క్షేత్రస్థాయిలో సమస్యలు నేరుగా తెలుసుకుంటున్న లోకేష్
సామాజిక సమస్యలు, ఆకాంక్షలపై సాధికార సమితి ల అధ్యయనం
మౌలిక సదుపాయాలు, ప్రమాణాల పెంపుపై నిపుణుల సలహాలు,సూచనలు
యువగళం పాదయాత్రతో అన్నివర్గాలలో భరోసా
రానున్న ఎన్నికలకు సంబంధించి ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మేనిఫెస్టో రూపొందించాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయించింది. అందుకు అనుగుణంగా తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు స్వయంగా తెలుసుకుంటున్నారు. ఇప్పటికే పలు సాధికార సమితి లు ఏర్పాటు చేశారు. ఆ సమితి నాయకులు రాష్ట్రంలోని ఆయా వర్గాలకు సంబంధించి సమస్యలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి, ఆ వర్గాల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలపై పార్టీ అధినేతకు నివేదిక అందజేస్తారు. వాటిలో ఆచరణ సాధ్యమైన వాటినన్నిటిని మేనిఫెస్టో లో పొందుపరచి ప్రభుత్వం ఏర్పాటు కాగానే నూరుశాతం అమలు చేయాలని పార్టీ అధినేత కృతనిశ్చయంతో వున్నారు.
విజన్ 2047లో భాగంగా పేదరిక నిర్మూలన దిశగా టిడిపి కార్యాచరణ రూపొందిస్తున్నది. అందుకు సూచికగా పి 4 సిద్ధాంతాన్ని చంద్రబాబు ప్రజల ముందుంచారు. ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు, పార్టనర్ షిప్ (భాగస్వామ్యం) అనే సైద్ధాంతిక కార్యాచరణతో పేదరిక నిర్మూలనకు కంకణం కట్టుకున్నారు. సామాజిక పరంగా వివిధ వర్గాల నుంచి అభిప్రాయాలు, ఆకాంక్షలు తెలుసుకోవటం తో పాటు వివిధ రంగాలలో మౌలిక సదుపాయాలు కల్పన, ప్రమాణాలు పెంపు కు తీసుకోవలసిన చర్యల గురించి సంబంధిత రంగాలలో అనుభవజ్ఞుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. అందరి అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం అన్నింటినీ క్రోడీకరించి నిర్దిష్ట కార్యాచరణ రూపొందించే అవకాశం ఉంది.
అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర లో క్షేత్ర స్థాయిలో ప్రజాసమస్యలు నేరుగా తెలుసుకుంటున్నారు. ప్రతిరోజూ కొన్ని వేల మంది లోకేష్ ను కలుస్తూ వారి సమస్యల గురించి విన్న వించుకుంటున్నారు. ఏమాత్రం విసుగూ విరామం లేకుండా ప్రతి ఒక్కరి సమస్యను లోకేష్ శ్రద్ధగా విని నోట్ చేసుకుంటున్నారు. వాటిలో ఆచరణ సాధ్యమైన వాటిపై అక్కడికక్కడే నిర్దిష్ట హామీ ఇస్తున్నారు. సాంకేతికంగా లేదా ఇతరత్రా ఏదైనా అధ్యయనం చేయాల్సిన అంశాలపై పార్టీ పరిశీలన జరిపి నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు. లోకేష్ పర్యటనతో అన్నివర్గాల ప్రజలకు ఒక భరోసా ఏర్పడింది. ప్రజలతో లోకేష్ మమేకం అవుతున్న తీరు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది.