- 5 ప్రధాన అంశాలపై సంతకాలు
- 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఆమోదం
- ప్రజల ఆస్తులకు భరోసా ఇస్తూ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉపసంహరణ
- ఒక్క విడతలోనే పింఛన్ రూ. 4 వేలకు పెంపు
- అన్న క్యాంటీిన్ల పునరుద్ధరణ
- దేశంలోనే మొదటిసారిగా చేపట్టనున్న నైపుణ్య గణన
రాష్ట్ర ప్రజల భారీ మద్దతుతో ఎన్నికల్లో అఖండ విజయం సాధించిన ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గురువారం నాడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. గత ఐదేళ్ల పాలనలో విధ్వంసానికి గురైన రాష్ట్ర పునర్నిర్మాణానికి చంద్రబాబు నాయకత్వాన్ని కోరుతూ అండగా నిలిచిన ప్రజల ఆకాంక్షల మేరకు ఆ దిశగా ప్రమాణ స్వీకారం చేసిన మొదటి రోజే ముఖ్యమంత్రి చంద్రబాబు వడివడిగా అడుగులు వేశారు.
ఎన్నికలకు ముందు రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేసి రాష్ట్ర ప్రజల సమస్యలను, కోరికలను గుర్తించిన చంద్రబాబు ఆ మేరకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తరువాత తీసుకునే మొదటి నిర్ణయాలను ప్రజలకు వివరించారు. చెప్పిన మాటలకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న సాయంత్రం 4.41 నిమిషాలకు పదవీ బాధ్యతలు చేపట్టిన వెంటనే 5 ప్రతిపాదనలపై సంతకాలు చేశారు.
ఎన్నికల పర్యటనల సందర్భంగా.. ముఖ్యమంత్రి అయ్యాక మెగా డీఎస్సీ అంశంపై తొలి సంతకం చేస్తానని.. రైతులు, సామాన్య ప్రజల భూములు, ఆస్తులను దోచుకునే విధంగా జగన్ రెడ్డి ప్రభుత్వం రూపొందించిన ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఉపసంహరణపై రెండో సంతకం చేస్తానని చంద్రబాబు బహిరంగంగా ప్రకటించారు. ఆ మేరకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి రెండు సంతకాలు చేశారు. వీటితోపాటు మరో మూడు అంశాలపై ఆయన తన ఆమోదాన్ని తెలిపారు. అవి.. నెలవారీ పింఛన్ ను రూ. 4 వేలకు పెంచటం, అన్న క్యాంటీిన్ల పునరుద్ధరణ, నైపుణ్య గణన(స్కిల్ సెన్సస్) .
ఆచితూచి మూడు అంశాలపై సంతకాలు
గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన 5 సంతకాలు మూడు ప్రధాన అంశాలకు చెందినవిగా ఉన్నాయి. పేదల నేటి అవసరాలు తీర్చటానికి రెండు అంశాలు, నవ సమాజ నిర్మాణానికి కీలకమైన యువత ఉజ్వల భవిష్యత్తు కోసం మరో రెండు. రాష్ట్ర ప్రజల ఆస్తి హక్కు పరిరక్షణ కోసం ఒక సంతకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు చేయటం గమనార్హం. ఈ సంతకాల ద్వారా ఆయన ఒక స్పష్టమైన సందేశాన్ని ఇచ్చారు. ప్రస్తుత కష్టాల్లో పేదలను ఆదుకునే సంక్షేమాన్ని కొనసాగిస్తానని, దీంతోపాటు యువత రేపటి కోసం చిత్తశుద్ధితో కృషి చేస్తామని, ప్రజల ఆస్తులకు రక్షణ కల్పిస్తామని నిన్నటి తమ సంతకాల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు తెలిపారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం.
భారీస్థాయిలో మెగా డీఎస్సీ
2019 ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో 23 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ ద్వారా వాటిని భర్తీ చేస్తామని ఊదరగొట్టారు. అధికారంలోకి వచ్చాక ఇచ్చిన మాటను పూర్తిగా మరచి, ప్రతిపక్షాల తీవ్ర విమర్శల నేపథ్యంలో ఇటీవల జరిగిన ఎన్నికలకు ముందు కేవలం 6 వేల టీచర్ పోస్టుల భర్తీకి మొక్కుబడిగా నోటిఫికేషన్ జారీ చేసి మమ అనిపించుకుని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తమ నయవంచనను వెల్లడిరచుకున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగం తీవ్రస్థాయిలో ఉన్నా, భారీ స్థాయిలో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా ముఖ్యమంత్రి జగన్ రెడ్డిలో ఐదేళ్లుగా ఎటువంటి స్పందన లేదు.
