- ప్రమాణం చేయించిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- బాబును ఆప్యాయంగా ఆలింగనం చేసుకున్న ప్రధాని
- తరలివచ్చిన పలువురు కేంద్ర మంత్రులు
- రాష్ట్ర పునర్నిర్మాణానికి కేంద్రం అండగా ఉంటుందనే సంకేతాలు
గన్నవరం: అతిరథ మహారథులు, అశేష జనం సాక్షిగా టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. ఎన్నికల ప్రచారంలో అలుపే తెలియని రీతిలో అహోరాత్రులు చంద్రబాబు పడిన కష్టానికి ఫలితం దొరికింది. ప్రధాని నరేంద్రమోదీ సహా పలువరు దిగ్గజ నాయకుల సమక్షంలో మహోన్నత ఘట్టం ఆవిష్కృతమయ్యింది. గన్నవరం సమీపంలోని కేసరపల్లి ఐటీ పార్క్‌లో బుధవారం ఉదయం ప్రధాని మోదీ ముఖ్యఅతిథిగా హాజరై, అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు చేత రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రమాణ స్వీకారం చేయించారు.
నారా చంద్రబాబు నాయుడు అనే నేను.. అని చంద్రబాబు అనగానే సభా ప్రాంగణమంతా కేకలు, చప్పట్లు, కేరింతలు, ఈలలతో మార్మోగిపోయింది. శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా… రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికి న్యాయం చేకూర్చుతానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అంటూ చంద్రబాబు ప్రమాణం ఆచరించారు.
ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం చంద్రబాబును ప్రధాని మోదీ ఆప్యాయంగా ఆలింగనం చేసుకొని మీ వెనుక నేనున్నానంటూ వెన్ను తట్టారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ తదితరులు చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తనయుడు రామకృష్ణ, ఇతర కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. ప్రధానితో పాటు బీజేపీ అగ్రనేతలైన కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నితిన్ గడ్కరీ ఈ ప్రమాణ స్వీకారానికి హాజరై దెబ్బతిన్న రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం అన్ని విధాలా అండగి ఉంటుందనే సంకేతాన్ని ఇచ్చారు. వీరే కాకుండా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్, చిరాగ్ పాశ్వాన్, రాందాస్ అథవాలే, అనుప్రియా పాటిల్ కూడా హాజరయ్యారు.
ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మాజీ సీజేఐ ఎన్వీ రమణ, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, తెలంగాణ బీజేపీ నేత ఈటల రాజేందర్, ఇక మెగాస్టార్ చిరంజీవి సహా ఆయన కుటుంబం, తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్, ఆయన సతీమణి, పలువురు సినీ నటులు, పలు పార్టీలకు చెందిన నేతలు హాజరయ్యారు.
కార్యక్రమంలో మంత్రులుగా మరో ఇరవై నాలుగు మంది ప్రమాణం చేశారు. వీరిలో జనసేన తరపున ముగ్గురు, బీజేపీ తరపున ఒక్కరు ఉన్నారు. చంద్రబాబు మంత్రివర్గంలో యువత ఎక్కువగా ఉన్నారు. మొదట చంద్రబాబు, తర్వాత పవన్ కల్యాణ్.. ఆ తర్వాత లోకేష్ అలా ప్రమాణ వరుస సాగిపోయింది. చంద్రబాబు, పవన్, లోకేష్ ప్రమాణం చేస్తున్నప్పుడు సభా వేదిక దద్దరిల్లిపోయింది. మంత్రివర్గంలో యువతకు, బీసీలకు ప్రాధాన్యత ఇచ్చారు. మొత్తం 24 మందిలో 9 మంది బీసీలకు అవకాశం కల్పించారు.
