తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి సమీపంలోని వేమగిరిలో ఈ నెల 27, 28 తేదీల్లో.. టీడీపీ మహానాడు ఘనంగా నిర్వహించేందుకు సిద్ధమైంది. ఈ నెల 27న ప్రతినిధుల సభ, 28న మహానాడు భారీ బహిరంగ సభ జరగనుంది. టీడీపీ ప్లీనరీ సమావేశాలకు 15 వేల మందికి పైగా వస్తారని అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో.. మహానాడు ప్రతినిధుల సభకు రావాలంటూ టీడీపీ అధినేత చంద్రబాబు .. తన డిజిటల్ సంతకంతో ఆహ్వానాలు పంపుతున్నారు. తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని ఎన్టీఆర్ ప్రపంచానికి చాటిచెప్పారని చంద్రబాబు కొనియాడారు. రాష్ట్ర, దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులకు ప్రజలు నాంది పలికారని చంద్రబాబు కీర్తించారు. మహానాడు వేదికగా ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తామని చంద్రబాబు వెల్లడించారు. ప్రతి ఏటా ఎన్టీఆర్ జయంతి మే 28న మహానాడు జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోందని ఆయన తెలిపారు.
రాజమండ్రి మహానాడులో అన్ని అంశాలపై చర్చలు ఉంటాయని అన్నారు. రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, సంస్థాగత అంశాలపై చర్చిద్దాం అంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రభుత్వ ప్రజావ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక నిర్ణయాలపై చర్చ చేపడతామని చంద్రబాబు తెలిపారు. మే 28న భారీ బహిరంగ సభ ఉంటుందని చంద్రబాబు వెల్లడించారు. TDP పెద్ద పండుగగా చెప్పుకునే మహానాడును అత్యంత ఘనంగా నిర్వహించాలని చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు. 41 ఏళ్ల పార్టీ ప్రస్థానాన్ని చాటేలా మహానాడు ఉండాలని.. అలాగే భవిష్యత్ ప్రయాణంపై దిశానిర్ధేశం చేసేలా కార్యక్రమం ఉండాలని అభిప్రాయపడ్డారు. వివిధ వర్గాలనుంచి వస్తున్న స్పందన చూస్తే ప్రభంజనంలా మహానాడుకు ఉండబోతుందని చంద్రబాబు అభిప్రాయ పడ్డారు.
మొదటి రోజు జరిగే ప్రతినిధుల సభకు దాదాపు 12 వేల మందికి ఆహ్వానాలు పంపుతున్నట్లు పార్టీ నేతలు చంద్రబాబుకు వివరించారు. జగన్ ప్రభుత్వ తీరుపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు అధికారులు కానీ.. ఇటు ప్రభుత్వంలోని వ్యక్తులు కానీ.. వీటికి భవిష్యత్‌లో మూల్యం చెల్లిస్తారని చంద్రబాబు హెచ్చరించారు. జగన్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించినంత మాత్రాన మహానాడు ఆగదని.. మహానాడు అనేది పార్టీ పండుగ అయినప్పటికీ.. ఈసారి ప్రజలను నుంచి భారీ మద్దతు లభిస్తుందని చంద్రబాబు అన్నారు. మహానాడుకు సౌకర్యాలు, వేదిక నిర్మాణం, భోజన, వసతి కల్పనలో భాగస్వామ్యం అయ్యేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ప్రజల నుంచి వస్తున్న స్పందన రాష్ట్రంలో రాజకీయ పరిస్థితికి దర్పణమని చంద్రబాబు అన్నారు. రాయలసీయ పర్యటనకు కూడా పోలీసులు సహకరించలేదని.. మహానాడుకు కూడా వారు సహకరించే అవకాశం లేదని చంద్రబాబు తెలిపారు. పార్టీ కార్యకర్తల సహకారంతోనే కార్యక్రమం పటిష్టంగా నిర్వహించుకోవాలని సూచించారు. దీని కోసం ఎప్పుడూ ఉండే .. టీడీపీ కార్యకర్తల వ్యవస్థను ఉపయోగించుకోవాలని చంద్రబాబు చెప్పారు. మహానాడులో రెండు రాష్ట్రాలకు సంబంధించి 15 తీర్మానాలు ఉండే అవకాశం ఉందని.. దీనిపై మాజీ మంత్రి యనమల రామకృష్ణుడి నేతృత్వంలో తీర్మానాల కమిటీ ప్రతిపాదనలు సిద్దం చేస్తుందన్నారు.