కొన్ని సంవత్సరాల క్రితం విడుదలైన తెలుగు సినిమాలో ఒక సన్నివేశం వుంటుంది. ఒక హాస్యనటుడు ని ఉద్దేశించి నీ పేరేమిటి అని అడుగుతారు. నా పేరు ఎర్రోడు (ఎర్రని వాడు) అని చెబుతాడు. అదేమిటి నువ్వు నల్లగా వుంటావు కదా ఎర్రోడు అని పెట్టుకున్నావు ఏమిటి? అని అడుగుతాడు. అందుకే నన్ను ఎవడైనా ఎర్రోడు అని పిలవాల్సిందే అంటాడు. సిఎం జగన్ పదేపదే ‘ దమ్ము ‘ గురించి మాట్లాడటం సరిగ్గా ఈ సన్నివేశాన్ని గుర్తుకు తెస్తుంది. దమ్ముంటే ఒంటరిగా 175 స్థానాలకు పోటీ చేయాలని ప్రతిపక్షాలకు సవాల్ విసరటం సిఎం లో ప్రబలుతున్న అసహనాన్ని ప్రస్ఫుటం చేస్తోంది. ప్రతిపక్షాలు ఒంటరిగా కాకుండా పొత్తులతో పోటీ చేస్తే ఎన్నికలలో తన పరాజయం తథ్యం అన్న విషయాన్ని సిఎం స్వయంగా అంగీకరించినట్టు భావించవచ్చు.
రాజకీయ పార్టీల మధ్య పొత్తులు అనేవి కేవలం బలం పెంచుకోటానికి మాత్రమే ఉద్దేశించినట్టు భావించ నక్కర్లేదు. 2019 ఎన్నికలలో బిజేపి కి సంపూర్ణ సంపూర్ణ మెజారిటీ వచ్చినప్పటికీ, సంకీర్ణం వైపే మొగ్గు చూపిన విషయం మరువకూడదు. పొత్తులు అనేవి ప్రజల అభిలాషలు ప్రతిబింబింప చేయటానికి ఒక సాధనంగా ఉపయోగపడతాయి. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందా? లేక పొత్తులు పెట్టుకుంటుందా అనేది అప్రస్తుతం. ఎన్నికల సమయంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా టిడిపి నిర్ణయం తీసుకుంటుంది. అది పూర్తిగా ఆ పార్టీ అంతర్గత వ్యవహారం. ఎన్నికలతో నిమిత్తం లేకుండా ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై టిడిపి పోరు సలుపుతోంది. ప్రజాక్షేత్రంలో దూసుకుపోతున్నది. ప్రభుత్వ వ్యతిరేక పోరులో భావసారూప్యత, కలిగిన కొన్ని పార్టీలు టిడిపితో కలిసి పనిచేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేశాయి. దానిని పొత్తులుగా ఊహించుకొని వైసీపీ నాయకులు రాద్ధాంతం చేస్తున్నారు. టిడిపి పట్ల రెచ్చగొట్టే ధోరణులతో వ్యాఖ్యానాలు చేస్తూ గందరగోళానికి తెర తీయాలనేది వైసీపీ పన్నాగంగా కానవస్తోంది.తెలుగుదేశం పార్టీ ఆవిర్భావమే జాతీయ రాజకీయాలలో మలుపుకు కారణమయింది.
జాతీయ స్థాయిలో ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించిన చరిత్ర వుంది. ఏ పార్టీ అయినా పొత్తు పెట్టుకుంటే అది ఆ పార్టీ బలహీనతగా భావించనక్కర్లేదు. ప్రజాకంటకంగా వున్న పార్టీని గద్దె దింపి, దానిని ప్రజావిజయంగా చాటి చెప్పేందుకు పొత్తులు దోహద పడతాయి. ఆ ఉద్దేశంతోనే తెలుగుదేశం పలు సందర్భాలలో ఎన్నికల పొత్తులు కుదుర్చుకొని అద్భుత విజయాలను నమోదు చేసింది. వచ్చే ఎన్నికలలో పోటీకి టిడిపి శ్రేణులు సర్వ సన్నద్ధంగా వున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉత్సాహం, పట్టుదల టిడిపి శ్రేణుల్లో కానవస్తోంది. తెలంగాణ లోనూ టిడిపి పోటీకి సిద్ధమైంది. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో టిడిపి దూసుకెళుతుండటం అధికార పార్టీలో కలకలం రేకెత్తింది. దీంతో సిఎం స్వయంగా రంగంలోకి దిగి ఒంటరిగా పోటీ చేసే దమ్ముందా అంటూ మైండ్ గేమ్ ప్రారంభించారు. తనకు మాత్రమే ‘ దమ్ము ‘ వున్నదని అర్థం వచ్చే రీతిలో సిఎం మాట్లాడటం సినిమాలో సన్నివేశాన్ని తలపిస్తోంది. తెలంగాణ ఎన్నికలలోనూ వైసీపీ ఇదే దమ్ము చూపిస్తుందా? అనేదానిపైనా సిఎం వివరణ ఇస్తే బాగుండేది. ప్రజల మధ్యకు వెళ్ళే సమయంలో పరదాలు కట్టుకోవటం, అక్కడి విపక్షాల నాయకులను ముందస్తు అరెస్ట్ లు, గృహనిర్బంధం వంటివి చేయటం వంటివి ‘ దమ్ము ‘ అన్న పదానికి మరో అర్థాన్ని ఇస్తాయా? అన్నది అధికారపార్టీ నాయకులే చెప్పాలి.
దమ్ము అంటే చంద్రబాబుదే!
ప్రస్తుత పరిస్థితుల్లో ‘ దమ్ము ‘ అన్న పదం చంద్రబాబుకి అతికినట్టు సరిపోతుంది. అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నా వెరవకుండా 7పదుల పైబడిన వయసులోనూ అలుపెరగకుండా ప్రజల మధ్య తిరుగుతున్న చంద్రబాబు దమ్ము కు ప్రతిరూపం. అధికార బలంతో టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తలను వేధింపులకు గురిచేస్తున్నా, వెనుకంజ వేయకుండా వారిని కాపాడుకుంటాయి వారి ముందు రొమ్ము విరుచుకు నిలబడిన చంద్రబాబు ను మించిన ధీరుడు ఎవరున్నారు? ప్రత్యర్థుల అడ్డాల్లోనే వారిని ఖబడ్దార్ అంటూ హెచ్చరిస్తున్న ధైర్యం చంద్రబాబు సొంతం. చంద్రబాబు ‘ దమ్ము ‘ అమరావతి నిర్మాణానికి జరిపిన భూ సమీకరణ లో కనిపిస్తుంది. రెవెన్యూ లోటు వున్నప్పటికీ, ప్రజలకు నొప్పి తెలియకుండా, పన్నుల భారం, చార్జీల పెంపు లేకుండా సంక్షేమం, అభివృద్ధి జరిపిన తీరులో చంద్రబాబు దమ్ము గోచరిస్తుంది. యువగళం పాదయాత్రలో అడుగడుగునా సృష్టిస్తున్న ఆటంకాలను అధిగమిస్తూ ప్రజలకు నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్న లోకేష్ కు వున్న దమ్ము అందరికీ తెలిసిందే. తాను తెచ్చిన కంపెనీల ముందు నిల్చొని సెల్ఫీలు దిగుతున్న లోకేష్ విసురుతున్న సవాళ్లు స్వీకరించటానికి అధికార పార్టీ లో ఎవరూ ముందుకు రావడం లేదు. అదే అసలు సిసలైన దమ్ము అంటే.