మంగళగిరి: రుషికొండ లీలలు చాలానే ఉన్నాయని రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. రుషికొండ మహల్‌కు సంబంధించి ఇంకా అనేక ఫొటోలు రావాల్సి ఉందని చెప్పారు. త్వరలోనే వాటిని కూడా బయట పెడతామని తెలిపారు. మంగళగిరిలో సోమవారం లోకేష్ మాట్లాడుతూ కృష్ణా నది పక్కన కట్టిన ప్రజావేదికను నిబంధనలు పాటించలేదని చెబుతూ కూల్చివేశారని.. మరి విశాఖలో సాగర తీరంలో కొండ మొత్తాన్నీ తొలిచేసి ప్యాలెస్ ఎలా కట్టారని.. దీనిని ఏ నిబంధనలు పాటించారని లోకేష్ ప్రశ్నించారు. అన్నింటినీ చంద్రబాబు వెలికి తీస్తారని చెప్పారు. ఇక, టీడీపీ నేతలపైనే వైసీపీ నాయకులు దాడులు చేసి హత్యలు చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత.. తమ పార్టీ నాయకులు ముగ్గురు హత్యకు గురయ్యారన్నారు. తాము తలుచుకుంటే వైసీపీ నాయకులకు ఇబ్బందులు తప్పవని, కానీ, చంద్రబాబు దూరదృష్టితో తమను కట్టడి చేస్తున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు పెద్ద పీట వేయాలన్న ఉద్దేశంతో చంద్రబాబు వ్యవహరిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో గంజాయి బ్యాచ్‌ను ఉక్కుపాదంతో అణిచేస్తామన్నారు. త్వరలోనే దీనిపై ఒక ప్రకటన చేస్తామని లోకేష్ తెలిపారు.