కార్యక్రమానికి ఊహించిన దాని కంటే పెద్ద ఎత్తున ప్రజలు తరలి వచ్చారు. పార్టీల ముఖ్య నేతలు.. ఇతరులతో గ్యాలరీలన్నీ ప్రముఖులతో నిండిపోయాయి. చంద్రబాబు ప్రమాణానికి ఢల్లీి నుంచి పలువురు ప్రముఖులు తరలి వచ్చారు. ప్రమాణానికి ముందు వీరంతా.. అక్కడి సభా ఏర్పాట్లను.. జనాలను చూసి ఆశ్చర్యపోయారు. మొత్తంగా చంద్రబాబు 4.0 ప్రభుత్వం ఓ పండగలా కొలువుదీరింది. ఉదయం 11:27 గంటలకు ప్రమాణస్వీకార ముహూర్తం కాగా.. ఉదయం 8 గంటల నుంచే జనం వచ్చారు. ఉదయం 9 గంటలకే సభావేదిక కిక్కిరిసిపోయింది. వీఐపీ పాసులున్నప్పటికీ చాలామంది సీట్లు లేక నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. వేదిక అయిన గన్నవరం మొత్తం పసుపుమయం అయింది. అన్ని ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. పాసులే పాతికే వేల వరకూ పంపిణీ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహా పలువురు కీలక నేతలు వస్తూండటంతో పటిష్టమైన ఏర్పాట్లు చేశారు. విశాలమైన స్థలంలో సభా ప్రాంగణం ఏర్పాటు చేశారు. వాహనాలన్నీ పదికిలోమీటర్ల వరకూ ఎక్కడివక్కడ ఆగిపోయాయి.
రాష్ట్రంలో జగన్‌రెడ్డి ప్రభుత్వం మారాలని, చంద్రబాబు సీఎం కావాలని ప్రజలు ఎంతగా ఎదురు చూశారో ప్రమాణ స్వీకారం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న సందడే తెలియజేసింది. వివిధ నియోజకవర్గాల నాయకులు, ముఖ్య కార్యకర్తలు ప్రమాణస్వీకారానికి తరలివచ్చినా, అన్ని నియోజకవర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడికక్కడ భారీ ఎల్‌ఈడీ తెరలు ఏర్పాటు చేసుకుని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని లక్షలాది జనం వీక్షించారు.
చంద్రబాబు నాయుడు 4వసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టి సరికొత్త రికార్డు నెలకొల్పారు. సమైక్య రాష్ట్రంలో రెండుసార్లు, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండుసార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడుకి ఇంతకు ముందు ముఖ్యమంత్రిగా 14 ఏళ్ల అనుభవం ఉంది. ఇప్పటి వరకు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన ఏకైక తెలుగు నాయకుడిగా చరిత్ర ఉన్న నేపథ్యంలో మరోసారి సీఎం పదవిని చేపట్టి తన రికార్డును తానే తిరగరాసుకున్నారు. ఇప్పుడు 4వ సారి మరో 5 ఏళ్ళు కూడా కలుపుకుంటే దాదాపు రెండు దశాబ్దాలు ముఖ్యమంత్రిగా చేసిన నాయకుడిగా రాష్ట్ర చరిత్రలో నిలుస్తారు.
అయితే చంద్రబాబు గతంలో మూడుసార్లు సమర్థ పాలన అందించినప్పటికీ ఎప్పుడూ లేనంత చిక్కుల వలయం ఈసారి రాష్ట్రాన్ని కమ్ముకుని ఉంది. జగన్‌రెడ్డి విధ్వంస రాజకీయాల కారణంగా ఐదేళ్లుగా సర్వనాశనమైన రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి బాట పట్టించటం, పరిశ్రమలు, ఐటీి కంపెనీలను రప్పించి ఉద్యోగాలు కల్పించడం, అమరావతి, పోలవరం నిర్మాణ పనులను పూర్తిచేయడం వంటి చాలా బాధ్యతలు ఆయన భుజాలపై ఉన్నాయి. ఇవన్నీ సరిచేస్తూనే ఇచ్చిన హామీలు నెరవేర్చడంతో పాటు నిజమైన అభివృద్ధి అంటే ఏంటో నిరూపించాల్సిన గురుతర బాధ్యత టీడీపీ కూటమి మీద ఉంది. 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు నాయుడుకి మరోసారి తన సమర్ధతని నిరూపించుకునే అవకాశం లభించిందని భావించవచ్చు.