవరైనా కులం, మతం పేరు చెపితే యువత చెప్పుతీసుకుని కొట్టండి అని పిలుపునిచ్చారు.న దేశానికి తిండి పెట్టిన వారు అన్నదాత. కరోనా సమయంలో కూడా పని చేసిన ఏకైక వ్యక్తి అన్నదాత. ఈ రోజు ఆ అన్నదాత కష్టాల్లో ఉన్నాడు అని చెప్పారు. అలాంటి అన్నదాతను ఆదుకోవడానికి అన్నదాత పేరుతో పథకం.ఏడాదికి అన్నదాత పథకం కింద ఒక్కో రైతుకు రూ.20000 ఇస్తామని ప్రకటించారు. వ్యవసాయం లాభసాటిగా చేసేందుకు అవసరం అయిన అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. ఇంటింటికి మంచినీరు, బీసీల రక్షణకు ప్రత్యేక చట్టం, పేదలను ధనికుల్ని చేయటం కోసం పూర్ టూ రిచ్ అనే కార్యక్రమం చేపట్టనున్నట్టు చంద్రబాబు వివరించారు.
ఎన్టీఆర్ ముందు .. ఎన్టీఆర్ తర్వాత
మహానాడుకు భారీగా తరలి వచ్చారు. ఎవరైనా అడ్డువస్తే తొక్కుకుంటూ వచ్చారు.క్రీస్తుపూర్వం క్రీస్తు శకం అని ఎలా అంటున్నామో, తెలుగు వారికి ఎన్టీఆర్ శకం ఉంది.ఎన్టీఆర్ ముందు, ఎన్టీఆర్ తరువాత తెలుగు జాతిని చూడాల్సి ఉంది అని చంద్రబాబు పేర్కొన్నారు. కఠోర శ్రమతో, దీక్షతో ఎన్టీఆర్ జీవితంలో ఎదిగారు.తనకు 60 ఏళ్లు వచ్చిన తరువాత ప్రజలకు సేవ చేయడానికి ఎన్టీఆర్ రాజకీయాల్లో వచ్చారు. ప్రజలకు సేవ చేయడం కోసం ఆ వయసులో ఆయన రాజకీయ పార్టీ పెట్టారునేడు గల్లీ నుంచి న్యూయార్క్ టైమ్స్ స్క్యేర్ లో కూడా ఎన్టీఆర్ చిత్రం ప్రదర్శించారు.తెలుగు జాతి ఉన్నంత వరకు తెలుగు వారి గుండెల్లో ఉండే వ్యక్తి ఎన్టీఆర్ అని చంద్రబాబు ప్రశంసించారు. ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా శతకోటి నివాళులుఎన్టీఆర్ పేరు చెపితే సంక్షేమం గుర్తువస్తుంది. పేదల కోసం పార్టీ పెట్టి పాలన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావుఎన్టీఆర్ పెట్టిన రూ.2 కిలో బియ్యం తరువాత కాలంలో ఆహార భద్రత అయ్యింది.
వెనుకబడిన వర్గాల కోసం స్థానిక సంస్ధల్లో రిజర్వేషన్లు ఇచ్చారు. పక్కా ఇళ్లు నిర్మించారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు అని వివరించారు. ఏడాది కాలంలో కొందరు కార్యకర్తలు, నేతలు మనకు దూరం అయ్యారు. నందమూరి తారకరత్న, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పుష్పరాజ్ వంటి నాయకులు దూరం అయ్యారు అని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని రాజకీయ రౌడీలకు హెచ్చరిస్తున్నా, తెలుగు దేశం కార్యకర్తలను వేధించిన వారిని వదిలేది లేదు. అయినా కార్యకర్తలు పార్టీ జెండా వదల లేదు అని అభినందించారు. మాచర్లలో చంద్రయ్యను చంపేశారు. జై జగన్ అంటే వదిలేస్తాను అని చెప్పినా…జై తెలుగు దేశం అని ప్రాణాలు అర్పించిన కార్యకర్త చంద్రయ్య. ఇలాంటి కార్యకర్తలే తెలుగు దేశం బలం అన్నారు. ఎంతో మంది తెలుగుదేశం పార్టీని దెబ్బతీద్దాం అని ప్రయత్నం చేశారు. కానీ వారంతా కాలగర్భంలో కలిసిపోయారు అని చెప్పారు. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగు దేశం పార్టీ. ఆర్థిక సంస్కరణలు అమలు చేసిన పార్టీ తెలుగు దేశం పార్టీ నాడు 16 వేల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ అయినా పథకాలు అమలు చేశాం.2014లో రూ.200 ఉన్న పెన్షన్ ను రూ.2000 చేశాం. పెన్షన్ 10 రెట్లు పెంచాం
