అమరావతి, చైతన్యరథం: గత పలు నెలలుగా రాష్ట్రమంతటా కలియ తిరుగుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి విధ్వంసక పాలనతో ప్రజా జీవనం అధోగతి పాలైన వైనాన్ని వివరిస్తూ… త్వరలో జరగనున్న ఎన్నికల్లో ప్రజాక్షేమం కోసం, ప్రజల ఉన్నత భవిష్యత్ కోసం అధికార వైసీపీని ఓడిరచవలిసిన అవసరాన్ని వివరిస్తున్న ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు ఒక వినూత్న ప్రజా సంపర్క యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు.
ఈనెల 6 నుంచి ‘ప్రజాగళం’ పేరుతో తెదేపా జాతీయ అధ్యక్షులు ఈ యాత్రను చేపట్టనున్నారు. ఐదు రోజుల పాటు సాగే మొదటి విడత యాత్రలో చంద్రబాబు 10 లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని 10 అసెంబ్లీ స్థానాల్లో ప్రజలతో వినూత్న రీతిలో మమేకం కానున్నారు. యాత్ర వివరాలను ముందుగానే ప్రకటించి ఎంపిక చేసిన చోట్ల ఆయా ప్రాంతాల ప్రజల నుండి వారు ఎదుర్కొంటున్న సమస్యల వివరాలను ఆయన తెలుసుకుంటారు. ఈ ‘ప్రజాగళం’ సభలకు హాజరయ్యే వారికి పార్టీ తయారు చేసిన సమస్యల స్వీకరణ పత్రాలను అందజేస్తారు. ఆయా ప్రాంతాల ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను ప్రజలు వాటిలో లిఖిత పూర్వకంగా వివరించి ఆ పత్రాలను చంద్రబాబుకు అందజేస్తారు.
ఈ విధంగా అందిన సమస్యల వివరాలను పార్టీ యంత్రాంగం క్షుణ్ణంగా మదింపు చేస్తుంది. త్వరలో జరగనున్న ఎన్నికల అనంతరం తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వంద రోజుల్లో ప్రజలు తెలియజేసిన సమస్యలను పరిష్కరిస్తామని చంద్రబాబు భరోసా ఇస్తారు. ఈ విధంగా… ప్రజాగళం యాత్ర ప్రజా సమస్యల పరిష్కార భరోసా యాత్రగా కొనసాగుతుంది.
ఇప్పటికే ‘బాబు ష్యూరిటీ`భవిష్యత్తు గ్యారంటీ’ పథకాన్ని వివరిస్తూ తెదేపా నాయకులు, శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటి కుటుంబాల వారిని కలిసి.. ఈ సూపర్ సిక్స్ పథకం కింద కుటుంబ సభ్యులందరికీ కలిపి తెదేపా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత లభించే మొత్తం లబ్ధి వివరాలను లిఖిత పూర్వకంగా తెలియజేసి… వాటి అమలుకు చంద్రబాబు సంతకంతో కూడిన హామీ పత్రాన్ని అందజేయడం జరిగింది. ఇది సంక్షేమ పథకాల అమలుకు చంద్రబాబు ఇచ్చిన భరోసా కాగా తాజాగా చంద్రబాబు చేపట్టనున్న ప్రజాగళం యాత్ర ప్రజల ఇతర సమస్యల పరిష్కారానికి రెండోవ భరోసా కానుంది.