యువత శక్తిసామర్థ్యాలను పూర్తిస్థాయిలో తగు విధంగా వినియోగించుకోవటంలో పూర్తి విశ్వాసం కలిగివుండే చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 16,347 టీచర్ పోస్టుల భర్తీకి ఆదేశాలిస్తూ మొదటి సంతకం చేయటం గమనార్హం.
నైపుణ్య గణన-దేశంలో మొదటి సారి
దేశ వ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతున్నా రాష్ట్రంలో ఈ సమస్య మరీ తీవ్రంగా ఉంది. వివిధ స్థాయిల వరకు చదువుకున్న యువతకు తగు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించక వారు తీవ్ర నైరాశ్యానికి గురై గంజాయి, మాదకద్రవ్యాలకు బానిసలై సామాజిక సమస్యలకు కారణమౌతున్నారు. యువత నిరుద్యోగులుగా మిగిలిపోవటానికి ప్రధాన కారణం వారు చదువుకున్న చదువులు నేటి తరుణంలో ఉద్యోగాలకు తగిన విధంగా ఉండకపోవటం. వివిధ ఉద్యోగాలకు అవసరమైన సాంకేతిక నిపుణత లేని కారణంగా యువతకు ఉద్యోగాలు లభించటంలేదు.
ఈ సమస్య స్వరూపాన్ని గుర్తించిన చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా యువత యొక్క ప్రస్తుత నైపుణ్యతలను గుర్తించి వారిని ఉద్యోగార్హులను చేయటానికి అవసరమైన నైపుణ్యాలను గుర్తించటానికి రాష్ట్ర వ్యాప్తంగా నైపుణ్యగణనను చేపట్టటానికి ఆదేశాలిచ్చారు. దేశంలో ఇటువంటి గణన చేపట్టటం ఇదే మొదటిసారి. తగు విధంగా నైపుణ్య గణనను చేపట్టి యువతలో తగు మేరకు నైపుణ్య సామర్థ్యతను పెంచగలిగితే నిరుద్యోగ సమస్యను చాలా వరకు పరిష్కరించవచ్చని.. ఈ దిశలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం ప్రశంసనీయమని నిపుణుల అభిప్రాయం.
సంక్షేమ సంతకాలు
మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు హయాంలో నెలకు 30 రూపాయలతో మొదలైన పింఛనును రూ. 2 వేలకు గతంలో పెంచిన చంద్రబాబు ఎన్నికల హామీ మేరకు ఆ సహాయాన్ని నెలకు రూ. 4 వేలకు పెంచుతూ గురువారం నాడు సంతకం చేశారు. గతంలో చంద్రబాబు ప్రభుత్వం అందించిన నెలవారీ పింఛన్ ను మరో వెయ్యి పెంచటానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఐదేళ్ల సమయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఒకే సంతకంతో పింఛన్ సాయాన్ని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచటం పేదలకు బాగా మేలు చేస్తుంది.
నవ్యాంధ్ర మొదటి ముఖ్యమంత్రిగా వినూత్న రీతిలో అన్న క్యాంటీన్ల పేరుతో లక్షలాది మంది పేదలకు కేవలం రూ. 5కే భోజనాన్ని అందించిన చంద్రబాబు పథకాన్ని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్దాక్షిణ్యంగా రద్దు చేశారు. పేదలు ఎంతగానో ఆదరించిన ఈ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న పునరుద్ధరించి పేదల సంక్షేమం పట్ల తమ నిబద్ధతను చాటుకున్నారు.
ప్రజల ఆస్తులకు భరోసా
తాత ముత్తాతలు, తల్లిదండ్రుల వారసత్వంతో పాటు తాము కష్టించి సమకూర్చుకున్న భూములు, ఇతర ఆస్తులు అతి సులువుగా అన్యాక్రాంతమయ్యే విధంగా గత జగన్ రెడ్డి ప్రభుత్వం ల్యాండ్ టైట్లింగ్ యాక్టు ను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేసింది. ప్రజల మనోభావాలను గుర్తించిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఈ చట్టాన్ని ఉపసంహరిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి.. ఆ మేరకు నిన్న ముఖ్యమంత్రిగా రెండవ సంతకం చేసి ప్రజలకు భారీ ఊరట కల్పించారు.