ఒకే సారి రూ.50 వేలు రుణమాఫీ చేసిన పార్టీ తెలుగుదేశం, అని చంద్రబాబు వివరించారు. ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ ఇచ్చాం. ఇప్పుడు ఈ ప్రభుత్వం పిఆర్సి కాదు కదా, కనీసం జీతాలు కూడా ఇవ్వడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రన్నబీమా అమలు చేశాం. చనిపోతే రూ. 5 లక్షలు ఇంటికి పంపాం. అన్న క్యాంటీన్, విదేశీ విద్య వంటి పథకాలు పెట్టింది తెలుగు దేశం పార్టీ అని తెలిపారు. తెలుగు వారికి ఒక మంచి రాజధాని ఉండాలి అని అమరావతి సంకల్పించాను. పోలవరం ద్వారా నదుల అనుసంధానం జరిగితే ఎలాంటి ఇబ్బందులులేకుండా ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వొచ్చు. పోలవరం లో 72 శాతం పనులు పూర్తి చేశాం అని చెప్పారు. యువతకు ఉద్యోగాల కోసం రూ.16 లక్షల కోట్ల ఒప్పందాలు చేసుకున్నాం. 5.50 లక్షల ఉద్యోగాలు కల్పించాం.
ఇప్పుడు జాబు రావాలి అంటే బాబు రావాలి అని యువత అంటున్నారన్నారు. సైకో పాలన, అసమర్థ పాలన, రివర్స్ పాలన లో రాష్ట్రం వెనక్కిపోతుంది. బిసి నాయకత్వంపై పెద్ద ఎత్తున దాడులు చేశారు. హింసా రాజకీయాలు చేశారు.ఇదే ప్రాంతంలో ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ ను చంపి డెడ్ బాడీనిడోర్ డెలివరీ చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న మొన్న సిఎం మాట్లాడుతున్నాడు. పేదలకు పెత్తం దారులకు పోరాటం అంటున్నాడు అని విమర్శించారు. మనం మహానాడు పెట్టుకుంటే సిగ్గులేని పేటిఎం బ్యాచ్ అడ్డుగా జెండాలు కట్టారు. ఫ్లెక్సీలు వేశారు.
మన కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేయాలి అని చూశారు. మర్యాదగా ఉండే మంచిగా రాజకీయం చేస్తాం. అడ్డు వస్తే తొక్కుకుంటూ పోతాం అని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ నేతలు చిల్లర, చెత్త, పనికిమాలిన రాజకీయాలు చేస్తున్నారు. వైసీపీ పాలన వల్ల రాష్ట్రం మొత్తం నష్టపోయింది. బాదుడే బాదుడుకు అన్ని ధరలు పెరిగాయి. గ్యాస్ ధర, చెత్త పన్నులు వేశారు.మద్యం తాగేవారిని కూడా బాదేస్తున్నారు. మద్యం ధరలు రెండు మూడు రెట్లు పెంచారు. నాసిరకం బ్రాండ్లు తెచ్చారు. మీ జీవితంతో, ఆరోగ్యంతో ఆడుకునే పరిస్థితికి వచ్చాడు అని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ 4 ఏళ్లలో రూ. 5లక్షల కోట్లు పన్నుల భారం మోపాడు. రూ.10 లక్షల కోట్లు అప్పులు చేశారు.నాడు ఉచితంగా దొరికిన ఇసుక ఇప్పుడు ఎందుకు దొరకడం లేదు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఇసుక ద్వార నెలకు 20 కోట్లు కట్టించుకున్నారు. ఒక నెల ఆ వ్యాపారి కట్టలేకపోతే ఆయనపై ఒత్తిడి తెచ్చారు. దీంతో ఆయన ఆత్మహత్య చేసుకున్నాడన్నారు.
క్యాస్ట్ వార్ కాదు .. క్యాష్ వార్
ఈ రోజు రాష్ట్రంలో పేదలకు పెత్తందారులకు యుద్దం కాదు. జరిగేది క్యాస్ట్ వార్ కాదు. జరిగేది క్యాష్ వార్ అని చంద్రబాబు వెల్లడించారు.పేదల డబ్బులు దోచే వారితో యుద్దం. పేదల సొమ్ము దోచిన వారిని ఆ డబ్బు తిరిగి పేదలకు దక్కేలా చేస్తాం అని హామీ ఇచ్చారు. జగన్ ఆస్తి రూ. 510 కోట్లు. కానీ అందరి సిఎంల ఆదాయం రూ.508 కోట్లు.
