రేపు ఇరగవరంలో ప్రారంభం
రైతులతో కలసి చంద్రబాబు పాదయాత్ర
తణుకులో భారీ బహిరంగ సభ
ప్రభుత్వ నిర్లక్ష్యం పట్ల అన్నదాతల ఆగ్రహం
చంద్రబాబు పర్యటనతో చైతన్యవంతులైన రైతన్నలు
…….
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చందబాబు నాయుడు 12వ తేదీన రైతుపోరుబాటకు శ్రీకారం చుట్టారు. అకాలవర్షాల కారణంగా సర్వం కోల్పోయిన అన్నదాతలకు అండగా నిలబడి ప్రభుత్వంపై పోరాటానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. ఈనెల 12వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో చంద్రబాబు నిర్వహించనున్న పాదయాత్రకు పెద్ద ఎత్తున తరలివెళ్ళేందుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. రైతులకు సంఘీభావంగా ఈ పాదయాత్రలో పాల్గొనేందుకు అన్నివర్గాల ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు.
మండువేసవిలో నిప్పులకొలిమిని తలపించే ఎండ వేడిమిలో చంద్రబాబు పాదయాత్ర తలపెట్టడం ఒకవిధంగా సాహసమే. దేశానికి పట్టెడన్నం పెట్టే రైతన్నలకు న్యాయం జరగాలనే సంకల్పంతో చంద్రబాబు ఈ విధమైన సాహసానికి పూనుకున్నారు. ఆరుగాలం శ్రమించి రక్తాన్ని స్వేదంగా మార్చి కండల్ని కరిగించి పండించిన పంట ప్రకృతి ఆగ్రహానికి గురయింది. మిగిలిన కొద్దిపాటి పంట అయినా దక్కించుకుందామన్న రైతన్నలకు నిరాశే ఎదురయింది. రాబందుల్లా కాచుక్కూర్చున్న దళారులు వారిని దోచుకుతింటున్నారు. దీనిని నియంత్రించాల్సిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం చేతులెత్తేసింది.
ఈ స్థితిలో విపక్షంలో వున్నప్పటికి ఒక ప్రజా నాయకునిగా చంద్రబాబు నిర్వహించిన గురుతరబాధ్యత అన్నదాతలకు కాసింత సాంత్వన చేకూర్చింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులను స్వయంగా పరిశీలించి, రైతుల కష్టాల్లు కళ్ళారా చూసిన చంద్రబాబు ప్రభుత్వంపై పోరుబాట పట్టారు. రైతు గొంతుకగా మారి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రైతులతో కలసి స్వయంగా ఆందోళనకు పూనుకున్నారు. ఈ నేపధ్యంలోనే ప్రభుత్వ యంత్రాంగం కళ్ళు తెరచి ఆఘమేఘాలమీద దిద్దుబాటు చర్యలు ప్రారంభించింది. అయితే అవి కూడా కేవలం కంటితుడుపు గానే వున్నాయని రైతాంగం విమర్శిస్తోంది. ప్రభుత్వం చేపట్టిన అరకొర సహాయక చర్యలు అన్నదాతలను కష్టాల కడలినుంచి గట్టెంక్కించ లేకపోయాయి.
ఒక ప్రభుత్వ నిరాదరణ, మరోవైపు దళారుల దగాకోరు విధానాలతో విసుగెత్తిన అన్నదాతలకు పోరాటమే శరణ్యమయింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటన జరిపి రైతాంగాన్ని ఆ దిశగా సమాయత్త పరిచారు. చంద్రబాబు పోరాట కార్యాచరణ ప్రకటించని పక్షంలో అన్నదాతల పరిస్తితి ఎక్కడవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా వుండేది అనటంలో సందేహం లేదు. వర్షాలకు తడిసిన ధాన్యం కొనుగోలు చేసేందుకు 72 గంటల గడువిస్తూ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. గడువు తీరినప్పటికి వారి కష్టాలు తీరకపోవటంతో చంద్రబాబు స్వయంగా రైతులతో కలసి పాదయాత్ర తలపెట్టారు.
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఇరగవరం వద్ద 12వ తేదీ ఉదయం ‘చంద్రన్న రైతు పోరుబాట’ పేరుతో పాదయాత్ర ప్రారంభం కానున్నది. ఈ పాదయాత్ర ఇరగవరం నుంచి గోటేరు సెంటరు, గోపాలపురం, కొమరవరం బుపయ్య కాలువ, మీనాక్షీ పెట్రోల్ బంక్ ల మీదుగా తణుకు పట్టణం 12 వ వార్డులో ప్రవేశిస్తుంది. అక్కడ నుంచి మునిసిపల్ ఆఫీసు రోడ్డు, కేశవస్వామి గుడి సెంటర్, పెద్ద వంతెన, నరేంద్ర సెంటర్, వేంకటేశ్వర ధియేటర్ సెంటర్, పాలిటెక్నిక్ కళాశాల, ఫ్లై ఓవర్, పైడిపర్రు సెంటర్ ల మీదుగా తేతలి వైజంక్షన్ వద్ద ముగుస్తుంది. అనంతరం సాయంత్రం 5గంటలకు రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు ఉభయ గోదావరి జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో రైతులు హాజరు కానున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు టిడిపి శ్రేణులు శ్రమిస్తున్నాయి.