జగన్ వ్యవసాయం చేసి సంపాదించాడా? వ్యాపారం చేశాడా?
రాజకీయ అవినీతి కాదా? ఆ డబ్బు అంతా ప్రజలదే అని చంద్రబాబు చెప్పారు.ఇసుక దొంగలు, మద్యం దొంగలు, మట్టి దొంగలు, సెటిల్మెంట్లు చేసిన దొంగల నుంచి వాళ్లు మింగింది కక్కించి ప్రజలకు పంచుతా అని హామీ ఇచ్చారు. విధ్వంస పాలన వల్ల రాష్ట్రంలో ఆదాయం మొత్తం పడిపోయింది. 2019లో ఎపి ఆదాయం రూ.66876, తెలంగాణ రూ.69620 కోట్లు అని వివరించారు. రాష్ట్రంలో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంజాయిపెరిగింది. దాడులు పెరిగాయి. భద్రత లేకుండా పోయింది.జగన్ ఆదాయం పెరిగింది. కానీ ప్రజల ఆదాయం పెరగలేదని చెప్పారు. జగన్ పాలనలో యువత భవిష్యత్ దెబ్బతింది. వారికి దారి చూపే బాధ్యత టీడీపీ తీసుకోవాల్సి ఉందన్నారు. మరోవైపు రాష్ట్రంలో రైతుల పూర్తిగా దగా అయ్యారు. అకాల వర్షాలు వస్తే కనీసం సిఎం పలకరించలేదని చెప్పారు.
జగన్ పని అయిపోయింది
ఈ మహానాడు ద్వారా చెపుతున్నా. జగన్ పని అయిపోయింది. మళ్లీ జీవితంలో అతను రాలేడు అని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రానికి తెలుగు దేశం పార్టీ అవసరం ఉంది. ఎన్టీఆర్ పెట్టిన తెలుగు దేశం పార్టీనే మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుతుంది. బాలకృష్ణ డైలాగ్ ఉంది. సమయం లేదు మిత్రమా, మనం కూడా ఎన్నికలు సిద్దం కావాలి అని పిలుపునిచ్చారు. జగన్ ఆలోచన అధికారం గురించి. మన ఆలోచన పేదల జీవితాల గురించి.జగన్ ఆలోచన హత్యలు చేయడం గురించి. హత్యలు చేసినవారిని కాపాడడం గురించి.వివేకా హత్య కు జగన్ సమాధానం చెప్పాలి. హత్యలు చేసే సిఎం రాష్ట్రానికి అవసరమా అని చంద్రబాబు ప్రశ్నించారు. వీళ్ల ఆలోచనలు గంజాయి, ఇసుక దోపిడీ, సహజ వనరుల దోపిడీ. మన ఆలోచన ఉద్యోగాలు, పెట్టుబడులు .
వాళ్లు రోజుకు ఎంత దోచుకోవాలి అని ఆలోచిస్తారు. మనం పేదల జీవితాల్లో మార్పు ఎలా తేవాలి రోజూ ఆలోచిస్తాం అని చెప్పారు. వాళ్లకు రోజూ రాజకీయమే. మనకు రోజూ ప్రజల జీవితాల గురించే. నాడు నేను కొంత సమయం రాజకీయాల పై పెట్టి ఉంటే, జగన్ వచ్చేవాడు కాదన్నారు. జగన్ రౌడీలను సభలకు పంపుతాడు. మనం మంచి వారిని, విద్యావంతులను పంపుతాం అని వెల్లడించారు. జగన్ ది ధనబలం. మనది జన బలం. మనది విజన్ పాలిటిక్స్ వారిది, ప్రిజన్ పాలిటిక్స్ అని విమర్శించారు. రేపు జరిగేది కురుక్షేత్ర యుద్దం. పోరాటానికి మీరు సిద్దమా అడుగుతున్నా. ఎన్నికల యుద్దానికి వెళ్లే టప్పుడు మీకు ఆయుధాలు ఇవ్వాలి. అదే భవిష్యత్ కు గ్యారెంటీ అని చంద్రబాబు వెల్లడించారు.